యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
అవనీ లేఖరా
పారాషూటింగ్ స్ఫూర్తి కెరటం
Posted On:
31 AUG 2024 5:25PM by PIB Hyderabad
పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో నేడు జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో అవనీ లేఖరా విజయఢంకా మోగించింది. ఆమె ఎస్ హెచ్ 1 విభాగంలో పతకాన్ని సాధించి పారాలింపిక్స్ చరిత్రలోనే రెండు స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
జీవితం తొలినాళ్లు, పునరుజ్జీవనం
రాజస్తాన్ లోని జైపూర్ లో 2001 నవంబరు 8వ తేదీన జన్మించిన అవనీ లేఖరా దేశంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన అథ్లెట్ గా పేరు గడించారు. 2012 సంవత్సరంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్నే మార్చేసింది. అప్పటి నుంచి ఆమె చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. అయినప్పటికీ పట్టుదల, చెక్కు చెదరని సంకల్పంతో జీవితంలో ముందడుగేశారు. శారీరక, భావోద్వేగపూరితమైన సవాళ్లెన్నో ఎదుర్కొంటున్నప్పటికీ అవని తిరిగి కోలుకోవడంలో తండ్రి కీలక పాత్ర పోషించారు. శారీరక, మానసిక పునరుజ్జీవానికి క్రీడలను సాధనంగా చేసుకోవాలని ప్రోత్సహించారు. ఈ ఏడాది క్రీడల్లో సాధించిన విజయంతో పారాలింపిక్స్ చరిత్రలో మూడు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్ గా ఆమె రికార్డు నెలకొల్పారు. ఆమె అంకితభావం భారతదేశాన్ని ఎల్లప్పుడూ గర్వంగా నిలుపుతూనే ఉంటుంది.
విలువిద్య నుంచి షూటింగ్ కు మార్పు
గురిపై స్పష్టత, కచ్చితమైన లక్ష్యం, క్రమశిక్షణకు మారుపేరైన విలువిద్యను ప్రారంభంలో ఎంచుకున్న అవని తనకు షూటింగ్ లోనే పోటీ సామర్థ్యం ఉన్నట్టు గుర్తించారు. భారతీయ షూటర్ అభినవ్ బింద్రాను స్ఫూర్తిగా తీసుకున్న ఆమె 2015 సంవత్సంలో షూటింగ్ ను తన అభిమాన క్రీడగా ఎంచుకున్నారు. ఆమెలోని అంకిత భావం, సహజసిద్ధమైన ప్రతిభ స్వల్పకాలంలోనే ఆమెను అందరిలో ప్రత్యేకత గల క్రీడాకారిణిగా నిలిపాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆమె విజయపరంపర ప్రారంభించారు. పారాషూటింగ్ లో ఆమె ప్రపంచ రికార్డులు నెలకొల్పి క్రీడల్లో ఒక తిరుగులేని శక్తిగా మారారు.
విద్య, బహుముఖీన ప్రతిభ
క్రీడారంగంలో విజయాలతో పాటుగా ఆమె విద్యా రంగంలో కూడా ఆమె తన ప్రతిభ చూపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. క్రీడల్లో ఊపిరాడని శిక్షణ ప్రణాళిక ఉన్నప్పటికీ రాజస్తాన్ విశ్వవిద్యాలయంలో అయిదు సంవత్సరాల న్యాయశాస్ర్త విద్యలో ప్రవేశానికి దరఖాస్తు చేశారు. ఇటు క్రీడారంగ, అటు విద్యారంగ జీవితాలు రెండింటినీ సమతూకం చేసుకునే విధంగా ఆమె ప్రదర్శించిన సంకల్పం జీవితంలో అన్ని రంగాల్లోనూ ఆమె ప్రతిభ నిరూపించుకునేందుకు దోహదపడింది.
