వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ.35కే కేజీ ఉల్లిపాయలు


అమ్మకాలు ప్రారంభించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

రబీ ఉల్లి నిల్వలు 4.7 లక్షల టన్నులు : శ్రీ జోషి

విక్రయ కేంద్రాలు, ఎన్సీసీఎఫ్, నాఫెడ్ మొబైల్ వ్యాన్లు, ఈకామర్స్ వేదికలు, కేంద్రీయభండార్, సఫల్ ద్వారా రిటైల్ విక్రయాలు

Posted On: 05 SEP 2024 3:08PM by PIB Hyderabad

‘‘35 రూపాయలకే కిలో ఉల్లిపాయలు’’ కార్యక్రమాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇందన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈ రోజు ప్రారంభించారు. జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య(ఎన్సీసీఎఫ్), జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య(నాఫెడ్)కు చెందిన విక్రయ వాహనాలకు జెండా ఊపి అమ్మకాలు ప్రారంభించారు. వినియోగదారులకు కూరగాయలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ గోదాంలో నిల్వ ఉన్న ఉల్లిపాయల్ని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు.

 

మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడమే ప్రభుత్వ ప్రాధాన్యమని, వివిధ రూపాల్లో ప్రత్యక్షంగా చేపట్టిన ధరల స్థిరీకరణ చర్యలు ఇటీవలి మాసాల్లో ద్రవ్యోల్బణం రేటును తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషించాయని తెలిపారు.

‘‘రబీ దిగుబడిలో సేకరించిన 4.7 లక్షల టన్నుల ఉల్లి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడు వాటిని నియంత్రించడానికి ధరల స్థిరీకరణ నిధిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సూచనల మేరకు ప్రారంభించాం’’ అని శ్రీ జోషి తెలిపారు. ఉల్లిని రిటైల్ గా విక్రయించడం ద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఊరట లభిస్తుందని అన్నారు. 

ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, ధరలను స్థిరంగా ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఉల్లి నిల్వల అమ్మకం అంతర్భాగంగా ఉంది.

ప్రధాన వినియోగ కేంద్రాల్లో ఎన్సీసీఎఫ్, నాఫెడ్ మొబైల్ వ్యాన్లు, ఈకామర్స్ వేదికలు, కేంద్రీయభండార్, సఫల్ అవుట్ లెట్ల ద్వారా ఉల్లి రిటైల్ అమ్మకాలు జరుగుతాయి. ఉల్లి ధరల సరళిని అనుసరించి సరఫరా, విక్రయాలు పెంచడం లేదా తగ్గించడం చేస్తారు. దేశవ్యాప్తంగా 550 కేంద్రాల ద్వారా ఉల్లితో సహా 38 రకాల వస్తువుల ధరలను వినియోగదారుల వ్యవహారాల విభాగం, కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్నాయి. రోజువారీ ధరలు, సరళి ఆధారంగా  నిల్వల నుంచి ఏ ప్రాంతాలకు ఎంత ఉల్లి సరఫరా చేయాలో నిర్ణయిస్తారు. 

గతేడాది మూడు లక్షల టన్నుల ఉల్లి సేకరించగా ఈ ఏడాది రబీ పంట నుంచి ఎన్సీసీఎఫ్, నాఫెడ్ ద్వారా 4.7 లక్షల టన్నుల ఉల్లి సేకరించారు. రబీలో ఉల్లిసాగు ఎక్కువగా ఉండే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లోని రైతులు, రైతు సంఘాల నుంచి ఈ ఉల్లిని సేకరించారు. చెల్లింపులను రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేశారు. అన్ని దశల్లోనూ  సాంకేతికతను వినియోగించి సమీకృత వ్యవస్థ ద్వారా ఉల్లి సేకరణ, నిల్వ, సరఫరాను పర్యవేక్షించారు. 

గతేడాది పోలిస్తే ఈ రబీ సీజన్లో ధరలు మెరుగ్గా ఉన్నాయని రైతులు భావిస్తున్నారు. గతేడాది మండీ ధరలు క్వింటాలుకు రూ.693–రూ.1205 ఉంటే.. ఈ ఏడాది రూ.1230-రూ2578 మధ్య ఉన్నాయి.  అలాగే గతేడాది  క్వింటాలుకు రూ.1724 ధర లభిస్తే ఈ ఏడాది రూ.2,833 గా ఉంది. గతంతో పోలిస్తే నాణ్యమైన ఉల్లి సేకరణ ధరలు ప్రస్తుతం అధికంగా ఉన్నాయి.

గత ఏడాదితో పోలిస్తే ఖరీఫ్ లో ఉల్లి సాగు విస్తీర్ణంలో ఈ ఏడాది ఆగస్టు 26 నాటికి 102 శాతం పెరుగుదల కనిపించింది. దీంతో ఉల్లి నిల్వలు లభ్యత పెరగనుంది. ఫలితంగా ధరలు అందుబాటులో ఉంటాయని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ విభాగం అందించిన సమాచారం ప్రకారం ఆగస్టు 26 నాటికి 2.90 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు ప్రారంభమైంది. గతేడాది ఇదే సమయంలో సాగు విస్తీర్ణం 1.94 లక్షల హెక్టార్లుగా ఉంది. వీటితో పాటుగా 38 లక్షల టన్నుల ఉల్లి రైతులు, వ్యాపారుల వద్ద నిల్వ ఉన్నట్టు సమాచారం.

వినియోగదారుల వ్యవహారాల శాఖ ఉల్లి పంట లభ్యత, ధరలపై నిఘా ఉంచి వినియోగదారులు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకుంటోంది. వినియోగదారులకు సరసమైన ధరలకు ఉల్లిని అందించడంతో పాటు రైతులకు లాభదాయకంగా ఉండేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. 

దేశ రాజధాని ఢిల్లీ, ముంబయిల్లో ఈ రోజు నుంచి ఉల్లి రిటైల్ విక్రయాలు ప్రారంభమవుతాయి. మరో వారం రోజుల్లో  కోల్‌కతా, గువాహటి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, రాయ్‌పూర్, భువనేశ్వర్ నగరాల్లో ఏజెన్సీలు విక్రయాలు ప్రారంభిస్తాయి. సెప్టెంబర్ మూడోవారానికి దేశవ్యాప్తంగా పంపిణీ ప్రారంభమవుతుంది.  వీటి నిమిత్తం సహకార సంస్థలు, రిటైల్ వ్యాపార సంస్థలతో ఏజెన్సీలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.

 

***


(Release ID: 2052398) Visitor Counter : 76