మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పోషణ్ ట్రాకర్ కార్యక్రమం అమలుకు ఇ-గవర్నెన్స్ 2024 (పసిడి) జాతీయ పురస్కారాన్ని అందుకొన్న మహిళలు- బాల వికాస మంత్రిత్వ శాఖ


వృద్ధిని గమనించడం, జీవితాలలో మార్పును తేవడం .. ఇదే ‘మిషన్ పోషణ్ 2.0’ ధ్యేయం

Posted On: 04 SEP 2024 12:35PM by PIB Hyderabad

అప్పుడే పుట్టిన పసికందులు మొదలుకొని ఆరేళ్ల వయస్సు గల చిన్నారుల ఆరోగ్యానికి, అభ్యున్నతికి పూచీ పడే దిశలో వేస్తున్న ఒక ముఖ్యమైన ముందంజలో భాగంగా, ‘మిషన్ పోషణ్ 2.0’ తన నెలవారీ వృద్ధి పరిశీలన కార్యక్రమం ‘‘పోషణ్ ట్రాకర్’’ ద్వారా లక్షల కొద్దీ బాలల ఎదుగుదలను పర్యవేక్షించడంలో ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది.  ఇదే అంశం (పోషణ్ ట్రాకర్) ఈ సంవత్సరం ‘రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2024’కు ఇతివృత్తంగా కూడా ఉంది.  ఎదుగుదల సంబంధిత సమస్యలను పోషణ్ ట్రాకర్ కార్యక్రమం గుర్తించి, వాటిని పరిష్కరించడంలో సఫలమైంది.   నిర్దిష్ట కేసులలో జోక్యాలకు ఈ కార్యక్రమం బాటను పరచి, పోషణ విజ్ఞ‌ాన పరమైన ఫలితాలను మెరుగు పరచ గలిగింది.

పోషణ్ ట్రాకర్ కార్యక్రమానికి  నేషనల్ అవార్డ్ ఫర్ ఇ-గవర్నెన్స్  2024 (గోల్డ్) ను మహిళలు- బాల వికాస మంత్రిత్వ శాఖ ముంబయిలో నిన్నటి రోజు (సెప్టెంబరు 3) న అందుకొంది. ఈ పురస్కారాన్ని గవర్నమెంట్ ప్రాసెస్ రీ-ఇంజినీరింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ లకు పోషణ్ ట్రాకర్ కార్యక్రమానికి ప్రదానం చేశారు.  పోషణ్ ట్రాకర్ బాలలు చక్కగా ఎదిగేటట్లు వాస్తవకాల ప్రాతిపదికన వారిపై పర్యవేక్షణ కొనసాగిస్తూ, పోషణ పరంగా వారు పుష్టిగా తయారయ్యేటట్టు చూసి, వారికి ఒక ఆరోగ్యవంతమైన భవిష్యత్తును ప్రసాదిస్తుంది.

బాలల్లో ఎదుగుదలను, వారి శారీరక అభివృద్ధిని పర్యవేక్షించడానికి ముఖ్యమైన ఉపకరణాలుగా ఉన్న, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) రూపొందించిన ఎదుగుదలకు సంబంధించిన చిత్రపటాల ను అనుసరించడం ద్వారా ఎప్పటికప్పుడు చిన్నారి ఎదిగే తీరును పరిశీలించడంలో మిషన్ పోషణ్ 2.0 సాయపడుతుంది.  ఈ చిత్రపటాలు బాలుడు/బాలిక ఎత్తు, బరువు, వయోవర్గాన్ని, లింగ భేదాలను బట్టి ఉండవలసిన ప్రమాణాలను చిత్రాల రూపాల్లో వివరిస్తాయి. ఈ చిత్రాల మాధ్యమం ఆంగన్‌వాడీ కార్యకర్తలు చిన్నారుల పోషణ స్థాయి ఏ విధంగా ఉన్నదీ, ఏవైనా లోటుపాటులు చోటుచేసుకొన్నాయేమో అంచనా వేసి వాటిని సకాలంలో చక్కదిద్దుకోవడంలో సాయపడేందుకు వీలును కల్పిస్తుంది.

పోషణ్ ట్రాకర్ ఒక ఆధునిక సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) అప్లికేషన్; ఇది ఈ ప్రక్రియలో ఒక ముఖ్యపాత్రను పోషిస్తోంది.  వృద్ధి పరంగా ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని సమయానుకూలంగా పసిగట్టడంలో పోషణ్ ట్రాకర్ తోడ్పడుతుంది.  ప్రతి ఒక్క ఆంగన్‌వాడీ కేంద్రం (ఎడబ్ల్యుసి) లో లభిస్తున్న గ్రోత్ మెజరింగ్ డివైసెస్ (జిఎమ్‌డి) ల సాయంతో సమాచారాన్ని పక్కాగా నమోదు చేసి క్రమం తప్పక పర్యవేక్షిస్తూ, ఈ కార్యక్రమం ఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది.

ప్రస్తుతం, ఆరేళ్ల వయస్సు (0-6 సంవత్సరాలు) లోపు బాలలు 8.9 కోట్ల మందికి ‘మిషన్ పోషణ్ 2.0’ తన సేవలను అందిస్తున్నది.  ప్రతి నెల వృద్ధిని పరిశీలించే ప్రక్రియలో భాగంగా ఒకే నెలలో 8.57 కోట్ల చిన్నారుల డేటాను పరిశీలించారు.  జీవితాలలో మార్పును తీసుకు రావాలని ఈ  కార్యక్రమం నిర్దేశించుకొన్న నిబద్ధతకు ఇంతటి ముమ్మర స్థాయిలో వ్యాప్తి, ప్రభావాన్ని కలుగజేయడం అనేవి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.

ఆరోగ్య సమస్యలను ఆరంభ దశల్లోనే పసిగట్టడం, పోషణ విజ్ఞాన సంబంధిత అంచనాను, అభివృద్ధి పరమైన మైలురాళ్ళను పర్యవేక్షించడంపై శ్రద్ధ తీసుకొంటూ ‘మిషన్ పోషణ్ 2.0’ మెరుగైన ఆరోగ్య ఫలితాలను రాబట్టడం ఒక్కటే కాకుండా, సముదాయాలు తమ పిల్లల సంక్షేమ బాధ్యతను తామే తీసుకొనేటట్లు సాధికారితను కూడా కల్పిస్తున్నది.  ఈ కార్యక్రమం అంతకంతకు మార్పుచేర్పులతో విస్తరిస్తూ ముందుకు సాగిపోతున్న క్రమంలో, ఇది భారతదేశంలో యువ పౌరులకు ఆరోగ్యకర, ఉజ్జ్వల భవిష్యత్తు రీత్యా ఓ ఆశాదీపంలా ఉంటున్నది.

నేపథ్యం

ప్రతి ఏటా మార్చి నెలలో పోషణ్ పఖ్ వాడా ను, సెప్టెంబరు 1-30 వరకు పోషణ్ మాహ్ ద్వారా ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తున్నారు.  2018 నుంచి ఇంతవరకు ఆరు పోషణ్ పఖ్ వాడాలను, ఆరు పోషణ్ మాహ్ లను నిర్వహించారు.  వేరు వేరు ఇతివృత్తాల తో వంద కోట్లకు పైగా పోషణ విజ్ఞాన ప్రధానమైన చైతన్యప్రబోధ  కార్యకలాపాలను చేపట్టారు.

 

***


(Release ID: 2051869) Visitor Counter : 120