ప్రధాన మంత్రి కార్యాలయం

ఆగస్టు 30న మహారాష్ట్రను సందర్శించనున్న ప్రధానమంత్రి


పాల్‌ఘర్ లో దాదాపు రూ. 76,000 కోట్ల వధావన్ ఓడరేవు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

భారతదేశంలో అతి పెద్ద డీప్ వాటర్ పోర్టుల్లో ఇక వధావన్

పెరగనున్న సముద్ర మార్గ అనుసంధానం

మరింత శక్తిమంతమైన అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా భారత్

ప్రధాని చేతుల మీదుగా రూ.1560 కోట్ల 218 మత్స్య ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు


దేశవ్యాప్తంగా అందుబాటులోకి నౌకా సమాచార, సహాయ వ్యవస్థ

13 కోస్తా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్వయంచాలక నౌకలు, యంత్ర చాలక నౌకలపై లక్ష ట్రాన్స్ పాండర్ల ఏర్పాటు


ముంబయిలో ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024’ ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

Posted On: 29 AUG 2024 4:37PM by PIB Hyderabad

మహారాష్ట్ర లోని పాల్‌ఘర్, ముంబయిలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 30వ తేదీన సందర్శించనున్నారు. ఉదయం దాదాపు 11 గంటలకు ప్రధాన మంత్రి ముంబయి లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటరుకు చేరుకొని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జిఎఫ్ఎఫ్) కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రధానమంత్రి పాల్‌ఘర్ లోని సిఐడిసిఒ మైదానానికి చేరుకొని, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభించి, శంకుస్థాపనలు చేస్తారు.

పాల్‌ఘర్ లో ప్రధాన మంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ రేపు వధావన్ పోర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.  ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.76,000 కోట్లు వ్యయం కానుంది. ప్రపంచ శ్రేణి సముద్ర వ్యాపార కూడలి (Maritime Gateway)ని ఏర్పాటు చేయాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం.  ఇది పెద్ద కార్గో ఓడల అవసరాలను తీరుస్తూ, దేశ వ్యాపార, ఆర్థికవృద్ధికి దన్నుగా నిలుస్తుంది. కంటైనర్ నౌకలను నిలిపేందుకు అనువుగా బాగా లోతైన ప్రాంతం కలిగిన డాకింగ్ సదుపాయాలను సమకూర్చడంతో పాటు భారీ సరుకు రవాణా ఓడలను సైతం అక్కడ నిలిపి ఉండేందుకు వీలుగా ఈ పోర్టును రూపొందించారు.

 

పాల్‌ఘర్ జిల్లాలోని డహాణు పట్టణానికి దగ్గరలో నెలకొనే వధావన్ పోర్టు భారతదేశంలో అత్యంత పెద్ద డీప్ వాటర్ పోర్టుల్లో ఒకటి కానుంది.  ఈ పోర్టు అంతర్జాతీయ నౌకాయాన మార్గాలతో ప్రత్యక్ష అనుసంధానాన్ని కలిగి ఉంటుంది. సరకు రవాణాకు పట్టే కాలాన్నీ, వ్యయాన్నీ తగ్గించనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మౌలిక సదుపాయాలతో సిద్ధం కానున్న ఈ నౌకాశ్రయంలో పడవలను నిలిపి ఉంచడానికి లోతైన బెర్తులు, సరకు- లోడింగ్, అన్ లోడింగ్ సదుపాయాలు, ఆధునిక నౌకాశ్రయ నిర్వహణ వ్యవస్థలు ఉన్నాయి. ఈ నౌకాశ్రయం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని, స్థానిక వ్యాపారాలకు ఊతంగా నిలుస్తుందని, అదే సమయంలో ఆ ప్రాంత సమగ్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు.

పర్యావరణానికి ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా పర్యావరణ నిబంధనలకు లోబడి ఈ ఓడరేవును అభివృద్ధికి అనువుగా ఉండేలా తీర్చిదిద్దారు. ఓడరేవు ప్రారంభమైన తర్వాత దేశీయ సముద్ర యాన మార్గాలతో అనుసంధానం కావడమే కాకుండా, అంతర్జాతీయ సముద్ర వ్యాపార కూడలిగా భారతదేశాన్ని మరింత శక్తిమంతం చేస్తుంది.

