రక్షణ మంత్రిత్వ శాఖ
రాజస్థాన్ లో భారత్-యూఎస్ సంయుక్త సైనిక విన్యాసం యుధ్ అభ్యాస్-2024
Posted On:
09 SEP 2024 2:45PM by PIB Hyderabad
యుధ్ అభ్యాస్-2024లో భాగంగా భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు రాజస్థాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ఉన్న విదేశీ శిక్షణ కేంద్రంలో సోమవారం ప్రారంభమయ్యాయి. 20వ ఎడిషనులో భాగంగా ఈ నెల 9 నుంచి 22 వరకూ ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. 2004 నుంచి భారత్, అమెరికాలలో ఏటా ఒక్కో దేశం చొప్పున యుధ్ అభ్యాస్ విన్యాసాలను చేపడుతున్నారు.
దళాల బలోపేతం, ఆయుధ సంపత్తిపరంగా యుధ్ అభ్యాస్ పరిధి విస్తరణ, విన్యాసాల సంక్లిష్టతలను ఈ ఎడిషన్ విశేషంగా మెరుగుపరిచింది. 600 మంది సిబ్బందితో కూడిన భారత సేనకు రాజ్‌పుట్ రెజిమెంటు నేతృత్వం వహిస్తోంది. ఇందులో ఇతర సాయుధ, సేవల సిబ్బంది కూడా ఉన్నారు. అంతే సంఖ్యలో ఉన్న అమెరికా సేనకు అలస్కా 11వ వైమానిక విభాగానికి చెందిన 1-24 పటాలపు దళాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ఐక్యరాజ్యసమితి చార్టరు- ఏడో అధ్యాయంలో పేర్కొన్న ఒడంబడిక ఉప నిబంధనల ప్రకారం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరుపక్షాలూ సంయుక్తంగా సైనిక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం ఈ ఉమ్మడి విన్యాస లక్ష్యం. పాక్షిక ఎడారి ప్రాంతంలో కూడా ఈ విన్యాసాలను నిర్వహిస్తారు. ఉగ్రవాదుల దాడి జరిగినపుడు ఉమ్మడి ప్రతిస్పందన ఎలా ఉండాలన్న అంశంతోపాటు, సంయుక్త ప్రణాళికా రచన, ఉమ్మడి శిక్షణలకు ప్రాధాన్యమిస్తున్నారు. వాస్తవిక ఉగ్రవాద దాడుల్ని పోలి ఉన్న తరహాలో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతోంది.
వ్యూహాలు, నైపుణ్యాలు, సంయుక్త కార్యకలాపాల్లో- అత్యుత్తమ పద్ధతులను పంచుకోవడానికి ఈ యుధ్ అభ్యాస్ అవకాశం కల్పిస్తుంది. పరస్పర అనుసంధానానికీ, స్నేహభావాన్ని పెంపొందించడానికీ ఇది దోహదపడుతుంది. ఈ సంయుక్త సైనిక విన్యాసం- మిత్రదేశాల మధ్య రక్షణ సహకారాన్ని మెరుగుపరచడంతోపాటు, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.
(Release ID: 2053165)
Visitor Counter : 138