రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ రంగంలో ఆత్మనిర్భరత: సుఖోయ్-30ఎంకేఐ ఎయిర్ క్రాఫ్ట్ కు 240 ఏఎల్-31ఎఫ్ పీ ఏరో ఇంజిన్ల కోసం హెచ్ఏఎల్ తో రక్షణ శాఖ రూ. 26,000 కోట్ల ఒప్పందం
Posted On:
09 SEP 2024 2:19PM by PIB Hyderabad
ఆత్మ నిర్భర భారత్ కు ఊతమిస్తూ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో రక్షణ మంత్రిత్వ శాఖ రూ. 26,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. సుఖోయ్-30ఎంకేఐ ఎయిర్ క్రాఫ్ట్ కోసం 240 ఏఎల్-31ఎఫ్ పీ ఏరో ఇంజిన్ల తయారీకి ఉద్దేశించిన ఒప్పందమిది. రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ ఆరమణె, వాయుసేన అధిపతి మార్షల్ వీఆర్ చౌదరి సమక్షంలో రక్షణ శాఖ, హెచ్ఏఎల్ సీనియర్ అధికారులు న్యూఢిల్లీలో సోమవారం ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
ఈ ఏరో ఇంజిన్లను హెచ్ఏఎల్ కోరాపూట్ విభాగం తయారు చేస్తుంది. సుఖోయ్-30 విమానాల నిర్వహణలో భారత వాయుసేన అవసరాలను తీరుస్తుందని భావిస్తున్నారు. తద్వారా రక్షణపరంగా దేశ సంసిద్దత మరింత మెరుగుపడుతుంది. ఒప్పందంలో పేర్కొన్న షెడ్యూలు ప్రకారం హెచ్ఏఎల్ ఏడాదికి 30 ఏరో ఇంజిన్లను సరఫరా చేస్తుంది. వచ్చే ఎనిమిదేళ్లలో మొత్తం 240 ఇంజిన్ల సరఫరా పూర్తవుతుంది.
వీటి తయారీలో ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలను భాగస్వాములను చేస్తూ దేశ రక్షణ పరికరాల తయారీ వ్యవస్థ సహకారాన్ని హెచ్ఏఎల్ తీసుకోవాలనుకుంటోంది. ఇంజిన్లు చేతికొచ్చే సమయానికి దేశీయంగా రూపొందే భాగాలను 63 శాతానికి పెంచాలని హెచ్ఏఎల్ భావిస్తోంది. తద్వారా ఈ సగటు 54 శాతానికి చేరుతుంది. ఏరో ఇంజిన్ల మరమ్మతులు, సమగ్ర పరిశీలనల్లో దేశీయీకరణను పెంచడానికి కూడా ఇది దోహదపడుతుంది.
***
(Release ID: 2053302)
Visitor Counter : 99