ప్రధాన మంత్రి కార్యాలయం
బడ్జెట్ అనంతర సమావేశంలో సీఐఐని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
30 JUL 2024 3:44PM by PIB Hyderabad
సీఐఐ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ పురిజీ, పారిశ్రామిక ప్రపంచ ప్రముఖులు, సీనియర్ దౌత్యవేత్తలు, వీడియో అనుసంధానం ద్వారా హాజరైన దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన వ్యాపార దిగ్గజాలు, ప్రముఖులు,
సోదర సోదరీమణులారా,
ఇది యువతరం సమావేశం అయిఉంటే “మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారు” అన్న ప్రశ్నతో నేను ప్రసంగం ప్రారంభించేవాడిని. అయినా ఆ రకమైన ప్రశ్నతో ప్రసంగం ప్రారంభించేందుకు ఇది సరైన వేదికే అని నేను భావిస్తున్నాను. నా దేశ ప్రజల్లో విజయోత్సాహం పొంగి పొరలుతుంటే భారత్ ఎన్నటికీ వెనుకబడే ప్రసక్తే ఉండదు. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సీఐఐకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మహమ్మారి ప్రపంచం యావత్తును అల్లకల్లోలం చేసిన కాలంలో మనందరం కలిసినప్పుడు జరిగిన చర్చ నాకు గుర్తుంది. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. “వృద్ధిని పునరుజ్జీవింపచేయడం ఎలా’’ అన్నదే నాడు మనందరి మధ్య ప్రధాన చర్చనీయాంశం. భారతదేశం త్వరలోనే అభివృద్ధి బాటలో ప్రవేశిస్తుంది అని నాడు నేను హామీ ఇచ్చాను. నేడు మనం ఎక్కడున్నాం..? భారతదేశం అత్యంత ప్రోత్సాహకరంగా 8 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. నేడు మనందరం “వికసిత్ భారత్ దిశగా ప్రయాణం” గురించి చర్చించుకుంటున్నాం. ఈ మార్పు కేవలం మనోభావాలకే పరిమితం కానే కాదు, నమ్మకంతో పడిన ముందడుగు. నేడు భారత్ ప్రంపంచంలో అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మూడో పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదు. రాజకీయ నాయకులు ఎన్నికలు ముగియగానే ఇచ్చిన హామీలు మరిచిపోతారనే భావం అందరిలోనూ ఉంది. కాని నేను ఆ ధోరణికి పూర్తి మినహాయింపుగా నిలుస్తున్నాను. నా మూడో విడత అధికార కాలంలో భారత్ మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని నేను హామీ ఇచ్చాను. నేడు దేశం ఆ దిశగా నిలకడగా పురోగమిస్తోంది.
మిత్రులారా,
2014 సంవత్సరంలో దేశానికి సేవ చేసే బాధ్యత మీరు మాకు అప్పగించి, మేం ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఎదుర్కొన్న పెద్ద సవాలు ఒక్కటే. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల పైకి ఎక్కించడం ఎలా అనేదే ఆ సవాలు. 2014 సంవత్సరానికి ముందు “అత్యంత ప్రమాదంలో ఉన్న అయిదు” ఆర్థిక వ్యవస్థల్లో మనది ఒకటిగా ఉండేదన్న విషయం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. లక్షలాది కోట్ల రూపాయల విలువ గల కుంభకోణాలు జాతిని కుంగదీశాయి. ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని వివరిస్తూ నాడు మా ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ప్రచురించింది. నేను ఆ వివరాల్లోకి వెళ్లాలనుకోవడంలేదు. కాని గతంలో మన ఆర్థిక పరిస్థితి ఏమిటి, మనం ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి అనే అంశంపై మీరు, మీ వంటి సంస్థలు అధ్యయనం చేయాలని, చర్చించాలని నేను కోరుతున్నారు. నాటి దారుణ సంక్షుభిత స్థితి నుంచి నేటి సమున్నత శిఖరాలకు భారత్‌ను, దేశీయ పరిశ్రమను మేం నడిపించాం. కొద్ది రోజుల క్రితమే బడ్జెట్ ప్రతిపాదించాం. మీ సంస్థ ఎంతో చక్కగా రూపొందించిన
పత్రం సవివరంగా అధ్యయనం చేయాలని నేను భావిస్తున్నాను. బడ్జెట్‌పై చర్చలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో కొన్ని కీలక వాస్తవాలు మీ ముందుంచాలని నేను భావిస్తున్నాను.
