రాష్ట్రపతి సచివాలయం
మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘శాసన్ అప్ల్యా దరి’.. ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’ లబ్ధిదారుల సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం
Posted On:
04 SEP 2024 5:30PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము మహారాష్ట్రలోని ఉద్గీర్‌లో ఇవాళ (2024 సెప్టెంబరు 4న) ‘శాసన్ అప్ల్యా దరి’, ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’ లబ్ధిదారుల సమావేశంలో ప్రసంగించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ రెండు పథకాలను సార్వజనీన, సౌభాగ్య సమాజం సహా దేశ నిర్మాణంలో కీలక దశలుగా పేర్కొనవచ్చునని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతో మహారాష్ట్రలో మహిళలు స్వావలంబన సాధించడం హర్షణీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు జీవనోపాధి అవకాశాలతోపాటు ఆర్థిక అవగాహన, నైపుణ్యం కల్పించడం అభినందనీయమని ఆమె అన్నారు. జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ప్రాథమిక సేవల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే అవసరం లేకుండా ప్రభుత్వం వారి ముంగిటకే వాటిని చేర్చిందన్నారు.
మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు తనకెంతో సంతృప్తినిచ్చాయని రాష్ట్రపతి అన్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నపుడు కుటుంబ ఆర్థిక వనరులను అందరి ప్రయోజనాల కోసం సద్వినియోగం చేయడంలో పురుషులతో పోలిస్తే మహిళలకే జ్ఞానం, అవగాహన మెరుగ్గా ఉంటాయన్నారు. ఒక పురుషుడు విద్యావంతుడైతే అది ఒకరికే ప్రయోజనమని, ఒక మహిళ విద్యావంతురాలైతే కుటుంబాన్ని, భావితరాన్ని కూడా తీర్చిదిద్దినట్లు కాగలదని సమాజం భావిస్తుంది. ఇదే సూత్రం ఆర్థిక సాధికారతకూ వర్తిస్తుందని రాష్ట్రపతి అన్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత సిద్ధిస్తే ఆ కుటుంబానికి, వారి భవిష్యత్తరానికి సాధికారత లభించినట్లేనని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘లక్షాధిపతి సోదరి’ (లఖపతి దీదీ) పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు కోటి మంది మహిళలు లక్షాధికారులుగా మారారని, ఇది తనకెంతో సంతోషం కలిగించిందని రాష్ట్రపతి అన్నారు. ఈ కార్యక్రమం మహిళల్లో ఆత్మవిశ్వాసం, అవగాహనతోపాటు చైతన్యం నింపిందని ఆమె అన్నారు.
మహిళల ఆరోగ్యం, పౌష్టికత కోసం మహారాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందంటూ రాష్ట్రపతి ప్రశంసించారు. చాలామంది తల్లులు, సోదరీమణులు కుటుంబ సభ్యుల ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు కానీ, తమ విషయంలో వాటి గురించి పట్టించుకోరని ఆమె అన్నారు. ఇకమీదనైనా స్వీయ ఆరోగ్యంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఇది వారితోపాటు వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తుకూ ఎంతో ముఖ్యమని సూచించారు.
దేశవ్యాప్తంగా కొన్నేళ్ల నుంచీ కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరగడంపై రాష్ట్రపతి హర్షం ప్రకటించారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారని, వారి భాగస్వామ్యాన్ని ఇంకా పెంచేందుకు మరింత కృషి అవసరమని పేర్కొన్నారు. తమతమ కుటుంబాల్లోని మహిళల శక్తిసామర్థ్యాలను గుర్తించి వారి కలల సాకారానికి సహకరించాల్సిందిగా పురుష సభ్యులకు ఆమె పిలుపునిచ్చారు. మహిళల ప్రగతికి ఎలాంటి అవరోధాలు సమాజంతోపాటు దేశం ప్రగతి వేగం మందగిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు ఉద్గీర్‌లో బుద్ధ బుద్ధ విహార్ భవనాన్ని, ధ్యానమందిరాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం అక్కడి బుద్ధ భగవానుని విగ్రహం వద్ద నివాళి అర్పించారు.
***
(Release ID: 2051957)
Visitor Counter : 61