రాష్ట్రపతి సచివాలయం
మహారాష్ట్ర శాసన మండలి శతాబ్ధి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి
Posted On:
03 SEP 2024 7:41PM by PIB Hyderabad
ముంబయిలో ఈరోజు మహారాష్ట్ర శాసన మండలి శతాబ్ది వేడుకల్లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ, ప్రారంభం నుండి మహారాష్ట్ర శాసన మండలి ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిందని కితాబిచ్చారు. ప్రజల సమస్యలకు ప్రతిస్పందించడంలో ఈ ఎగువ సభ కీలకపాత్ర పోషించినదన్నారు. ఈ విషయంగా సహకారం అందించిన ప్రస్తుత, మాజీ మండలి సభ్యులందరినీ ఈ సందర్భంగా ఆమె ప్రశంసించారు. తమ అసాధారణ సహకారంతో అవార్డులు అందుకున్న ఉభయ సభల సభ్యులను ఆమె అభినందించారు.
మహారాష్ట్ర శాసన మండలి ఆరోగ్యకరమైన చర్చల సంప్రదాయాన్ని నెలకొల్పడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసిందని రాష్ట్రపతి కొనియాడారు. అలాగే మండలి సభ్యులు ప్రజా సంక్షేమానికి విశేష కృషి చేశారన్నారు. మండలి మాజీ చైర్మన్ వి.ఎస్. పేజీ హయంలో ఉపాధి హామీ పథకం ప్రారంభమైన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి పథకం జాతీయ స్థాయిలో ‘ఎంజీఎన్ఆర్ఈజీఏ’ పేరుతో అమలవుతున్నదని తెలిపారు.
పార్లమెంటులోని రాజ్యసభ అలాగే శాసన సభల్లోని శాసన మండలి రెండూ పెద్దల సభగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఈ సభలలో సభ్యత్వం కోసం కనీస వయో పరిమితి ఎక్కువ ఉండడంతో పాటు, అత్యంత అనుభవం గల సభ్యులు తరచూ పెద్దల సభల్లో ప్రాతినిధ్యం కలిగి ఉంటారన్నారు. అలాంటి పెద్దలు ఎందరో మంచి ప్రమాణాలను నెలకొల్పారని అలాగే పార్లమెంటరీ వ్యవస్థను, శాసనసభల పనితీరును మెరుగుపరిచారని తెలిపారు. మహారాష్ట్ర శాసన మండలి సైతం ఈ సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయగలదని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక పురోగమనం పరంగా మహారాష్ట్ర దేశమంతటికీ ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్రపతి పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం, రాష్ట్రాల జీడీపీ పరంగా దేశంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఈ ఘనత పట్ల శాసనమండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రజలను ఆమె అభినందించారు. మహారాష్ట్ర అభివృద్ధి ప్రయాణం ఇలాగే శరవేగంగా ముందుకు సాగగలదన్నఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రజలకు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
***
(Release ID: 2051549)
Visitor Counter : 80