ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతదేశంలో ఔషధాలకు లొంగని టీబీకి సరికొత్త చికిత్స
నూతన చికిత్స విధానం స్వల్పకాలికం, మరింత సమర్థవంతం
కొత్త చికిత్స ప్రారంభానికి ఆమోదం తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
BPaLM చికిత్సలో బెడాక్విలిన్, ప్రీటోమానిడ్, లైనిజోలిడ్, మోక్సిఫ్లోక్సాసిన్ కాంబినేషన్
ఈ నాలుగు ఔషధాల ఉపయోగం సురక్షితం, మరింత ప్రభావవంతం
మునుపటి ఎండీఆర్ -టీబీ చికిత్సా విధానం కంటే వేగవంతమైనది
భారతదేశంలో టీబీ నిర్మూలన లక్ష్య సాధనలో
దేశ పురోగతికి ఊతమివ్వనున్న కేంద్ర ప్రభుత్వ చర్యలు
Posted On:
06 SEP 2024 3:14PM by PIB Hyderabad
2025 నాటికి దేశంలో టీబీని పూర్తిగా నిర్మూలించాలనే గౌరవ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశలో ప్రపంచ లక్ష్యానికి అయిదు సంవత్సరాల ముందే ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి భారత్ కృషి చేస్తుంది. దీని కోసం కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ కొత్త చికిత్సా విధానానికి ఆమోదం తెలిపింది. బహుళ ఔషధాలకు లొంగని క్షయ (ఎండీఆర్-టీబీ) కోసం జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీ) ఆధ్వర్యంలో సరికొత్త చికిత్సా విధానం బీపాల్మ్ (BPaLM) ప్రారంభానికి ఆమోదం లభించింది. ఈ చికిత్సా విధానం అత్యంత ప్రభావవంతమైనది అలాగే స్వల్పకాలిక చికిత్స. ఈ చికిత్సలో క్షయ వ్యాధిని నయం చేయడం కోసం ప్రిటోమానిడ్‌కు బెడాక్విలిన్ & లైనిజోలిడ్ (మోక్సిఫ్లోక్సాసిన్‌తో/లేకుండా) ఔషధం ఉపయోగిస్తారు. ప్రీటోమానిడ్ గతంలోనే కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) ద్వారా భారతదేశంలో ఉపయోగం కోసం ఆమోదాన్ని పొందింది.
బీపాల్మ్ చికిత్స బెడాక్విలిన్, ప్రీటోమానిడ్, లైన్జోలిడ్ అలాగే మోక్సిఫ్లోక్సాసిన్ అనే నాలుగు-ఔషధ కలయిక. మునుపటి చికిత్సా విధానం కంటే సురక్షితమైనది, మరింత ప్రభావవంతమైనది. అలాగే వేగవంతమైన చికిత్సా విధానంగా ఈ కొత్త పద్ధతి నిరూపణ అయింది. సంప్రదాయ ఎండీఆర్ టీబీ చికిత్స తీవ్రమైన దుష్ప్రభావాలతో 20 నెలల వరకు కొనసాగుతుంది. అయితే ఈ కొత్త చికిత్సా విధానం అధిక విజయవంతమైన రేటుతో కేవలం ఆరు నెలల్లోనే ఔషధాలకు లొంగని టీబీని నయం చేస్తుంది. భారతదేశంలో ఔషధాలకు లొంగని టీబీతో బాధపడుతున్న 75,000 మంది రోగులకు ఈ స్వల్పకాలిక చికిత్స ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతర ప్రయోజనాలతో పాటు, ఖర్చు కూడా ఆదా అవుతుంది.
ఆరోగ్య పరిశోధనా విభాగంతో సంప్రదించి, దేశంలోని విషయ నిపుణుల ఆధారాలను సమీక్షించి కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ఈ కొత్త టీబీ చికిత్సా విధానాన్ని నిర్ధారించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆరోగ్య పరిశోధన విభాగం ద్వారా ఆరోగ్య సాంకేతిక పరీక్షలను నిర్వహించి మొండి క్షయ చికిత్స కోసం సురక్షితమైన, సరసమైన ఎంపిక అని నిర్ధారించింది.
దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్య సాధనలో దేశ పురోగతికి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ఊతమిచ్చాయి. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదించి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ టీబీ విభాగం ద్వారా బీపాల్మ్ చికిత్సతో నిర్ధిష్ట కాలపరిమితిలో దేశ-వ్యాప్తంగా క్షయ నిర్మూలనకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. దానిలో భాగంగా నూతన చికిత్సా విధానాన్ని సురక్షితంగా అమలు చేయడానికి వీలుగా ఆరోగ్య నిపుణుల సామర్థ్యాలను పెంపొందించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు.
