ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

పారిస్ ఒలింపిక్స్‌-2024లో పాల్గొనే భార‌త క్రీడాకారుల‌తో ప్ర‌ధాన‌మంత్రి సంభాషణ తెలుగు పాఠం

Posted On: 05 JUL 2024 5:06PM by PIB Hyderabad

   ప్రయోక్త: మాన‌నీయ ప్ర‌ధాన‌మంత్రి గారు.. గౌర‌వ‌నీయ మంత్రులు.. డాక్ట‌ర్ పి.టి.ఉష గారూ!

   పారిస్ ఒలింపిక్ క్రీడ‌లకు వెళ్తున్న మ‌న క్రీడాకారుల బృందం ఇవాళ మీతో ఇష్టాగోష్ఠిలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది. వీరంతా ప్ర‌స్తుతం దేశ‌విదేశాల్లో నిర్వ‌హిస్తున్న శిక్ష‌ణ శిబిరాల్లో త‌మ ప్ర‌తిభ‌కు ప‌దును పెట్టుకుంటున్నారు. అందువల్ల వీరిలో సుమారు 98 మంది ఆన్‌లైన్ అనుసంధానం ద్వారా మీ మార్గ‌దర్శకత్వం ఆకాంక్షిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే పారిస్ బ‌య‌ల్దేరే ఈ బృందాన్ని మీ మార్గ‌నిర్దేశంతో ప్రోత్సహించాలని స‌విన‌యంగా అభ్య‌ర్థిస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు!

ప్రధానమంత్రి: ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్న, ఆన్‌లైన్ అనుసంధానంలో ఉన్న‌ వారందరికీ స్వాగ‌తం! మిత్రులారా... పారిస్ ఒలింపిక్స్‌ లో ప్ర‌తిభ‌ను చాటుకునేందుకు మీరంతా ఉవ్విళ్లూరుతున్న సంగతి నాకు తెలుసు. ఇవాళ మీ స‌మ‌యాన్ని వృథా కానివ్వ‌ను. అలాగే విజ‌య‌గ‌ర్వంతో తిరిగొచ్చే మీకు ఎలా స్వాగ‌తం ప‌ల‌కాలా అని నేనిప్ప‌టి నుంచే ఆలోచిస్తున్నాను. భార‌త క్రీడా ప్ర‌పంచంలో దిగ్గ‌జాల‌ను క‌లుసుకుని, వారి కృషిని అర్థం చేసుకుంటూ, కొత్త విష‌యాలు తెలుసుకునేందుకు నేను సదా ఎదురు చూస్తుంటాను. తద్వారా ప్రభుత్వం తరఫున వ్యవస్థాపరంగా చర్యలు తీసుకుంటూ మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఇందులో భాగంగా మీతో ముఖాముఖి సంభాషంచడమే నా లక్ష్యం.

   క్రీడాకారులను ఒక విధంగా విద్యార్థులతో పోల్చవచ్చు... ఒక విద్యార్థి పరీక్షకు వెళ్తూ తాను మంచి మార్కులు తెచ్చుకుంటానని, ఆందోళన వద్దని కుటుంబ సభ్యులందరికీ హామీ ఇస్తాడు. అయితే, పరీక్ష రాయడం పూర్తయ్యాక తానెలా రాశాడో అతనికి మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ చక్కగా రాసి ఉండకపోతే పరీక్ష గదినుంచి బయటకు రాగానే రకరకాల సాకులు చెబుతాడు. ఫ్యాన్ శబ్దం చిరాకు పెట్టిందని, కిటికీ తెరిచి ఉండటంతో వెలుపలి గందరగోళం వల్ల ఏకాగ్రత తప్పిందని, పర్యవేక్షక ఉపాధ్యాయుడు ఆద్యంతం తనపైనే చూడటం వల్ల ఇబ్బంది పడ్డానని... వగైరా సాకులతో తనకుతాను సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేస్తాడు. ఇలా సాకులను, పరిస్థితులను అడ్డుపెట్టుకునే విద్యార్థులను మీరు తప్పకుండా చూసి ఉంటారు. అయితే, అలాంటి వాళ్లు జీవితంలో ఎన్నడూ ఎదగలేరు. సాకులు చెప్పడంలో నేర్పు తప్ప ఒక్క అడుగైనా ముందుకు వేయలేని అసమర్థులుగా మిగులుతారు.

   కానీ, నేను చాలా మంది ఆటగాళ్లను పరిశీలించాను. ఓటమికి పరిస్థితులను నెపంగా చూపని కొందరు ఆటగాళ్లు నాకు తెలుసు. అలాంటివారు సాధారణంగా సాకులు వెదకరు... పైగా ‘‘ఆ టెక్నిక్ నాకు కొత్త’’, ‘‘ప్రత్యర్థి ఎత్తుగడను ఊహించలేకపోయాను. అది కూడా ఓ మంచి ఎత్తుగడే’’ అంటూ కుండబద్దలు కొట్టగలరు.

