ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర రోడ్లు-రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ.. కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖల మూలధన వ్యయం (కేపెక్స్)పై న్యూఢిల్లీలో శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమీక్ష సమావేశం


ఇదే తరహాలో ఇతర మంత్రిత్వ శాఖలు/విభాగాల కీలక ‘కేపెక్స్’పైనా సమీక్ష;

కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖపై సమీక్షలో భాగంగా ‘‘భారత్ నెట్ ప్రోగ్రామ్-4జి మొబైల్ ప్రాజెక్టులు-స్వదేశీ సాంకేతికత-స్పెక్ట్రమ్ కోసం నెట్‌వర్క్-4జి సంతృప్త స్థాయి సహా ఇతర మొబైల్ ప్రాజెక్టుల’’పై 2024-25లో ‘కేపెక్స్’ ప్రణాళికలపై చర్చ;

రోడ్లు-రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ ‘కేపెక్స్’పై సమీక్ష సందర్భంగా జాతీయ రహదారులపై మొత్తం మూలధన వ్యయం.. 2024-25 తదుపరి త్రైమాసికాల్లో కాంట్రాక్టుల కేటాయింపు నిర్మాణ లక్ష్యాలు.. వివిధ చర్యల ద్వారా ప్రైవేట్ మూలధన సమీకరణ.. ఆస్తుల రీసైక్లింగ్ లక్ష్యాల సాధన వగైరాలపై చర్చ;

త్రైమాసిక లక్ష్యాల నిర్దేశం... నిర్ణీత గడువులోగా వాటి సాధన ప్రాధాన్యాన్ని స్పష్టీకరించిన ఆర్థిక మంత్రి శ్రీమతి సీతారామన్;

2024-25 సంబంధిత తొలి.. మలి (క్యు1, 2) త్రైమాసిక లక్ష్యాల అమలు.. సర్దుబాటును ‘క్యు3’లోనే వేగిరపరచి.. పూర్తి చేయాలని ఆయా శాఖలకు సూచన

Posted On: 03 SEP 2024 7:21PM by PIB Hyderabad

   కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో కీలక మూలధన వ్యయం (కేపెక్స్)పై వరుసగా సమీక్ష సమావేశాలు సాగుతున్నాయి. ఈ మేరకు భవిష్యత్ మూలధన వ్యయం ఆధారిత కార్యకలాపాల పురోగమనాన్ని కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తన అధ్యక్షతన సమీక్షిస్తారు.

   ఇందులో భాగంగా ఇవాళ న్యూఢిల్లీలో నిర్వహించిన తొలి సమావేశంలో రోడ్లు-రవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతోపాటు టెలికాం శాఖ, కమ్యూనికేషన్ శాఖలకు సంబంధించిన ‘కేపెక్స్’పై ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల శాఖ, రోడ్లు-రవాణా-జాతీయ రహదారుల శాఖ, టెలికాం శాఖల కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.

   కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖపై సమీక్షలో భాగంగా ‘‘భారత్ నెట్ ప్రోగ్రామ్-4జి మొబైల్ ప్రాజెక్టులు-స్వదేశీ సాంకేతికత-స్పెక్ట్రమ్ కోసం నెట్‌వర్క్-4జి సంతృప్త స్థాయి సహా ఇతర మొబైల్ ప్రాజెక్టుల’’పై 2024-25లో ‘కేపెక్స్’ ప్రణాళికలపై చర్చించారు. ఈ మంత్రిత్వ శాఖకు 2024-25లో మూలధన వ్యయాన్ని ₹28,835 కోట్లుగా అంచనా వేసి, బడ్జెట్లో కేటాయించారు.

