ఆయుష్
ఆయర్వేదంలో కీళ్లవాపు వ్యాధికి సరికొత్త చికిత్స
Posted On:
29 AUG 2024 4:22PM by PIB Hyderabad
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఇబ్బంది పెడుతుతన్న అనారోగ్య సమస్య- కీళ్ల నొప్పులు లేదా కీళ్లవాపు (రుమటాయిడ్ ఆర్ధరైటిస్). మనలోని వ్యాధి నిరోధకశక్తి మన శరీర కణాలపై దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధి ఇది. అయితే- ఆయుర్వేదంలో బహు లక్షిత చికిత్స (ఆయుర్వేదిక్ హోల్ సిస్టమ్/ఏడబ్ల్యూఎస్) గణనీయమైన ప్రభావం చూపుతోందని ఓ కొత్త శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది. ఈ కొత్త చికిత్స కీళ్లవాపు లక్షణాలను తగ్గించడంతో పాటు, వ్యాధిగ్రస్తుల్లో జీవ క్రియలను సాధారణీకరణ దిశగా ప్రేరేపిస్తుందని ఈ పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఇది సాంప్రదాయిక చికిత్సలకు తోడు ఈ కొత్త విధానం అదనపు చికిత్సగా అనుకోవచ్చు.
ఆర్థరైటిస్ చికిత్స-అధునాతన పరిశోధన కేంద్రం (ఎ-ఏటీఏఆర్సీ); లక్నో విశ్వవిద్యాలయానికి చెందిన రాష్ట్ర ఆయుర్వేద కళాశాల-ఆస్పత్రి కాయ చికిత్స విభాగం; జీవవైద్య పరిశోధన కేంద్రం (సీబీఎంఆర్), లక్నో లోని ఎస్జీపీజీఐఎంఎస్ క్యాంపస్; ఘజియాబాద్ లోని శాస్త్రీయ-ఆవిష్కరణాత్మక పరిశోధన సంస్థ (ఏసీఎస్ఐఆర్) సహా ప్రసిద్ధ సంస్థలకు చెందిన సీనియర్ పరిశోధకుల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది.
“కీళ్లవాపులకు సంబంధించి బహులక్షిత ఆయుర్వేద విధానంతో (హోల్ సిస్టమ్) చికిత్స పొందుతున్న సందర్భంలో, వ్యాధి నిదాన కోణంలో ఈ అధ్యయనం ప్రధానమైంది. ఇది ‘సంప్రాప్తి విఘటన’ అన్న ఆయుర్వేద భావనలను బలపరుస్తుంది. అందులో వ్యాధికారకం-వ్యాధి సంక్లిష్టత విచ్ఛిన్నమై, ‘దోషాలు’ తొలగిపోయి సాధారణ స్థితి వస్తుంది” అని డాక్టర్ సంజీవ్ రస్తోగీ పేర్కొన్నారు.
పబ్ మెడ్- అనుసూచిత పరిశోధన పత్రిక, జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ (జేఏఐఎం)లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఏడబ్ల్యూఎస్ ప్రమేయంతో కీళ్లవాపు వ్యాధిగ్రస్తుల్లో చికిత్సా ప్రమాణాల్లో గణనీయమైన మెరుగుదలను ఇది ప్రముఖంగా పేర్కొన్నది. వ్యాధి నిదాన గణన స్కోరు ఎర్రరక్త కణ అవక్షేపణ రేటు 28 (డీఏఎస్-28 ఈఎస్ఆర్) గా కనిపించింది. అదేవిధంగా కీళ్ల వాపు, మృదు కీళ్ల పరంగా కూడా వ్యాధి తీవ్రత సంఖ్య కూడా తగ్గింది. అంతేకాకుండా, ఏడబ్ల్యూఎస్ ప్రమేయం అనంతరం శరీరంలో అమవాత (ఏఏఎం) స్కోరు కూడా గణనీయంగా తగ్గింది.
ఆరోగ్యకరమైన నియంత్రణలతో పోలుస్తూ, కీళ్లవాపు వ్యాధిగ్రస్తుల జీవక్రియ విధానాలను ఈ పరిశోధన లోతుగా పరిశీలించింది. అధ్యయనం మొదట్లో- సక్సినేట్, లైసిన్, మన్నోస్, క్రియాటిన్, 3-హైడ్రాక్సీబ్యూటిరేట్ (3-హెచ్బీ) సహా నిర్దిష్ట జీవక్రియల్లో కీళ్లవాపు వ్యాధిగ్రస్తుల్లో అధిక జీవక్రియ స్థాయులను గమనించారు. అదేకాకుండా, అలనైన్ స్థాయులు తగ్గాయి. అయితే, ఏడబ్ల్యూఎస్ చికిత్స అనంతరం ఈ జీవక్రియలు ఆరోగ్యకరమైన వ్యక్తులలో కనిపించే స్థాయిలోకి మారడం మొదలైంది. మరింత ఆరోగ్యకరమైన జీవక్రియల స్థితికి తిరిగి రావడాన్ని ఇది సూచిస్తుంది.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, కీళ్లవాపు వ్యాధి నిర్వహణలో ఏడబ్ల్యూఎస్ చికిత్సాపరమైన సమర్థతను స్పష్టంగా వెల్లడించిన మొదటి అధ్యయనం ఇది. ఈ చికిత్స లక్షణాలను తగ్గించడమే కాకుండా, సమస్థితికి అనుకూలమైన జీవక్రియ వాతావరణాన్ని ప్రోత్సహించింది. ఆర్ఏ వ్యాధిగ్రస్తులకు ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది.
ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ప్రాథమిక ఫలితాలను నిర్ధారించడానికి; ఏడబ్ల్యూఎస్ చికిత్స ప్రభావాలను వెల్లడించే యంత్రాంగాలను బాగా అవగతం చేసుకోవడానికి మరింత పరిశోధన చేయాల్సిన ఆవశ్యకతను నిర్వాహకులు స్పష్టం చేశారు.
సంప్రదాయ ఆయుర్వేద పద్ధతులను ఆధునిక వైద్య విధానాలతో అనుసంధానించి కీళ్లవాపు (రుమటాయిడ్ ఆర్థరైటిస్) వంటి దీర్ఘకాలిక రుగ్మతల విషయంలో ఫలితాలను మెరుగుపరచగల సమర్థత ఈ అధ్యయనం ద్వారా స్పష్టమవుతోంది.
***
(Release ID: 2050166)
Visitor Counter : 122