   ఈ నేపథ్యంలో మిత్రులందరికీ నేనొక మాట చెబుతున్నాను... మనం ఆడటానికి వెళ్తున్నాం, అత్యుత్తమంగా రాణించాలన్నదే మన అంతిమ లక్ష్యం. ప్రతిభా ప్రదర్శనకేగాక ఎన్నెన్నో మెలకువలు నేర్చుకోవడానికీ ఒలింపిక్స్ ఒక గొప్ప వేదిక. కొందరు తమ ఆట తాము ఆడుతూ, ఆ రోజు తమ ప్రతిభా ప్రదర్శన గురించి ఫోన్‌ ద్వారా అందరికీ చెబుతారు. మరోవైపు కొందరు ప్రతి ఆటనూ శ్రద్ధగా చూస్తూ మనమెలా ఆడుతున్నామో.. ఇతర దేశాల ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉన్నదో నిశితంగా గమనిస్తుంటారు. కొత్త పద్ధతులను పసిగట్టి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓ క్రీడాకారుడు చివరి క్షణంలో ఎంత అద్భుతంగా ప్రతిభ చూపాడో తమ శిక్షకులతో చర్చిస్తూ ఆలోచనలను పంచుకుంటారు. ఆ క్రీడాకారుడు ప్రదర్శించిన కొత్త టెక్నిక్ గురించి కోచ్‌తో మాట్లాడటమే కాకుండా కొత్త మెలకువలు నేర్చుకోవడం కోసం వీడియోలను అనేకసార్లు చూస్తాడు.

   ఏదైనా నేర్చుకునే స్వభావం ఉన్నవారికి అభ్యసన అవకాశాలెన్నో ఉంటాయి. అలాగే, నెపం చూపి తప్పించుకునే వాళ్లకూ సాకులెన్నో ఉంటాయి. అత్యుత్తమ సౌకర్యాలున్న అత్యంత సంపన్న దేశాల క్రీడాకారులు కూడా అలాంటి సాకులు చెప్పే పరిస్థితి ఉండొచ్చు. కానీ, భారత్ వంటి దేశాల క్రీడాకారులు రకరకాల ఇబ్బందులు, అసౌకర్యాల మధ్య ఎన్నో కష్టనష్టాలకోర్చి దేశం కోసం, జాతీయ పతాకను సగర్వంగా రెపరెపలాండించడమే ధ్యేయంగా మనోశరీరాలను మమేకం చేస్తారు.

   కాబట్టి, మిత్రులారా... ఈసారి కూడా క్రీడారంగంలో మీరు భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగురవేయగలరని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. సరే... ఒలింపిక్స్‌ లో తొలిసారి పాల్గొంటున్న వారెవరు? అమ్మాయిలు... అలాగే కుస్తీ క్రీడాకారులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారనిపిస్తోంది. ఒలింపిక్స్ లో మొదటిసారి అడుగుపెడుతున్న వారి మనోభావాలేమిటో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. మీలో ఎవరైనా నాతో ఆలోచనలను పంచుకోవచ్చు. మీరేదో చెప్పాలనుకుంటున్నారు... అవునా? మాట్లాడండి మరి!

క్రీడాకారిణి: నేను తొలిసారి ఒలింపిక్స్ కు వెళ్తున్నాను... నాకెంతో సంతోషంగా ఉంది.

ప్రధానమంత్రి: మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి.

క్రీడాకారిణి: నా పేరు రమితా జిందాల్.. ఒలింపిక్స్ లో తొలిసారి ఎయిర్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొనబోతున్నాను. క్రీడల్లో ప్రవేశించినప్పటి నుంచీ ఒలింపిక్స్ కు వెళ్లాలన్నది నా కల. అది నిజం కావడంతో నేనెంతో ఉప్పొంగిపోయాను. దేశం కోసం విజయం సాధించాలనే ఉద్వేగం, ఉత్తేజంతో ఎదురుచూస్తున్నాను.

ప్రధానమంత్రి: మీరెక్కడ శిక్షణ పొందుతున్నారు?

రమితా జిందాల్: మాది హర్యానా... అయితే, నేను చెన్నైలో శిక్షణ తీసుకుంటున్నాను.

ప్రధానమంత్రి: మీ కుటుంబంలో ఎవరైనా క్రీడారంగంలో ఉన్నారా లేక మీరే మొదటి వారా?

రమితా జిందాల్: ఎవరూ లేరు... మా ఇంట్లో నేనే తొలి క్రీడాకారిణిని.

ప్రధానమంత్రి: అలాగా... అయితే, హర్యానాలోని ప్రతి ఇంట్లోనూ ఓ అథ్లెట్‌ ఉండటం ఆనవాయితీ. సరే... కూర్చోండి. తొలిసారి వెళ్లేవాళ్లు ఇంకెవరైనా మీ అనుభవాన్ని పంచుకుంటారా? ముఖ్యంగా అమ్మాయిలు- అదిగో... ఆమెకు మైక్ ఇవ్వండి.

క్రీడాకారిణి: సర్.. నా పేరు రితిక (సజ్దే).. మాది హర్యానాలోని రోహ్‌త‌క్‌. తొలిసారి ఒలింపిక్స్  వెళ్తున్నాను. నాకెంతో సంతోషంగా ఉంది. నా ప్రతిభా ప్రదర్శనకు ఎంతో ఉత్సుకతతో ఉన్నాను. దేశమంతా నన్ను చూస్తూండగా, అందరూ నా కోసం ప్రార్థిస్తుండగా నా ప్రతిభను 100 శాతం ప్రదర్శిస్తాను.

ప్రధానమంత్రి: మంచిది! మీలో మొదట కాస్తంత బెరుకు కనిపించినా, మాట్లాడాలన్న ఉత్సాహం స్పష్టమైంది... మీ వంతుగా దీక్షతో ముందడుగు వేయండి.

క్రీడాకారిణి: సర్... నా పేరు అంతిమ్ పంఘాల్... నా వయసు 19 ఏళ్లు. ఈ ఒలింపిక్స్ లో నేను మహిళల రెజ్లింగ్ (కుస్తీ) 53 కిలోల విభాగంలో పోటీ పడుతున్నాను. నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా మన దేశానికి ఒలింపిక్స్ మహిళల కుస్తీలో ఒక కాంస్య పతకం మాత్రమే లభించింది. అంతకన్నా మెరుగైన ప్రదర్శనకు కృతనిశ్చయంతో ఉన్నా.

