ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

44వ ప్రగతి సదస్సుకు ప్రధాని అధ్యక్షత


11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.76,500 కోట్లకు పైగా విలువైన ఏడు కీలక ప్రాజెక్టులను సమీక్షించిన ప్రధాని

ప్రాజెక్టుల జాప్యం వల్ల వ్యయం పెరగడమే కాదు, ఉద్దేశిత ప్రయోజనాలను ప్రజలు కోల్పోతారు: ప్రధాని

ప్రాజెక్ట్ అభివృద్ధి సమయంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారం పర్యావరణ సంరక్షణలో దోహదపడుతుంది: ప్రధాని
అమృత్ 2.0పై ప్రధాని సమీక్ష; పనులను స్వయంగా పర్యవేక్షించాలని ప్రధాన కార్యదర్శులకు సూచన

నగరాల వృద్ధి సామర్ధ్యం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించాలన్న ప్రధాని

జల్ జీవన్ మిషన్ ప్రజా ఫిర్యాదులపై ప్రధాని సమీక్ష

మిషన్ అమృత్ సరోవర్ పనులు కొనసాగించాలని సూచన

Posted On: 28 AUG 2024 6:58PM by PIB Hyderabad

క్రియాశీల పాలన, సకాలంలో అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన ఐసీటీ ఆధారిత బహువిధ వేదిక ప్రగతి 44వ ఎడిషన్ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ముందుగా నేడు అధ్యక్షత వహించారు. మూడో దఫాలో ఇదే తొలి సమావేశం.

ఈ సమావేశంలో ఏడు ముఖ్య ప్రాజెక్టులను సమీక్షించారు. వాటిలో రెండు ప్రాజెక్టులు రోడ్డు అనుసంధానతకు సంబంధించినవి కాగా, రెండు రైలు ప్రాజెక్టులు. వాటితో పాటు బొగ్గు, విద్యుత్, జల వనరుల రంగానికి చెందిన ఒక్కో ప్రాజెక్టు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, గోవా, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ మొదలైన 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టుల వ్యయం రూ.76,500 కోట్లకు పైగా ఉంది.

ప్రాజెక్టుల జాప్యం వల్ల వ్యయం పెరగడమే కాకుండా, ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు లభించడం లేదన్న విషయమై కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని ప్రతి అధికారికి అవగాహన కల్పించాలని ప్రధాని ఉద్ఘాటించారు.

ప్రాజెక్టుల అభివృద్ధిని చేపట్టే సమయంలో పర్యావరణ పరిరక్షణ కోసం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారం దోహదపడుతుందని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్ కు సంబంధించి ప్రజా ఫిర్యాదులపై కూడా ప్రధాని సమీక్షించారు. ఈ ప్రాజెక్టులన్నీ కలిసి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నీటి సమస్యలు, సంబంధిత ఇతర సమస్యలను పరిష్కరిస్తాయి. నీరు మానవుడి ప్రాథమిక అవసరమని; జిల్లా/ రాష్ట్ర స్థాయిల్లో ఫిర్యాదుల పరిష్కారం సక్రమంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి స్పష్టంగా పేర్కొన్నారు. జల్ జీవన్ కార్యక్రమం విజయవంతం కావడంలో ఆ ప్రాజెక్టుల తగిన కార్యశీలత, నిర్వహణ యంత్రాంగం కీలకం. సాధ్యమైనంత వరకు మహిళా స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చేయాలని, నిర్వహణ పనుల్లో యువత నైపుణ్యాన్ని పెంపొందించాలని ప్రధానమంత్రి సూచించారు. జిల్లా స్థాయిలో జలవనరుల సర్వే నిర్వహణను పునరుద్ఘాటించిన ప్రధాని, వనరుల సుస్థిరతకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.

అమృత్ 2.0 కింద జరుగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షించాలని, నగరాల వృద్ధి సామర్థ్యం, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాష్ట్రాల ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ప్రధాని సూచించారు. నగరాలకు మంచినీటి ప్రణాళికలు రూపొందించే సమయంలో పరిసర ప్రాంతాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, మున్ముందు ఈ ప్రాంతాలు కూడా నగర పరిధిలో చేరుతాయని ఆయన అన్నారు. దేశంలో శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా పట్టణ పాలనలో సంస్కరణలు, సమగ్ర పట్టణ ప్రణాళిక, పట్టణ రవాణా ప్రణాళిక, పురపాలక నిధులు కీలక అవసరాలు. నగరాల్లో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన వంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణీకరణ, తాగునీరు వంటి అనేక అంశాలపై ప్రధాన కార్యదర్శుల సదస్సులో చర్చించామని, ఇచ్చిన హామీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులే సమీక్షించుకోవాలని ప్రధాని గుర్తుచేశారు.

 

****


(Release ID: 2049608) Visitor Counter : 74