   ఈ సందర్భంగా- గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజానీకానికి సరసమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు ఉద్దేశించిన భారత్‌నెట్ ప్రాజెక్టుకు సంబంధించిన ‘కేపెక్స్’ ప్రణాళిక, లక్ష్యాల గురించి కేంద్ర ఆర్థిక మంత్రికి టెలికమ్యూనికేషన్స్ (డిఒటి) విభాగం కార్యదర్శి వివరించారు. అలాగే 4జి సంతృప్త స్థాయి, ఇతర మొబైల్ టవర్ ప్రాజెక్టుల మూలధన వ్యయ ప్రణాళికలపైనా ఆయన సమాచారమిచ్చారు. ఈ కార్యకలాపాల ద్వారా మారుమూల, దుర్గమ ప్రాంతాలతోపాటు ఇంకా ఈ సదుపాయాలందని గ్రామాలకూ అనుసంధానం మెరుగుపరుస్తారు.

   పూర్తి స్వదేశీ 4జి సాంకేతికత సాయంతో 21,000 మొబైల్ టవర్ల ద్వారా 30 లక్షల మంది వినియోగదారులకు సేవలందిస్తున్నట్లు కార్యదర్శి వెల్లడించారు. అంతేకాకుండా సంతృప్త స్థాయిలో 4జి సేవలందించే కార్యక్రమం కింద ఆకాంక్షాత్మక జిల్లాలు-సమితులకు అనుసంధానం కూడా లక్ష్యంలో భాగంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ లక్ష్యం వైపు సజావుగా కొనసాగుతున్నాయని, సకాలంలో మొత్తం పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రికి ‘డిఒటి’ కార్యదర్శి హామీ ఇచ్చారు.

   రోడ్లు-రవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సంబంధిత ‘కేపెక్స్’ సంబంధిత ఆర్థిక-భౌతిక పురోగమనం గురించి వివరిస్తూ గడచిన పదేళ్లలో జాతీయ రహదారి నెట్‌వర్క్ పరంగా అసాధారణ వృద్ధిని సాధించామని ఆ శాఖ కార్యదర్శి తెలిపారు. జాతీయ రహదారుల సగటు వార్షిక నిర్మాణ వేగం దాదాపు 2.4 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ఆ మేరకు 2004-2014 కాలంతో పోలిస్తే 2014-2024 మధ్య 2 వరుసల/షోల్డర్ సహిత 2 వరుసల జాతీయ రహదారులతోపాటు 4 వరుసలు, అంతకుమించిన రహదారులతోపాటు హై-స్పీడ్ కారిడార్ల అభివృద్ధి, నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు వివరించారు.

   అంతేకాకుండా 2024-25 సంవత్సరంలో మిగిలిన ‘కేపెక్స్’ ప్రణాళికల గురించి కూడా కేంద్ర ఆర్థిక మంత్రికి కార్యదర్శి పూర్తిగా విశదీకరించారు. వివిధ చర్యల ద్వారా ప్రైవేట్ మూలధన సమీకరణకు కృషి చేస్తున్నామని, ఆస్తుల రీసైక్లింగ్ లక్ష్యాలను కూడా సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.

   కాగా, కేంద్ర రోడ్లు-రవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కింద ‘కేపెక్స్’ కేటాయింపులు 2019-20లో ₹1.42 లక్షల కోట్లు కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ₹2.72 లక్షల కోట్లకు... అంటే- 90 శాతం మేర పెరిగాయి.

   ప్రజా ప్రయోజనార్థం అర్థవంతమైన ఆస్తుల సృష్టి ప్రాధాన్యాన్ని ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రతి త్రైమాసికంలో లక్ష్య నిర్దేశం, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంలోని ఆవశ్యకతను ఆమె విపులీకరించారు. తదనుగుణంగా 2024-25 ఆర్థిక సంవత్సర ‘తొలి, మలి (క్యు1, 2) త్రైమాసికాల లక్ష్యాల అమలును 3వ త్రైమాసికంలోనే వేగిరపరచి సకాలంలో పూర్తిచేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖలన్నిటికీ ఆమె స్పష్టంగా నిర్దేశించారు.

***


(Release ID: 2051596) Visitor Counter : 76