జాతీయ మానవ హక్కుల కమిషన్

ఆంధ్రప్రదేశ్‌ (ఎపి).. కర్ణాటక రాష్రాల్లో రహస్య కెమెరాల ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వచ్ఛంద విచారణ


కృష్ణా జిల్లా (ఎపి) బాలికల కళాశాల.. బెంగళూరు (కర్ణాటక)లోని అల్పాహారశాల స్నానపు గదుల్లో ఈ దుశ్చర్యను తీవ్రంగా పరిగణించిన ‘ఎన్‌హెచ్ఆర్‌సి’;

మహిళల భద్రత.. ఆత్మగౌరవంతో జీవించే హక్కుకు భంగం కలిగించడంపై తీవ్ర ఆందోళన; రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు నోటీసులు;

రెండు వారాల్లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశం

Posted On: 02 SEP 2024 5:45PM by PIB Hyderabad

   ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోగల ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినుల వసతి గృహంలోని స్నానపుగదుల్లో రహస్య కెమెరాలు అమర్చిన ఉదంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సి) తీవ్రంగా పరిగణించింది. ఈ కెమెరాలతో 300కుపైగా ఫొటోలు,  వీడియోలు తీశారన్న ఆరోపణలపై పత్రికా, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలను ‘ఎన్‌హెచ్ఆర్‌సి’ స్వచ్ఛందంగా విచారణ ప్రారంభించింది. కళాశాలలోని విద్యార్థినుల బృందం ఒక రహస్య కెమెరాను కనుగొని, నిరసన తెలుపుతూ ఆందోళనకు దిగడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. బాలుర వసతి గృహంలోని కొందరు విద్యార్థులు ఈ వీడియోలను కొనుగోలు చేశారన్న వార్తలు రావడంతో పోలీసులు వారిలో ఒకరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కర్ణాటక రాజధాని బెంగళూరులోగల ప్రముఖ అల్పాహారశాలలోనూ స్నానపు గదిలో కూడా ఒక రహస్య కెమెరా బయటపడింది.

   ఈ రెండు ఉదంతాలపై మాధ్యమాల కథనాలు వాస్తవమే అయితే, అది మానవ హక్కుల ఉల్లంఘన సంబంధిత తీవ్ర ఆందోళనకర అంశమని కమిషన్ వ్యాఖ్యానించింది. సంబంధిత అధికారులు మహిళలకు భద్రత, రక్షణ కల్పించలేదన్న వాస్తవాన్ని ఇలాంటి సంఘటనలు సూచిస్తాయని, ఇదెంతో ఆందోళనకరమని పేర్కొంది.

   ఈ నేపథ్యంలో సదరు ఉదంతాలపై పోలీసులు నమోదు చేసిన ‘ఎఫ్‌ఐఆర్’ ప్రస్తుత స్థితి సహా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ (డీజీపీ)లకు ‘ఎన్‌హెచ్ఆర్‌సి’ నోటీసులు జారీ చేసింది. ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా నిరోధించే దిశగా అధికారులు తీసుకున్న/ప్రతిపాదించిన చర్యలను కూడా అందులో పేర్కొనాలని స్పష్టం చేసింది. ఈ నోటీసులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు రెండు వారాల్లోగా నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది.

 

***



(Release ID: 2051083) Visitor Counter : 59