పారాలింపిక్స్ లో చారిత్రక విజయాలు
2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్ ఆమె క్రీడా రంగ కెరీర్ ను పతాక స్థాయిలో నిలబెట్టాయి. ఆ క్రీడల్లో ఆమె రెండు పతకాలు సాధించి ఒకే క్రీడోత్సవంలో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడారిణిగా రికార్డు నెలకొల్పారు. ఆర్-2 విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్ హెచ్ 1 ఈవెంట్ లో స్వర్ణ పతకం, ఆర్-8 విమెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఎస్ హెచ్ 1లో కాంస్య పతకం సాధించారు. ఈ ఏడాది పారాలింపిక్స్ లో మరో స్వర్ణ పతకం సాధించడం ద్వారా అవనీ లేఖరా పారాలింపిక్స్ లో 3 పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్ గా చరిత్ర సృష్టించారు. ఆమె విజయం పట్ల దేశం అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. క్రీడారంగానికే మార్గదర్శిగా ఆమెను భావిస్తున్నారు.
విజయానికి ప్రభుత్వ మద్దతు
అవనీ లేఖరా పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేతగా నిలవడం వెనుక కేంద్ర ప్రభుత్వ మద్దతు ఎంతో ఉంది. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కింద అవని చాలా ఆర్థిక సహాయం అందుకున్నారు. అత్యున్నత శ్రేణి శిక్షణ పొందడానికి, ప్రత్యేక క్రీడా పరికరాలు కొనుగోలు చేయడానికి, నిపుణుల కోచింగ్ పొందడానికి అది ఎంతో సహాయకారి అయింది. దీనికి తోడు ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు ఆమె పోటీ సామర్థ్యం నిలబెట్టుకునేందుకు అవసరం అయిన వనరులు అందిస్తున్నాయి. పారా క్రీడల్లో క్రీడాకారులు ప్రతిభ ప్రదర్శించేలా తీర్చి దిద్దడానికి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న కట్టుబాటు అవని విజయానికి మూలస్తంభంగా నిలుస్తోంది. ఇతర దివ్యాంగులు కూడా ప్రపంచ యవనికపై తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవనీ స్ఫూర్తిదాయకంగా ఉంది.
విజయపథం
అవని విజయ పరంపర 2021 పారాలింపిక్స్ తో ఆగలేదు. ప్రపంచ కప్, ఆసియా పారా గేమ్స్ సహా విభిన్న అంతర్జాతీయ పోటీల్లో ఆమె ఆశాజ్యోతిగా వెలుగొందారు. అనేక క్రీడోత్సవాల్లో ఆమె పతకాలు గెలుచుకుని కొత్త విజయాలను నెలకొల్పారు. ఆమె ఆకాంక్షలు క్రీడలకే పరిమితం కాలేదు. న్యాయవిద్య ద్వారా కాడ సమాజానికి తన వంతు సేవ చేసి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నది ఆమె ఆకాంక్ష. అవని అద్భుత ప్రతిభకు గుర్తింపుగా పద్మశ్రీ, ఖేల్ రత్న సహా పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు ఆమె సొంతం అయ్యాయి.
అవనీ లేఖరా జీవితం సమర్థత, కట్టుబాటు, అద్భుత విజయాలు సాధించాలన్న చెక్కు చెదరని సంకల్పానికి మారుపేరుగా నిలుస్తుంది. జీవితాన్ని తలకిందులు చేసిన ప్రమాదం నుంచి ఆమె కోలుకుని పారాలింపిక్స్ చాంపియన్ గా నిలవడం వరకు సాగిన ప్రయాణంలో అద్భుతమైన ధైర్యం, పరిపక్వత ప్రదర్శించి పట్టుదలతో ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు. జీవితంలో ఎదురవుతున్న అవరోధాలు దాటుకుంటూ కొత్త రికార్డులు నెలకొల్పుతూ అవని కోట్లాది మందికి ఆశాజ్యోతిగా, స్ఫూర్తిగా నిలుస్తారనడంలో సందేహం లేదు.
***
(Release ID: 2050664)
Visitor Counter : 116