ప్రధానమంత్రి: మంచిది... మీలో 18 ఏళ్లలోపు క్రీడాకారులెవరైనా ఉన్నారా; సరే... మీ గురించి చెప్పండి.  

క్రీడాకారిణి: సర్... నా పేరు ధినిధి దేశింఘు... నాకు పద్నాలుగేళ్లు... మాది కర్ణాటక అయినప్పటికీ, నేనిప్పుడు కేరళ నుంచి ఒలింపిక్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. భారత జట్టులో స్విమ్మర్ (ఈత)గా ఒలింపిక్స్ కు తొలిసారి వెళ్తుండటం ఉద్వేగం కలిగిస్తోంది. ఇది నాకు లభించిన అరుదైన గౌరవం, అదృష్టంగా భావిస్తున్నాను. ఈ క్రీడా ప్రయాణంలో నేను తొలి అడుగు వేస్తున్నా. దేశం కోసం సుదీర్ఘ కాలం ప్రతిభను చాటాలన్నది నా ధ్యేయం. ఈ నేపథ్యంలో మేమంతా అత్యుత్తమ ప్రతిభ చూపి, ఘన విజయాలతో దేశం గర్వపడేలా చేయాలని, మరిన్ని కొత్త లక్ష్యాలతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా.

ప్రధానమంత్రి: మంచిది... మీకు నా శుభాకాంక్షలు!

ధినిధి దేశింఘు: ధన్యవాదాలు సర్!

ప్రధానమంత్రి: మూడుసార్లకుపైగా ఒలింపిక్స్ లో పాల్గొన్నవాళ్లు మీలో ఎవరైనా ఉన్నారా? మూడుసార్లకుపైగా! ఉంటే మాట్లాడండి. మీరు మాట్లాడతారా... కానివ్వండి... ఝార్ఖండ్ వారెవరైనా ఉంటే వాళ్లకు ప్రత్యేక అనుమతి ఉంటుంది... స్వేచ్ఛగా మాట్లాడొచ్చు.

క్రీడాకారిణి: సర్... నా పేరు దీపికా కుమారి. నేను ధనుర్విద్య (ఆర్చరీ)లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఒలింపిక్స్ లో పాల్గొనడం నాకిది నాలుగోసారి. ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ఇది నాకెంతో ఉద్వేగం కలిగిస్తోంది. అయితే, అదే అనుభవం, ఉత్సాహం, విశ్వాసంతో నా ప్రతిభను 200 శాతం ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నా. నాకు మాట్లాడే అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు సర్.

ప్రధానమంత్రి: అయితే, తొలిసారి వెళ్తున్నవాళ్లకు మీ సందేశమేమిటి? వాళ్లనెలా ప్రోత్సహిస్తారు!

దీపికా కుమారి: సర్... వాళ్లలో ఉద్వేగం పాళ్లెక్కువ... కానీ, ఆనందోద్వేగాల్లో, ఆకర్షణలో  కొట్టుకుపోవద్దన్నదే వారికి నేనిచ్చే మొదటి సలహా. వీలైనంత ఎక్కువగా వారు తమపైతాము దృష్టి సారించాలి. కొత్త అనుభవాన్ని ఆస్వాదిస్తూనే అత్యంత శ్రద్ధ, ఆత్మవిశ్వాసం కొనసాగించాలి. పతకాల కోసం వెంపర్లాడకుండా అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శనకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతాను. మనం అద్భుతంగా రాణిస్తే పతకాలు మనను వెతుక్కుంటూ వస్తాయన్నదే నా సందేశం.

ప్రధానమంత్రి: మీరు మూడుసార్లు ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. మొదటిసారి అక్కడ మీరేదైనా కొత్త టెక్నిక్ నేర్చుకుని, ఆ తర్వాత సాధన చేసి ఉంటారు. అలాగే రెండోసారి మరో కొత్త అంశం నేర్చుకుని ఉంటారు. ఆ విధంగా మీలో విశ్వాసం ఇనుమడింజేసి, దేశానికి కీర్తిప్రతిష్టలు తేవడంలో మీకు దోహదం చేసిన అనుభవాలను పంచుకోగలరా? లేక మీరు సాధారణంగా అనుసరించే పద్ధతులలోనే పోటీపడుతూ వచ్చారా? యోగాభ్యాసం చేసే చాలామంది నాలాగే ప్రతిసారి ఒకేవిధంగా మొదలెట్టడం నేను చూశాను. అయితే, కొన్ని సందర్భాల్లో నేను ఓ రెండు పాత ఆసనాల స్థానంలో కొత్తవి అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒకదానికి అలవాటు పడతారు. అది పూర్తిచేసి, అంతా బాగా చేశానని భావిస్తుంటారు. మరి మీ మాటేమిటి?

దీపికా కుమారి: సర్... మేము మంచి పద్ధతులను కొనసాగిస్తాం. ఏదైనా సందర్భంలో ఓటమి పాలైతే ఎక్కడ పొరపాటు చేశామో గ్రహించి అది పునరావృతం కాకుండా అభ్యాసం చేస్తాం. అలా పొరపాట్లను అధిగమిస్తూ వెళ్తే మంచి పద్ధతులు మన అలవాటులో భాగమైపోతాయి. వాటినలా కొనసాగించే ప్రయత్నం చేస్తాం.