నేపథ్యం:
మునుపటి రివైజ్డ్ నేషనల్ ట్యుబర్‌క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఆర్ఎన్టీసీపీ) అయిన ప్రస్తుత జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీ) సుస్థిర అభివృద్ధి లక్ష్యం కంటే ఐదేళ్ల ముందే అంటే 2025 నాటికి భారతదేశంలో టీబీని వ్యూహాత్మకంగా తగ్గించే లక్ష్యంతో పనిచేస్తున్నది. 2018 మార్చిలో ఢిల్లీలో జరిగిన ఎండ్ టీబీ సదస్సులో మొదటిసారిగా ప్రధాన మంత్రి మోదీ ఈ దార్శనికతను వ్యక్తం చేశారు. 2025 నాటికి భారతదేశంలో టీబీని పూర్తిగా నిర్మూలించాలనే భారత ప్రభుత్వ లక్ష్యాన్ని స్పష్టం చేయడం కోసం 2020లో ఆర్ఎన్టీపీసీని, జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీ)గా మార్చారు. ఇది 632 జిల్లాలు/రిపోర్టింగ్ యూనిట్లలోని వంద కోట్ల మందికి చేరువైంది. అలాగే టీబీ నిర్మూలన కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిక ప్రాంతాలతో కలిసి భారత ప్రభుత్వం అయిదు సంవత్సరాల జాతీయ వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేసే బాధ్యతను నిర్వరిస్తున్నది.
మిషన్ మోడ్‌లో 2025 నాటికి టీబీని అంతం చేసే లక్ష్యాన్ని సాధించడానికి టీబీ నిర్మూలన కోసం జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక ప్రారంభం అయింది. ఇది బహుముఖ విధానం. ఇది ప్రైవేట్ వైద్యుల వద్ద చికిత్స తీసుకునే టీబీ రోగులను గుర్తించడం, టీబీ నిర్ధారణ జరగని అధిక ముప్పు గల ప్రజలలో టీబీని గుర్తించే లక్ష్యంతో పనిచేస్తుంది. రోగనిర్ధారణ జరిగిన ప్రతి టీబీ రోగికి చికిత్స ప్రారంభించే ముందే లేదా చికిత్స సమయంలోనే ఔషధాలకు లొంగని లక్షణాన్ని నిరోధించేందుకు ఎన్‌టీఈపీ ఆధ్వర్యంలో యూనివర్సల్ డ్రగ్ ససెప్టబిలిటీ పరీక్ష (యూడీఎస్టీ) నిర్వహిస్తారు.
2022, సెప్టెంబర్ 9న ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ (పీఎమ్‌టీబీఎమ్‌బీఏ)ను గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా జన్ భాగీదారి స్ఫూర్తితో యుద్ధ ప్రాతిపదికన టీబీ నిర్మూలనకు పౌరులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. టీబీ చికిత్స తీసుకునే వారికి రోగనిర్ధారణ, పోషకాహారం అలాగే ఉపాధి పరంగా అదనపు సహాయాన్ని అందించడానికి రాష్ట్రపతి ‘‘ని-క్షయ్ (Ni-kshay) మిత్ర’’ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. రోగులు పూర్తిగా కోలుకోవడంలో సహాయం చేయడానికి ఎన్నికైన ప్రతినిధులు, కార్పొరేట్లు, ఎన్జీఓలు అలాగే ప్రజలు దాతలుగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
ని-క్షయ్ (Ni-kshay) 2.0 పోర్టల్ (https://communitysupport.nikshay.in/) టీబీ రోగుల చికిత్స ఫలితాన్ని మెరుగుపరిచేందుకూ, అదనపు సాయం అందించేందుకూ ఉపయోగపడుతుంది. 2025 నాటికి టీబీ నిర్మూలన పట్ల భారతదేశ నిబద్ధతకు అనుగుణంగా సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే దీనికోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత అవకాశాలను ఉపయోగించుకుంటుంది.
భారతదేశం 7,767 వేగవంతమైన మాలిక్యులర్ టెస్టింగ్ సదుపాయాలు, అలాగే 87 కల్చర్ అండ్ డ్రగ్ ససెప్టబిలిటీ టెస్టింగ్ లేబొరేటరీలతో ప్రపంచంలోనే అతిపెద్ద టీబీ లేబొరేటరీ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఈ విస్తృత లేబొరేటరీల నెట్‌వర్క్ ఎ:డీఆర్ టీబీని సకాలంలో గుర్తించడంలో, అలాగే టీబీ చికిత్సను త్వరగా ప్రారంభించడంలో తోడ్పడుతుంది.
***
(Release ID: 2052697)
Visitor Counter : 146