మిత్రులారా,
2013-14 సంవత్సరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని గత ప్రభుత్వ చివరి బడ్జెట్ పరిమాణం రూ.16 లక్షల కోట్లు. నేడు మా ప్రభుత్వ హయాంలో బడ్జెట్ పరిమాణం మూడు రెట్లు పెరిగి రూ.48 లక్షల కోట్లకు చేరింది. అత్యంత ఉత్పాదకమైన పెట్టుబడి వనరుగా భావించే మూలధన వ్యయం కూడా ఎన్నో రెట్లు పెరిగింది. 2004 సంవత్సరంలో అటల్‌జీ ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత ఏర్పడిన యూపీఏ ప్రభుత్వ తొలి బడ్జెట్‌లో మూలధన వ్యయం సుమారు రూ.90 వేల కోట్లుంది. ఒక దశాబ్ది పాటు అధికారంలో ఉన్న అనంతరం 2014 నాటికి యూపీఏ ప్రభుత్వం దీన్ని రూ.2 లక్షల కోట్లకు చేర్చింది. కాని నేడు మా ప్రభుత్వ హయాంలో మూలధన వ్యయం రూ.11 లక్షల కోట్లు దాటింది. గత ప్రభుత్వ హయాంలో దశాబ్ది కాలంలో మూలధన వ్యయం రెట్టింపు పెరిగితే మా ప్రభుత్వ హయాంలో ఐదు రెట్లు పెరిగింది. విభిన్న రంగాల తీరును పరిశీలించినా ప్రతీ ఒక్క రంగం పైన భారత్ ఎంతగా దృష్టి కేంద్రీకరిస్తోందో మీరందరూ తెలుసుకోగలుగుతారు. గత ప్రభుత్వ హయాంలోని 10 సంవత్సరాలతో పోల్చితే మా ప్రభుత్వ హయాంలో రైల్వే బడ్జెట్ ఎనిమిది రెట్లు పెరిగింది. అలాగే హైవేల బడ్జెట్ ఎనిమిది రెట్లు, వ్యవసాయ బడ్జెట్ నాలుగు రెట్లకు పైబడి, రక్షణ బడ్జెట్ రెండు రెట్లకు పైబడి పెరిగాయి.
మిత్రులారా,
అన్ని రంగాలకు బడ్జెట్ గణనీయంగా పెంచడం ద్వారా మాత్రమే కాదు, పన్నులు రికార్డు స్థాయిలో తగ్గించడం ద్వారా ఈ పురోగతి సాధించాం. 2014 సంవత్సరంలో రూ.1 కోటి ఆదాయం గల ఎంఎస్ఎంఇలు ఊహాత్మక పన్ను విధానం ఎంచుకునే అవకాశం ఉండేది. కాని నేడు రూ.3 కోట్ల వరకు ఆదాయం గల ఎంఎస్ఎంఇలు ఈ పన్ను పధకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. 2014 సంవత్సరంలో రూ.50 కోట్ల వార్షికాదాయం గల ఎంఎస్ఎంఇలపై పన్ను భారం 30 శాతం ఉండగా ఇప్పుడది 22 శాతానికి తగ్గింది. అలాగే రూ.400 కోట్లు వార్షికాదాయం గల కంపెనీలపై కార్పొరేట్ పన్ను 2014 సంవత్సరంలో 30 శాతం ఉండగా ఇప్పుడది 25 శాతానికి దిగి వచ్చింది.
మిత్రులారా,
బడ్జెట్ కేటాయింపులు పెంచడం, తగ్గించడం మాత్రమే కాదు...సత్పరిపాలన అమలు గురించి కూడా పరిశీలించండి. ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి బరువు తగ్గిపోయి బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ అనారోగ్యం కారణంగా అతని శరీరం లావెక్కితే అతని దుస్తులు కూడా గతం కన్నా బిగుతైపోతాయి. అయినప్పటికీ మనం అతన్ని ఆరోగ్యవంతుడుగానే పరిగణిస్తామా? అతను భౌతికంగా ఫిట్‌గా ఉన్నట్టు పరిగణించగలమా? అలాంటి వ్యక్తులు భౌతికంగా ఆరోగ్యంగా ఉన్నట్టుగానే కనిపిస్తారు, కాని వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. 2014 సంవత్సరానికి ముందు మన బడ్జెట్ పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఆ రోజుల్లో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న అభిప్రాయం కలిగించేందుకు విశేషమైన ప్రకటనలు చేసే వారు. కాని క్షేత్ర స్థాయిలో ఆ ప్రకటనలు పూర్తి స్థాయిలో అమలు జరిగేవి కావు. మౌలిక వసతులకు కేటాయించిన నిధులు పూర్తిగా వినియోగించే వారు కాదు. పతాక శీర్షికల్లో ప్రచురణకు నోచుకున్న ఆ ప్రకటనలు అప్పుడప్పుడూ స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసేవి. గత ప్రభుత్వం సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎన్నడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. గత దశాబ్ది కాలంలో మేం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చి వేశాం. మా ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణంలో చూపిస్తున్న వేగం, పరిధి కూడా మీరందరూ చూశారు.
