సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో విజన్ జమ్మూకాశ్మీర్@ 2047: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రజాస్వామ్య ఆకాంక్షల విజయం అన్న కేంద్ర మంత్రి

తీవ్రవాదం నుంచి ప్రధాన స్రవంతిలోకి: ప్రధాని మోదీ నేతృత్వంలో జమ్మూకాశ్మీర్ పురోగతిని వివరించిన డాక్టర్ సింగ్

జమ్మూకాశ్మీర్ సాధికారత: స్వయంపాలన, అభివృద్ధి, దార్శనికతలను ఆవిష్కరించిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 02 SEP 2024 6:46PM by PIB Hyderabad

విజన్ జమ్మూకాశ్మీర్ @2047కు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చోదకంగా ఉంటుందని, విజన్ ఇండియా @2047లో అది అంతర్భాగమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మక జమ్మూకాశ్మీర్ @ 2047 దార్శనికతను ఆయన వివరించారు.

రాబోయే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కీలకమైన మైలురాయిగా డాక్టర్ జితేంద్ర సింగ్ అభివర్ణించారు. ఈ ప్రాంత శక్తిమంతమైన ప్రజాస్వామిక ఆకాంక్షలను సాకారం చేస్తూ, దశాబ్ధ కాలంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.

దేశ చరిత్రలో ఈ ఎన్నికలు ముఖ్యమైన దశగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర), భౌగోళిక శాస్త్ర సహాయ మంత్రి (స్వతంత్ర); పీఎంవో- అణుశక్తి విభాగం- అంతరిక్ష విభాగం- సిబ్బంది, ప్రజా వ్యవహారాలు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ అభివర్ణించారు. ప్రధాని నరేంద్రమోదీ క్రియాశీల నాయకత్వమే ఈ పురోగతికి కారణమని పేర్కొన్నారు.

2014 మే 26న ప్రధాని మోదీ పదవీ కాలం మొదలైనప్పటి నుంచి జాతీయ స్థాయిలో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిన విషయాన్ని జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. ప్రాంతీయ స్థాయిలోనూ అవి గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపాయన్నారు. కాలం చెల్లిన ఆంక్షల నుంచి ప్రధాని మోదీ ప్రభావవంతంగా భారత్ ను విముక్తం చేశారని ఆయన ఉద్ఘాటించారు.

స్థానిక స్వపరిపాలన సంస్థల్లో పరివర్తనను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు. జమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదం అంతమవుతోందని, స్వాతంత్య్రం తర్వాత తొలిసారి జిల్లా పరిషత్తులు ఏర్పాటవుతున్నాయని అన్నారు.

దశాబ్ధాల క్రితమే 73వ, 74వ రాజ్యాంగ సవరణలు అమలైనప్పటికీ, గత నాయకుల దురుద్దేశాలు, స్వార్థ ప్రయోజనాల వల్ల జమ్మూకాశ్మీర్ లో అవి అమలుకు నోచుకోలేదన్నారు. ఈ ప్రాంత పరివర్తనలో అధికరణ 370 రద్దు కీలకమైన ముందడుగుగా పేర్కొన్నారు.

విజన్ 2047 అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలా ప్రభావం చూపుతుందో డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. మనం 2024 కోణంలో 2047ను చూస్తే, ప్రస్తుత అనేక భావనలకు కాలం చెల్లిపోతుందని స్పష్టంగా పేర్కొన్నారు. 1950లలో టెలివిజన్ రాకతో 1960లో యూఎస్ అధ్యక్ష రాజకీయాల్లో  వచ్చిన పెనుమార్పులతో ప్రస్తుత భారత రాజకీయాలను ఆయన పోల్చారు. ప్రధాని మోదీ నాయకత్వం వల్లే భారత్ ఈ స్థితిలో నిలవగలిగిందని స్పష్టం చేశారు.

కేంద్రంలోనూ, జమ్ముకాశ్మీర్ లోనూ ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఒక వరం లాంటిదని జితేంద్ర సింగ్ ఉద్ఘాటించారు. మూడు కీలక రంగాల్లో పరివర్తనపై అది దృష్టిపెడుతుంది: ఎ) ప్రజాస్వామ్య సంస్థల ప్రజాస్వామ్యీకరణ: ప్రజాస్వామిక ప్రక్రియల పునరుద్ధరణ, విస్తరణ. b) స్వపరిపాలన: స్థానిక స్వపరిపాలన సామర్థ్యాన్ని పెంపొందించడం. సి) అన్వేషించని రంగాల్లో పరిశోధన ద్వారా అభివృద్ధి: అరోమా మిషన్ ద్వారా వినూత్నమైన వ్యవసాయ అంకుర సంస్థల వంటి కొత్త అభివృద్ధి అవకాశాల ఆవిష్కరణ. ఇది ఈ ప్రాంతంలో వేలాది మంది యువతకు ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను సృష్టించింది.

గతంలో స్థానిక పాలన, ఎన్నికల ప్రక్రియల్లో అతితక్కువ ఓట్లతోనే ప్రతినిధులు ఎన్నికవడం వంటి అసంబద్ధ చర్యలను ఆయన గుర్తు చేశారు. ఈ పద్ధతిని పార్లమెంటులో వ్యతిరేకిస్తూ, ఎన్నికల ప్రాతినిధ్యానికి కనీస పరిమితిని ఏర్పాటు చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రతిపాదించారు.

గత అయిదేళ్లలో జరిగిన చారిత్రక మార్పులు జమ్మూకాశ్మీర్ లో ప్రజాస్వామ్య ఆకాంక్షల వికాసానికి; అక్కడ స్థిరత్వం, శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి దోహదపడ్డాయని డాక్టర్ జితేంద్రసింగ్ పేర్కొన్నారు. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో జాతీయ సగటుతో సమానంగా అక్కడ దాదాపు 60 శాతం పోలింగ్ నమోదైందని గుర్తుచేశారు. జమ్ముకాశ్మీర్ ను ప్రధాన స్రవంతితోలోకి తేవాల్సిన ఆవశ్యకతను పునరుద్ఘాటించారు.

ఫిర్యాదుల పరిష్కారానికి సీపీజీఆర్ఎంఎస్ నమూనాను మంత్రి ప్రశంసించారు. దాదాపు 97-98 శాతం ఫిర్యాదులకు అది పరిష్కారం అందిస్తుంది. సాంకేతిక పురోగతిని కూడా మంత్రి ప్రస్తావించారు. రైతులకు సంబంధించి డ్రోన్ల ద్వారా పంట పొలాల్ని మ్యాపింగ్ చేయడం... స్థానిక సమూహాలకు సాధికారత వస్తుందన్నారు.

 

***



(Release ID: 2051124) Visitor Counter : 32