 

దాదాపు రూ.1,560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించడంతో పాటుగా శంకుస్థాపనలు చేయనున్నారు. మత్స్య పరిశ్రమ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేశవ్యాప్తంగా ఆ రంగం లో ఉత్పాదక వృద్ధికి దోహదపడాలన్నదే ఈ ప్రాజెక్టుల ధ్యేయం. మత్స్య పరిశ్రమ రంగంలో అయిదు లక్షలకు పైగా ఉద్యోగావకాశాలను ఈ ప్రాజెక్టులు కల్పిస్తాయన్నది ఒక అంచనా. 

 

దేశవ్యాప్తంగా ప్రారంభమవుతున్న నౌకా సమాచార, సహాయ వ్యవస్థకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శ్రీకారం చుడతారు. దీనికి దాదాపు రూ.360 కోట్లు ఖర్చు కానుంది.  ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక లక్ష ట్రాన్స్ పాండర్లను దశల వారీగా 13 కోస్తా తీర ప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపల వేటకు ఉపయోగించే స్వయంచాలక, యంత్ర చాలక నౌకల్లో అమర్చనున్నారు. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో నౌకలకు సంబంధించిన సమాచార సహాయక వ్యవస్థను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అభివృద్ధి  చేసింది. ఇది మత్స్యకారులు సముద్రంలో ఉన్న కాలంలో రెండు వైపులా సమాచార ప్రసారానికి వీలు కల్పించడంతో పాటు వారి భద్రతకు పూచీపడుతూ రక్షణ కార్యకలాపాలలో సహాయకారిగా ఉంటుంది.

 

ప్రధాన మంత్రి ప్రారంభించనున్న ఇతర కార్యక్రమాలలో.. ఫిషింగ్ హార్బర్లు, ఇంటిగ్రేటెడ్ ఆక్వాపార్కుల అభివృద్ధి కార్యక్రమం, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్, బయోఫ్లాక్ వంటి పురోగామి సాంకేతికతలను కార్యాచరణలోకి తీసుకువచ్చే కార్యక్రమాలు కూడా ఉన్నాయి.  ఈ ప్రాజెక్టులను అనేక రాష్ట్రాలలో అమలు పరచనున్నారు.  చేపల ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ముఖ్య మౌలిక సదుపాయాలను, ఉన్నత నాణ్యత కలిగిన ఇన్‌పుట్స్ ను, ఈ కార్యక్రమాలు సమకూర్చనున్నాయి. చేపల వేట అనంతర కాలంలో అవలంబించే నిర్వహణ పద్ధతులను మెరుగు పరచనున్నాయి.  అంతేకాకుండా, మత్స్య పరిశ్రమ రంగంలో లక్షలాది మంది జీవికకు ఇవి ఉపకరించనున్నాయి.

 

ఫిషింగ్ హార్బర్ లు, చేపల సరకు దింపుడు కేంద్రాల అభివృద్ధి, ఉన్నతీకరణ, నవనీకరణ, చేపల బజార్ల నిర్మాణం సహా మత్స్య పరిశ్రమకు సంబంధించిన ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. చేపలను వేటాడిన అనంతరం వాటి నిర్వహణ పద్ధతులలోను, సముద్రం నుండి లభించే ఇతర ఆహారోత్పత్తుల విషయంలోను పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చే విధానంలో రూపొందించిన సదుపాయాలను ఈ ప్రాజెక్టులు సమకూర్చుతాయని భావిస్తున్నారు.

ముంబయిలో ప్రధానమంత్రి

గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ (జిఎఫ్ఎఫ్) 2024 లో భాగంగా నిర్వహించనున్న ఒక ప్రత్యేక సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.  పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫిన్ టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్  కలసి జిఎఫ్ఎఫ్ ను నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు, సీనియర్ బ్యాంకర్లు, పరిశ్రమ సారధులు, విద్యావేత్తలతో సహా దేశ విదేశాల నుంచి దాదాపు 800 మంది వక్తలు పాల్గొని 350కి పైగా ఇక్కడ నిర్వహించే సదస్సుల్లో పాల్గొంటారు. జిఎఫ్ఎఫ్ ఆర్థిక రంగ సాంకేతికత (ఫిన్‌టెక్)లో సరికొత్త నవ కల్పనలను ప్రదర్శనకు ఉంచబోతున్నది.  పరిశ్రమ తాలూకు ఆలోచనలను, సమగ్ర సమాచారాన్ని వెల్లడించనున్న 20కి పైగా ఆలోచనాత్మక నాయకత్వ నివేదికలను, శ్వేతపత్రాలను జిఎఫ్ఎఫ్ 2024 లో విడుదల చేయనున్నారు.



(Release ID: 2049925) Visitor Counter : 29