మిత్రులారా,
నేడు ప్రపంచం యావత్తు అస్థిరతలతో కునారిల్లుతోంది. అటువంటి ఆటుపోట్లలో కూడా భారతదేశం సాధిస్తున్న వృద్ధి, ప్రదర్శిస్తున్న స్థిరత్వం అసాధారణం. ఇలాంటి అస్థిరతల సమయంలోకూడా భారత విదేశీ మారకం నిల్వలు గణనీయంగా పెరిగాయి. ప్రపంచంలోని పలు దేశాలు స్వల్ప వృద్ధి, గరిష్ఠ ద్రవ్యోల్బణంతో పోరాడుతుంటే భారతదేశం గరిష్ఠ వృద్ధి, కనిష్ఠ ద్రవ్యోల్బణంతో మెరుగైన స్థితిలో ఉంది. మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో భారత్ ప్రదర్శించిన ఆర్థిక క్రమశిక్షణ ప్రపంచానికి మార్గదర్శకంగా మారింది. ప్రపంచ వస్తు, సేవల ఎగుమతుల్లో మన వాటా నిలకడగా పెరుగుతోంది. ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా ప్రస్తుతం 16 శాతం ఉంది. గత దశాబ్ది కాలంలో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటూ కూడా భారత్ ఈ వృద్ధిని సాధించడం విశేషం. శతాబ్ది కాలంలోనే అతి తీవ్రమైన మహమ్మారి నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు యుద్ధాలు; దేశీయంగా తుపానులు, దుర్భిక్షాలు, భూకంపాలు వంటి ఎన్నో సవాళ్లను భారత్ దీటుగా అధిగమించింది. ఈ సంక్షోభాలే గనుక లేకుండా ఉంటే భారత వృద్ధి మరింత అధికంగా ఉండేది. నాలోని నమ్మకం, అనుభవం ఆధారంగా ఈ విశ్వాసం ప్రకటిస్తున్నాను.
మిత్రులారా,
నేడు దేశం అభివృద్ధి చెందిన భారత్ విజన్‌తో ముందుకు సాగుతోంది. గత దశాబ్ది కాలంలో 25 కోట్ల మంది పైగా ప్రజలు దారిద్ర్యరేఖ నుంచి వెలుపలికి వచ్చారు. పౌరుల జీవన సౌలభ్యం, జీవన నాణ్యత మెరుగుపరచాలన్న లక్ష్యానికి మేం కట్టుబడి ఉన్నాం.
మిత్రులారా,
ఇండస్ర్టీ 4.0ను దృష్టిలో ఉంచుకుని నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి మేం ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి ప్రవేశించాలనే ఉత్సాహం యువతలో పెల్లుబుకుతోంది. ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి పథకాలు వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ముద్రా యోజన ద్వారా 8 కోట్ల మంది పైగా తొలిసారిగా వ్యాపారాలు ప్రారంభించుకున్నారు. నేడు దేశంలో 1.40 లక్షల స్టార్టప్‌లు పని చేస్తున్నాయి. లక్షల సంఖ్యలో యువత కొత్త వెంచర్లలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ బడ్జెట్లో రూ.2 లక్షల కోట్ల మూలధనంతో ప్రకటించిన పిఎం ప్యాకేజి విస్తృతంగా ప్రశంసలు అందుకుంది. దీని ద్వారా 4 కోట్ల మంది పైగా యువత ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు. సర్వసమగ్రమైన ఈ పిఎం ప్యాకేజి అనుసంధానిత, శాశ్వత పరిష్కారాలు అందిస్తుంది. భారత కార్మిక శక్తిని ప్రపంచ శ్రేణి పోటీ సామర్థ్యం గలదిగా తీర్చి దిద్దడం; భారత ఉత్పత్తులు నాణ్యతలోనే కాకుండా విలువలో కూడా పోటీ సామర్థ్యం గలవిగా భరోసా ఇవ్వడం దీని విజన్. యువతలో నైపుణ్యాలు పెంచడం, వారికి మరింత గుర్తింపు కల్పించడం, తేలిగ్గా ఉపాధి లభించేలా చేయడం లక్ష్యంగా ఇంటర్న్ షిప్ స్కీం మే ప్రవేశపెట్టాం. ఉపాధి కల్పించే వారికి మంచిప్రోత్సాహకాలు అందిస్తామన్న భరోసా కల్పించాం. అందుకు అనుగుణంగానే ఇపిఎఫ్ఓ కాంట్రిబ్యూషన్‌కు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది.