ప్రధానమంత్రి: అయితే, కొన్ని సందర్భాల్లో చెడ్డ పద్ధతులు మన దినచర్యలో భాగమైపోతుంటాయి.

దీపికా కుమారి: అదీ నిజమే సర్... కానీ, ఆత్మవిమర్శ చేసుకుంటూ మంచి అలవాట్లను అనుసరించేలా మనను మనమే మలచుకోవాలి.

ప్రధానమంత్రి: బాగుంది... మూడోసారి ఒలింపిక్స్ కు వెళ్తున్నవారు ఇంకెవరైనా ఉన్నారా?

క్రీడాకారిణి: నమస్తే సర్... నా పేరు ఎం.ఆర్.పూవమ్మ. నేను తొలిసారి 18 ఏళ్ల వయసులో  భారత అథ్లెట్స్ జట్టులో రిజర్వు సభ్యురాలిగా 2008 ఒలింపిక్స్ కి వెళ్లాను. ఆ తర్వాత 2016లో మేము (4x400మీ రిలే పరుగు) క్వార్టర్ ఫైనల్స్ లో వెనుదిరిగాం. అటుపైన 2020లో సెమీఫైనల్స్ దాకా వెళ్లినా ఫైనల్‌ చేరలేకపోయాం. అయితే, ఈసారి జాతీయ రికార్డుతో ఫైనల్స్ చేరుకోవాలని భావిస్తున్నాం.

ప్రధానమంత్రి: ఇది మీ ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ధన్యవాదాలు.. మీకు నా శుభాకాంక్షలు. ఆన్‌లైన్ అనుసంధానంలో ఉన్న‌వారు కూడా మీ అనుభ‌వాన్ని పంచుకోండి. ఇది క్రీడాకారులంద‌రికీ ఉప‌యోగ‌క‌రం. మీలో ఎవ‌రు సిద్ధంగా ఉన్నారో వారు చేయి పైకెత్తి, మొద‌లుపెట్టండి.

క్రీడాకారిణి: నమస్తే సర్!

ప్రధానమంత్రి: నమస్తే!

క్రీడాకారిణి: సర్.. నా పేరు పి.వి.సింధు, ఇది నాకు మూడో ఒలింపిక్స్. నేను తొలిసారి పాల్గొన్న 2016 ఒలింపిక్ క్రీడల్లో మన దేశానికి రజత పతకం సాధించుకొచ్చాను. అటుపైన 2020లో క్రీడల్లో కాంస్య పతకం లభించింది. కానీ, ఈ దఫా ‘స్వర్ణ’వర్ణ పతకాన్ని ముద్దాడాలని ఆకాంక్షిస్తున్నాను. నేనిప్పుడు ఎంతో అనుభవజ్ఞురాలుగా పోటీ పడుతున్నా లక్ష్యసాధన సులభ సాధ్యమేమీ కాదు. అయినా, మళ్లీ పతకం తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తాను.

ప్రధానమంత్రి: కొత్త క్రీడాకారులకు మీ సందేశమేమిటి?

పి.వి.సింధు: ముందుగా వారందరికీ నా శుభాకాంక్షలు. ఈ క్రీడలంటే.. ముఖ్యంగా తొలిసారి పాల్గొనేవారికి భావోద్వేగం, ఒత్తిడి ఉంటాయన్నది చాలామంది అభిప్రాయం. అయితే, ఏ టోర్నమెంటుకు వెళ్లినా క్రీడాకారులలో సహజంగానే ఆ భావన ఉంటుంది. ‘‘మనం చేయాల్సిందల్లా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా కఠోరంగా శ్రమించడమే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమతమ క్రీడా శిక్షణలో దీక్షతో అభ్యాసం చేస్తున్నారు. వారంతా తమ ప్రతిభను 100 శాతం ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. దీన్నొక ప్రత్యేకమైన క్రీడా పోటీగా లేదా అత్యంత కష్టమైనదిగా భావించకండి. ఇదీ మనం పాల్గొనే అన్నిరకాల పోటీలాంటిదే. మీ ప్రతిభా సామర్థ్యాలను వందశాతం వెలికితీసేందుకు ప్రయత్నించండి’’ అన్నదే నేనిచ్చే సందేశం సర్.. ధన్యవాదాలు!

ప్రధానమంత్రి: మాట్లాడేవారు మరెవరైనా ఉన్నారా?

క్రీడాకారిణి: నమస్తే సర్... నా పేరు ప్రియాంక గోస్వామి.

ప్రధానమంత్రి: నమస్తే... మీ కృష్ణ భగవానుడి ప్రతిమ ఏదీ?

ప్రియాంక గోస్వామి: సర్... ఆ స్వామి ఇప్పుడు స్విట్జర్లాండ్ లో నాతోనే ఉన్నాడు!

ప్రధానమంత్రి: కృష్ణుని ప్రతిమను ఈసారి కూడా ఒలింపిక్స్ కు తీసుకెళ్తున్నారా?

ప్రియాంక గోస్వామి: తీసుకెళ్తున్నాను సర్.. ఇది నాకు రెండో ఒలింపిక్స్. సర్... ముందుగా మీరు మూడో దఫా ప్రధాని అయినందుకు నా అభినందనలు. మీతో మరోసారి మాట్లాడటం మా క్రీడాకారులందరికీ అమితానందం. నేను మూడు నెలలు ఆస్ట్రేలియాలో శిక్షణ పొందిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న ‘టాప్స్’ పథకం కింద ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో శిక్షణ తీసుకుంటున్నాను. విదేశాల్లో శిక్షణ కోసం ప్రభుత్వం మాకెంతో చేయూతనిస్తోంది. ప్రస్తుత ఒలింపిక్స్ లో మన వాళ్లందరూ అత్యుత్తమంగా రాణించి వీలైనన్ని ఎక్కువ పతకాలతో తిరిగిరాగలరని నేను ఆశిస్తున్నాను.

ప్రధానమంత్రి: మీ క్రీడకు ప్రేక్షకులు ఉండటం లేదని మీరు తరచూ అంటుంటారు. విదేశాల్లో ప్రస్తుత శిక్షణ సమయంలోనైనా ప్రేక్షకులు కనిపిస్తున్నారా?

ప్రియాంక గోస్వామి: అవును సర్... విదేశాల్లో ఇతర క్రీడలతో సమానంగా నేను పాల్గొనే 20 కిలోమీటర్ల నడక పోటీలకు ప్రాధాన్యమిస్తారు. అయితే, మన దేశంలో దీనికి అంతగా ప్రాచుర్యం లేదు. కానీ, అన్ని క్రీడలనూ సమానంగా చూడాలని, క్రీడాకారులందరితో మమేకం కావాలని మీరు ప్రజలను ప్రోత్సహిస్తున్న కారణంగా మన దేశంలోనూ చాలామంది ఈ క్రీడను ఆస్వాదిస్తున్నారు. ఉత్సాహపరిచే ప్రేక్షకులు మా సామర్థ్య ప్రదర్శనకు ప్రేరణ, స్ఫూర్తినిస్తారు. ఏదేమైనా ఈసారి నేను అత్యుత్తమంగా రాణించాలని కృతనిశ్చయంతో ఉన్నాను.

ప్రధానమంత్రి: మంచిది... మీకు అనేకానేక శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మాట్లాడే వారున్నారా?

క్రీడాకారిణి: నమస్తే సర్... నా పేరు నిఖత్ జరీన్. ఇది నాకు తొలి ఒలింపిక్స్. నేను మహిళల బాక్సింగ్ 50 కిలోల విభాగంలో తెలంగాణ నుంచి మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. అదే సమయంలో నా క్రీడపై నిశితంగా దృష్టి సారిస్తాను. నాపై దేశ ప్రజల అంచనాలు హెచ్చుస్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగా నా దేశం గర్వించేలా పతకంతో తిరిగి రావాలని భావిస్తున్నాను.

ప్రధానమంత్రి: మీకు నా శుభాకాంక్షలు!

నీరజ్ చోప్రా: నమస్తే సర్...

ప్రధానమంత్రి: నమస్తే సోదరా!

నీరజ్ చోప్రా: ఎలా ఉన్నారు సర్?

ప్రధానమంత్రి: నేను ఎప్పటిలా బాగున్నాను గానీ... మీ ‘చుర్మా’ ఇంకా రాలేదేం!

నీరజ్ చోప్రా: సర్... ఈసారి వచ్చినపుడు తప్పకుండా తెస్తాను. పోయిన దఫా ఢిల్లీ నుంచి చక్కెరతో చేసిన చుర్మా తెచ్చాను... ఈసారి హర్యానా నుంచి దేశవాళీ నెయ్యితో చేయించి తెస్తాను.

ప్రధానమంత్రి: నేనోసారి ఆ వంటకాన్ని... అదీ మీ అమ్మగారు చేసిన చుర్మా రుచిచూడాలని అనుకుంటున్నాను.

నీరజ్ చోప్రా: తప్పకుండా తెస్తాను సర్.

ప్రధానమంత్రి: మంచిది... మాట్లాడండి.

నీరజ్ చోప్రా: సర్... నేనిప్పుడు జర్మనీలో ఉన్నా... మా శిక్షణ చురుగ్గా సాగుతోంది. గాయం తిరగబెట్టినందువల్ల నేనిక్కడికి వచ్చేముందు చాలా తక్కువ పోటీల్లో పాల్గొన్నాను. అయితే, ఇప్పుడు పరిస్థితి బాగా మెరుగుపడింది. ఇటీవల ఫిన్లాండ్ లో నిర్వహించిన పోటీల్లో అంతా సజావుగా సాగిపోయింది. ఇక ఒలింపిక్స్ కు ఓ నెల సమయం ఉంది. శిక్షణ ముమ్మరంగా సాగుతోంది. అ సమయానికి వందశాతం దృఢత్వం సాధించి, దేశం కోసం శ్రమించాలని కృతనిశ్చయంతో ఉన్నాను. ఎందుకంటే- ఈ అవకాశం నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. మన క్రీడాకారులంతా తమనుతాము తరచి చూసుకోవాలన్నది నా సూచన. తమ సంపూర్ణ ప్రతిభా ప్రదర్శనకు ఏది అవసరమో వారు నిర్ణయించుకోవాలి. నేను తొలిసారి టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్నాను. అక్కడ గొప్ప విజయంతో దేశానికి స్వర్ణ పతకం తెచ్చాను. అద్భుత శిక్షణతోపాటు ఆత్మవిశ్వాసంతో ఎలాంటి తడబాటు లేకుండా నిర్భయంగా నా పని నేను చేసుకుపోయాను. అందువల్ల, ‘‘మన క్రీడాకారులందరికీ నేనిచ్చే సలహా ఇదే. ఒత్తిడి, భయం లేకుండా మీ ఆట మీరు ఆడండి. మనతో పోటీ పడేవారు కూడా మనలాంటి వాళ్లే. ఆకాశం నుంచి దిగివచ్చిన వారేమీ కాదు. అమెరికా లేదా ఇతర దేశాల క్రీడాకారులు మనకన్నా దృఢంగా ఉన్నారని కొన్ని సందర్భాల్లో మనం భావిస్తుంటాం. కానీ, మన ఇళ్లకు, కుటుంబాలకు దూరంగా కఠోర సాధన చేస్తున్న మనం స్వీయ శక్తిసామర్థ్యాల మీద నమ్మకంతో నిరంతర కృషితో ముందుకెళ్తే ఏదైనా సాధ్యమే.’’