మిత్రులారా,
మా ప్రభుత్వ లక్ష్యం, కట్టుబాటు సుస్పష్టం. మాది చెక్కు చెదరని గమ్యం. జాతిని ప్రథమంగా నిలపాలన్న అంకితభావం, 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా దేశాన్నినిలపాలన్న ఆకాంక్ష, సంతృప్త స్థాయి సాధించాలన్న వైఖరి, జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్ సాధించాలన్న కట్టుబాటు, స్వయం-సమృద్ధ భారత్ పట్ల దృఢమైన కట్టుబాటు లేదా అభివృద్ధి చెందిన భారత్ అనే దీర్ఘకాలిక సంకల్పం...అన్నింటినీ సాకారం చేయడానికి మేం స్పష్టమైన లక్ష్యం, కట్టుబాటుతో కృషి చేస్తున్నాం. మా పథకాలు నిరంతరం విస్తరిస్తూ, వాటి పురోగతిని సమీక్షిస్తున్నాం. అభివృద్ధి పట్ల ప్రభుత్వ వైఖరి, కట్టుబాటు మీ అందరికీ తెలుసు. మేం నిరంతరం కొత్త విజయాలు నమోదు చేస్తున్నాం. అందుకే ప్రభుత్వంతో కలిసి పరిశ్రమ అడుగేయాలని నేను కోరుతున్నాను. వాస్తవానికి అభివృద్ధి చెందిన భారత్ విజన్ సాధించేందుకు మీరంతా ప్రభుత్వంతో పోటీ పడాలి. మీ ప్రయత్నాలు ప్రభుత్వ కృషిని మించి ఉంటాయని నేను ఆశిస్తున్నాను. పిఎం ప్యాకేజిని పరిశ్రమ, ప్రభుత్వం కలిసి వేగంగా, ఉమ్మడి బాధ్యతతో ముందుకు నడిపించాలి. ఈ సవాలును అధిగమించడంలో మీ సామర్థ్యంపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.
మిత్రులారా,
అభివృద్ధి చెందిన భారత్ దిశగా మన ప్రయాణాన్ని ఉత్తేజితం చేసే మరో ప్రధానాంశం ఈ బడ్జెట్‌లో ఉంది. అదే తయారీ రంగాన్ని సమాయత్తం చేయడం. గత దశాబ్ది కాలంలో దేశీయ తయారీ రంగంలో ఎంతో పరివర్తన ఏర్పడింది. మేక్ ఇన్ ఇండియా పేరిట ఒక అద్భుతమైన కార్యక్రమం మేం ప్రారంభించాం. విభిన్న రంగాలకు ఎఫ్‌డిఐ నిబంధనలు సరళీకరించాం. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు నిర్మించాం. 14 రంగాలకు పిఎల్ఐ స్కీమ్ ప్రవేశపెట్టాం. ఈ చర్యలన్నీ తయారీ రంగంలో విశ్వాసాన్ని ఎంతో ఉత్తేజితం చేశాయి. దేశంలోని 100కి పైగా ప్రధాన నగరాల్లో పెట్టుబడులకు అనుకూలమైన “ప్లగ్ అండ్ ప్లే” పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు ఈ బడ్జెట్‌లో ప్రకటించాం. నగరాలు అభివృద్ధి చెందిన భారత్‌కు కొత్త వృద్ధికేంద్రాలుగా మారతాయి. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక కారిడార్లను ప్రభుత్వం ఆధునీకరిస్తుంది. కోట్లాది మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఇలకు కూడా మేం అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎంఎస్ఎంఇలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూనే అవి ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఎంఎస్ఎంఇలకు అవసరమైనంత వర్కింగ్ క్యాపిటల్, రుణాలు అందుబాటులో ఉంచేందుకు; నిబంధనల కట్టుబాటు భారం, పన్నుల భారం తగ్గించేందుకు; మార్కెట్ విస్తరణ, అవకాశాలు పెంచేందుకు; వాటి కార్యకలాపాలు వ్యవస్థీకృతం చేసేందుకు 2014 సంవత్సరం నుంచి ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోంది. అందుకు దీటుగానే ఈ బడ్జెట్ ఎంఎస్ఎంఇలకు నూతన రుణ హామీ పథకాన్ని ప్రతిపాదించింది.
మిత్రులారా,
బడ్జెట్ ప్రతిపాదన ఎప్పుడు వచ్చినా కొన్ని ప్రధానాంశాల పైనే చర్చ జరగడం పరిపాటి. మీడియా సంస్థల అజెండాకు అనుగుణంగానే చర్చలు నడుస్తూ ఉంటాయి. చర్చలు వాస్తవ పరిస్థితిని మరింతగా ప్రతిబింబించాలన్న లక్ష్యంతో మేం మరింత లోతైన పరిశీలన చేపట్టాం. సాధారణంగా పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులే విభిన్న అంశాలు చర్చకు తెస్తూ ఉంటారు. సమాజంలోని అన్ని వర్గాలు తరచూ బడ్జెట్‌లోని అంశాలపై చర్చిస్తూ ఉండాలని, సూక్ష్మంగా విశ్లేషిస్తూ ఉండాలన్నది నా భావన. ఉదాహరణకి అణు ఇంధన ఉత్పత్తికి బడ్జెట్ కేటాయింపులు పెంచింది. వ్యవసాయ రంగం కోసం ప్రభుత్వ డిజిటల్ మౌలిక వసతులు మేం నిర్మిస్తున్నాం. భూములను తేలిగ్గా గుర్తించేందుకు వీలుగా మేం భూ-ఆధార్ కార్డులు జారీ చేస్తున్నాం. అంతరిక్ష వ్యవస్థ కోసం రూ.1000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం క్రిటికల్ మినరల్ మిషన్‌ను కూడా ప్రకటించింది. త్వరలోనే ఆఫ్‌షోర్ మైనింగ్ బ్లాక్‌ల వేలం మేం ప్రారంభించబోతున్నాం. ఇవన్నీ అనేక అవకాశాలు కల్పించడంతో పాటు పురోగతికి కొత్త మార్గాలు తెరుస్తాయి.
మిత్రులారా,
ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతున్న తరుణంలో విభిన్న రంగాల్లో ప్రత్యేకించి వృద్ధికి చోదకంగా నిలిచే రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. టెక్నాలజీ వర్తమానానికే కాదు, భవిష్యత్తుకు కూడా అవసరం. విలువ ఆధారిత సెమీ కండక్టర్ వ్యవస్థలో స్థానం సంపాదించుకున్న భారత్ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుంది. అందుకే మేం ఈ పరిశ్రమను ముందుకు నడిపిస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ తయారీని కూడా మేం ప్రోత్సహిస్తున్నాం. మనం ప్రస్తుతం మొబైల్ తయారీ విప్లవానికి మధ్యలో ఉన్నాం. ఒకప్పుడు మొబైల్ ఫోన్ల దిగుమతిదారుగా ఉన్న భారత్ నేడు ప్రపంచంలో అగ్రశ్రేణి తయారీ, ఎగుమతి దేశాల్లో ఒకటిగా ఉంది. హరిత ఉపాధి రంగాల కోసం మేం ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాం. హరిత హైడ్రోజెన్, విద్యుత్ వాహనాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం. పిఎం సూర్యఘర్ యోజన అనేక మంది వెండర్లకు అవకాశాలు కల్పిస్తున్న భారీ పథకం. ఈ పథకంలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శించే ప్రతీ ఒక్క ఇంటికీ ప్రభుత్వం రూ.75,000 అందిస్తోంది. ఈ పథకం అద్భుతమైన విప్లవానికి దారి తీస్తుంది.