ప్రధానమంత్రి: మీరు అద్భుతమైన సూచనలు, సలహాలిచ్చారు... మీకు ధన్యవాదాలు.. మీ  ఆరోగ్యం బాగా కుదుటపడాలని, వచ్చే నెల రోజుల్లో కొత్త గాయాల భయం లేకుండా ముందుకెళ్తారని ఆకాంక్షిస్తున్నాను సోదరా!

నీరజ్ చోప్రా: కచ్చితంగా విజయం సాధిస్తాం సర్... శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం.

ప్రధానమంత్రి: మిత్రులారా... ఈ సంభాషణ కొన్ని కీలకాంశాలను మన ముందుకు తెచ్చింది. అనుభవజ్ఞుల మాటకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇంతకుముందే చెప్పినట్లు క్రీడా ప్రాంగణంలో రకరకాల ఆకర్షణలకు లోనై, పరధ్యానంలో పడి ఏకాగ్రతను కోల్పోకండి. అవన్నీ లక్ష్యం నుంచి మన దృష్టిని పక్కకు మళ్లిస్తాయన్నది మొదటి వాస్తవం. రెండోది.. మానవులందరికీ దైవం ఓ రూపమిచ్చాడు. మనతో పోలిస్తే ఇతర దేశాల క్రీడాకారులు పొడవుగానో, పొట్టిగానో కనిపిస్తారు. కానీ, ఈ క్రీడలకు భౌతిక రూపం కొలమానం కాదు. ఇది నైపుణ్యం, ప్రతిభకు పరీక్ష పెట్టే క్రీడాంగణం. పోటీదారుల ఆకారం చూసి ఏ కోశానా మన సామర్థ్యంపై సంకోచం పెట్టుకోవద్దు. మీలో ఆత్మవిశ్వాసం, స్వీయ ప్రతిభపై నమ్మకం ఉండాలి. ప్రత్యర్థి ఎంత గంభీరంగా కనిపించినా మీ సామర్థ్యమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ప్రతిభానైపుణ్యాలే విజయ సాధన మార్గాలు. చాలామందికి తెలివి తేటలున్నా, పరీక్షల్లో వారికి మార్కులు పెద్దగా రాకపోవడం మీరు గమనించే ఉంటారు. వారి ఏకాగ్రత తరచూ పక్కదోవ పట్టడమే అందుకు కారణం. అలాంటివారు ఫలితం గురించి ఆందోళన పడుతూ చేయాల్సిన పనిమీద శ్రద్ధ పెట్టరు. ‘‘మంచి మార్కులు రాకపోతే పెద్దలు ఏమంటారో?’’ననే ఒత్తిడిలో పడిపోతారు. ఆ తరహాలో మీరు ఎలాంటి ఒత్తిడికీ గురికాకండి. మీరు చేయాల్సిందేదో చెక్కుచెదరని ఏకాగ్రతతో చేసుకుంటూ వెళ్లండి. పతకం దక్కుతుందో.. లేదోననే ఒత్తిడిని ముందుగా జయించండి. మన ప్రతిభను 100 శాతం ప్రదర్శించడంలో ఎక్కడా రాజీపడకుండా దీక్షతో ముందుకు సాగడమే మన కర్తవ్యం కావాలి.

   మరొక కీలకాంశం కంటినిండా నిద్ర. మీ శిక్షకులు, శరీర దారుఢ్య నిపుణులు నిద్ర ప్రాధాన్యం గురించి మీకు చెప్పే ఉంటారు. క్రీడారంగంలో నిరంతర అభ్యాసం, నిలకడ ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. మరునాడు ప్రత్యర్థిని ఎలా ఓడించాలనే ఆలోచనలతో ముందు రోజు రాత్రి కునుకు పట్టని సందర్భాలుంటాయి. కానీ, ఇతరత్రా అంశాలకన్నా నిద్రలేమి మీ ప్రతిభ కుంటుపడటానికి ఎక్కువగా కారణమవుతుంది. ‘‘ఈయనేం ప్రధానమంత్రి మనల్ని బాగా నిద్ర పొమ్మంటున్నారు?’’ అని మీకు అనిపించి ఉండవచ్చు! కానీ, కలతలేని నిద్ర ప్రతి ఒక్కరికీ.. ముఖ్యంగా క్రీడాకారులకు చాలా అవసరమన్నది నిజం. ఆధునిక వైద్యశాస్త్రం కూడా సుఖనిద్ర సమయం, ప్రాధాన్యాల గురించి వివరిస్తుంది. మీరెంత ఉత్సాహోద్వేగాలకు గురైనా చక్కగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. శిక్షణలో, అభ్యాసంలో మీరెంతో శ్రమిస్తారు కాబట్టి, అలసిన శరీరం మిమ్మల్ని త్వరగానే నిద్రలోకి పంపుతుంది. కానీ, శరీర శ్రమతో పట్టే నిద్రకు, కలతలేని నిద్రకు చాలా తేడా ఉంటుంది. అందువల్ల ప్రశాంతంగా నిద్రించే విషయంలో రాజీ పడకండి. కాల మండలాల గుండా విమాన ప్రయాణం, వాతావరణ పరిస్థితులు తదితరాలకు అలవాటు పడటం కోసమే ప్రభుత్వం మిమ్మల్నందర్నీ ఎంతో ముందుగా పంపుతుంది. ఇందులో భాగంగా ఈసారి కూడా మీ సౌకర్యార్థం కొన్ని కొత్త చర్యలు కూడా తీసుకున్నాం. అలాగని మన అంచనాల మేరకు ప్రతి సౌకర్యం సమకూరిందని, ఏ సమస్యా లేదని చెప్పలేను. ఆ దిశగా అన్నివిధాలా కృషి చేశామని మాత్రమే చెప్పగలను. మీకందరికీ పారిస్ నగరంలోని ప్రవాస భారతీయ సోదరుల మద్దతు, ప్రోత్సాహం లభించే ఏర్పాటు కూడా చేశాం. వివిధ నిబంధనలు, క్రమశిక్షణ పద్ధతుల కారణంగా వారు ప్రత్యక్షంగా మిమ్మల్ని కలిసే అవకాశం ఉండకపోవచ్చు. కానీ, మీ బాగోగులు చూడటానికి, అండగా నిలవటానికి సదా సిద్ధంగా ఉంటారు. మీ వంతు పోటీలు పూర్తికాగానే మీకు అవసరమైన అంశాల్లో సంపూర్ణ సహకారం అందిస్తారు. మీకు అన్ని సౌకర్యాలూ సమకూర్చేందుకు, ఏ అసౌకర్యం లేకుండా మీరు పోటీల్లో ప్రతిభ ప్రదర్శించేందుకు ప్రభుత్వం అన్నివిధాలా కృషిచేసింది.

   మీకందరికీ నా శుభాకాంక్షలు! ఆగస్టు 11న క్రీడా సంరంభం ముగిశాక మిమ్మల్ని మళ్లీ కలిసేందుకు ఎదురుచూస్తుంటాను. మీలో కొందరు ఈ తేదీకన్నా ముందుగానే అక్కడి నుంచి బయల్దేరుతారు కాబట్టి, ఆగస్టు 15న ఎర్రకోటలో స్వాతంత్ర్య వేడుకలకు మీరు హాజరయ్యేలా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఒలింపిక్స్‌ లో పాల్గొనేందుకు వెళ్లిన మిమ్మల్ని దేశమంతా చూసి ఆనందిస్తుంది. ఈ క్రీడల్లో పాల్గొనడమే ఓ గర్వకారణం.. దేశం కోసం ఓ పతకం తెస్తే  అది మరింత గర్వకారణం. ఈ నేపథ్యంలో ‘క్రీడా భారతం’ (ఖేలో ఇండియా) కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన వారు మీలో ఎందరున్నారు? కొద్దిమందే ఉన్నట్టున్నారు... మీరు పోటీపడబోయే క్రీడ, మీ అనుభవాలు వివరించండి.

క్రీడాకారుడు: సర్... నా పేరు అర్జున్.. బ్యాడ్మింటన్ ఆటగాణ్ని... ఖేలో ఇండియా కార్యక్రమం నాలాంటి ఎందరో యువ క్రీడాకారులకు ఎంతో ఉత్సాహప్రోత్సాహాలిచ్చింది. వనరులు సమకూర్చడంతోపాటు శిక్షణ సదుపాయాలు కల్పించింది.

ప్రధానమంత్రి: అద్భుతం అర్జున్! ‘ఖేలో ఇండియా’ ద్వారా ఒలింపిక్స్ వైపు నీ ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఇదే పట్టుదల, కఠోర సాధనతో దేశం గర్వించేలా చేయండి.

క్రీడాకారిణి: హలో సర్... నా పేరు సిఫ్ట్... నా క్రీడ షూటింగ్... ఖేలో ఇండియా కార్యక్రమం నాకెంతగానో చేయూతనిచ్చింది. ఈ పథకంలో భాగం కావడంతోపాటు ఢిల్లీలో శిక్షణ పొందిన తర్వాత నేను చాలా విజయాలు సాధించాను.

ప్రధానమంత్రి: శభాష్... ఇది శుభారంభం.

సిఫ్ట్: కృతజ్ఞతలు సర్...

ప్రధానమంత్రి: మరి మీ మాటేమిటి?

క్రీడాకారిణి: నమస్తే సర్... నా పేరు మను భాకర్. ఒలింపిక్స్‌ షూటింగ్‌ పోటీల్లో పాల్గొనబోతున్నాను. నేను 2018లో ‘ఖేలో ఇండియా’ తొలి పాఠశాల క్రీడల్లో జాతీయ రికార్డుతో స్వర్ణ పతకం సాధించాను. అటుపైన ‘టాప్స్’ (టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్) కీలక బృందంలో సభ్యురాలినయ్యాను. అప్పటి నుంచి భారత జెర్సీతో దేశానికి ప్రతినిధిగా అంతర్జాతీయ క్రీడల్లో ఆడటమే నా లక్ష్యంగా మారింది. నాలాగా ఎందరో క్రీడాకారులకు ‘ఖేలో ఇండియా’ మార్గనిర్దేశక వేదికగా రూపొందింది. ‘ఖేలో ఇండియా’ చేయూతతో వచ్చిన చాలామందిని ఇవాళ ఈ జట్టులో చూస్తున్నాను. ఇలా నా జూనియర్లు కూడా నాతో కలసి ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో 2018 నుంచి ‘టాప్స్’ కింద మద్దతు పొందడం ఒక పెద్ద ముందడుగు. అందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రస్థానంలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలను టాప్స్ నిపుణుల బృందం నేర్పుతో పరిష్కరిస్తుంది. ఇవాళ నేనీ స్థాయికి చేరానంటే ‘ఖేలో ఇండియా, టాప్స్’ కార్యక్రమాలే కారణం. ధన్యవాదాలు సర్!

ప్రధానమంత్రి: శభాష్... మీకు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మాట్లాడే వారున్నారా? ముందుకు రండి..

క్రీడాకారుడు: నమస్కారం సర్! నా పేరు హర్మన్ ప్రీత్ సింగ్... హాకీ జట్టు సభ్యుడిని. గత ఒలింపిక్స్ లో మన జట్టు 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం సాధించింది. భారత హాకీకిగల ఘన చరిత్ర దృష్ట్యా ఇది మాకెంతో గర్వకారణం. ఈసారి ఆ ఫలితాలన్ని మరింత మెరుగుపరచాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మాకు కల్పించే సౌకర్యాల గురించి చెప్పాల్సి ఉంది.

ప్రధానమంత్రి: హాకీలో మీ జట్టు నైపుణ్యం తిలకించేందుకు అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

హర్మన్ ప్రీత్ సింగ్: మా సౌకర్యాల గురించి చెప్పాలంటే- భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఎఐ) ప్రాంగణంలో మాకొక బంగళ ఇచ్చారు. అక్కడ మా అభ్యాసానికి అత్యుత్తమ సౌకర్యాలున్నాయి. మేము పుంజుకోవడం, సుఖనిద్ర గురించి మీరిప్పుడే ప్రస్తావించారు. ఆ విషయంలో మాకు ఏ లోటూ లేదు. అద్భుతమైన ఆహారం, తిరిగి పుంజుకోగల వనరులు మాకు అందుబాటులోనే ఉన్నాయి. ఈసారి మా జట్టు పటిష్టంగా రూపొందింది. దీంతోపాటు కఠోరంగా శ్రమిస్తున్నాం కాబట్టి, మెరుగ్గా రాణించి దేశానికి పతకం తేవాలని కృతనిశ్చయంతో ఉన్నాం సర్!

ప్రధానమంత్రి: మన దేశంలో బహుశా అత్యంత ఒత్తిడిని ఎదుర్కొనే క్రీడ హాకీ. ఎందుకంటే-  దీన్ని జాతీయ క్రీడగా మన ప్రజలందకూ విశ్వసిస్తున్నారు. మరి ఈ క్రీడలో మనం ఎలా వెనుకబడ్డాం. హాకీ ఆటగాళ్ళు చాలా ఒత్తిడిని ఎదుర్కొనాల్సి వస్తోంది. ఎందుకంటే- ఆబాలగోపాలం మన ఆటలో మనం ఓడిపోవడమేమిటని ఆలోచిస్తారు. ఇతర క్రీడలలో గెలవకపోయినా పోరాడి ఓడారని ప్రజలు సరిపెట్టుకుంటారు. కానీ, హాకీ విషయంలో మాత్రం రాజీపడరు. కాబట్టి, మీరు మరింత శ్రమించాలి... శ్రమించగలరు కూడా. మీకు నా శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయి. విజయోత్సాహంతో తిరిగి రాగలరన్న విశ్వాసం నాకుంది.

హర్మన్ ప్రీత్ సింగ్: ధన్యవాదాలు సర్!

ప్రధానమంత్రి: దేశం కోసం ఏదైనా చేయడానికి ఇంతకన్నా మంచి తరుణం లేదన్నది నా భావన. మీ పట్టుదల, కఠోర సాధనతో ఈ స్థితికి చేరారు. ఇక మైదానంలో మీ అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శన ద్వారా దేశమాత రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తమతమ రంగాల్లో విజయం సాధించేవారు దేశానికి కూడా కీర్తి ప్రతిష్టలు తెస్తారు. ఈసారి మన జట్టు గత రికార్డులన్నింటినీ తిరగరాస్తుందన్న నమ్మకం నాకుంది. భారతదేశం 2036లో ఒలింపిక్స్‌ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా మనకో గొప్ప అవకాశం లభిస్తుంది. ఆ దిశగా ఇప్పటికే మొదలైన ప్రయత్నాలు వేగం పుంజుకోవడం ఆలస్యం కావచ్చు. కానీ, మౌలిక వసతుల కల్పన కోసం నిపుణులు కసరత్తు చేస్తున్నారు. ఈసారి ఫ్రాన్స్‌ లోని వివిధ నగరాల్లో ఒలింపిక్స్ నిర్వహిస్తుండగా, ఓ క్రీడను సుదూరంలోని ద్వీపంలో నిర్వహిస్తున్నారు. మీకు ఆసక్తి ఉంటే ఒలింపిక్స్ నిర్వహణ, ఏర్పాట్ల తీరును గమనించండి. తద్వారా మన దేశంలో అటువంటి సౌకర్యాల మెరుగుదల, లోటుపాట్ల సవరణ చేసుకోవచ్చు. మనం 2036 ఒలింపిక్స్ నిర్వహించడంలో ఆటగాళ్ల నుంచి అందే సమాచారం ఎంతో ఉపయుక్తం కాగలదు. చివరగా... మీకందరికీ మరోసారి నా శుభాకాంక్షలు.

 

ధన్యవాదాలు!

 

బాధ్యత నిరాకరణ ప్రకటన: ప్రధానమంత్రి ప్రసంగం హిందీ భాషలో సాగింది. వాస్తవ ప్రసంగానికి తెలుగులో ఇది సామీప్య స్వేచ్ఛానువాదం.

 

***



(Release ID: 2051989) Visitor Counter : 24