ఈ బడ్జెట్‌లో స్వచ్ఛ ఇంధనాల కోసం తీసుకున్న చర్యలపై విస్తృత చర్చ జరుగుతోంది. నేటి యుగంలో ఇంధన భద్రత, ఇంధన పరివర్తన ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి అత్యంత కీలకం. చిన్న అణు రియాక్టర్లపై కూడా మేం కృషి చేస్తున్నాం. ఇది ఇంధన లభ్యత ద్వారా పరిశ్రమకు మాత్రమే ప్రయోజనకరం కాదు, సరఫరా వ్యవస్థ అంతటా కొత్త వ్యాపారావకాశాలు ఏర్పడతాయి. మన పారిశ్రామికవేత్తలు, ఎంటర్‌ప్రెన్యూర్లు దేశాభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ కట్టుబాటును ప్రదర్శిస్తూనే ఉన్నారు. నేను ప్రస్తావించిన వృద్ధికి అవకాశం ఉన్న అన్ని రంగాల్లోనూ భారత్ ప్రపంచ నాయకత్వ స్థానం సంపాదించగలదన్న నమ్మకం నాకుంది. “ప్రపంచ నాయకత్వం” అనేది నా వరకు కేవలం ఒక పదం మాత్రమే కాదు...దేశం ఈ హోదాను సాధిస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
మిత్రులారా,
మా ప్రభుత్వంలో రాజకీయ చిత్తశుద్ధి లోపం ఏ మాత్రం లేదు. మీ అందరికీ ఆ విషయం తెలుసు. దేశం, దేశ ప్రజల ఆకాంక్షలే మాకు అత్యంత ప్రధానం. పారిశ్రామిక రంగం, ప్రైవేట్ రంగం అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో శక్తివంతమైన మాధ్యమాలుగా నేను భావిస్తున్నాను. సంపద సృష్టికర్తలైన మీ వంటి మిత్రులే భారత వృద్ధిగాథలో కీలక చోదక శక్తులు అన్నది నా భావన. ఈ మాట చెబుతున్నందుకు ప్రత్యేకించి ఎర్రకోట బురుజుల నుంచి అయినా సరే చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
మిత్రులారా,
ప్రపంచం యావత్తు ఎన్నో ఆశలతో భారత్ వంక, మీ అందరి వంక చూస్తోంది. భారతదేశంలో అనుసరిస్తున్న విధానాలు, ప్రదర్శిస్తున్న అంకిత భావం, కట్టుబాటు; తీసుకుంటున్న నిర్ణయాలు, పెట్టుబడులే ప్రపంచ పురోగతికి రూపం కల్పిస్తున్నాయి. ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు చెందిన ఇన్వెస్టర్లు భారత్ రావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ నాయకులందరూ భారత్ పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నారు. ఇది భారత్‌కు సువర్ణావకాశం. ఈ అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదు. రాష్ట్రాల స్థాయిలో పెట్టుబడిదారులకు అనుకూలమైన విధాన పత్రాలు రూపొందించాలని ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేను సూచించాను. పెట్టుబడుల ఆకర్షణ విషయంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఈ వృద్ధిలో ప్రతీ ఒక్క రాష్ట్రం భాగస్వామి కావాలని నేను కోరుతున్నాను. ఏ ఒక్క రాష్ట్రం పోటీలో వెనుకబడిపోకూడదు. పెట్టుబడి విధానాల్లో మరింత స్పష్టత తెచ్చేందుకు, మెరుగైన వాతావరణం కల్పించేందుకు, ప్రతీ ఒక్క దశలోనూ సత్పరిపాలన అందించేందుకు మనం ప్రతీ రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యంగా చేయాలి.
మిత్రులారా,
దేశం స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే సమయానికి మనం అభివృద్ధి చెందిన భారత్ గమ్యాన్ని చేరగలమని గత దశాబ్ది కాలంగా సాధించిన అనుభవం, ప్రపంచ పరిస్థితులపై పెంచుకున్న అవగాహన ఆధారంగా నేను నమ్మకంగా చెబుతున్నాను. పదే పదే దోపిడీకి గురైన, నిరుపేద దేశంగా మనం స్వాతంత్య్రం సాధించాం. అయినా మనం ప్రయాణం ప్రారంభించాం. 100 సంవత్సరాల లోపే అన్ని అవరోధాలను అధిగమిస్తూ, సంకల్పాలు నెరవేర్చుకుంటూ అభివృద్ధి చెందిన భారత్ కల సాకారం చేసుకునే దిశగా ముందడుగేస్తున్నాం. మన జీవిత కాలంలో చూడలేకపోయినా భవిష్యత్ తరాలు అభివృద్ధి చెందిన భారతదేశంలో గర్వంగా నివశించేలా చూడాలన్నది మన కల. దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చి దిద్దేందుకు మనందరం కలిసికట్టుగా అడుగేయాలి. అందుకే మనం సమాజానికి, దేశానికి ఎంత అందించగలమో అంత చేయాలి. ఇదే స్ఫూర్తితో నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
ధన్యవాదాలు.
గమనిక : ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి అనువాదం మాత్రమే.
***
(Release ID: 2050527)
Visitor Counter : 49
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam