వ్యవసాయ మంత్రిత్వ శాఖ
చిలీ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్తేవాన్ వలెంజులా, ఆయన ప్రతినిధివర్గంతో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్ సమావేశం
ప్రస్తుతం అమలులో ఉన్న ఎంఓయూ పరిధిలో శానిటరీ, ఫైటో శానిటరీ సమస్యల పరిష్కారానికి భారత్ కట్టుబడి ఉంది: శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్ పునరుద్ఘాటన
Posted On:
27 AUG 2024 7:48PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్ నేడు న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశంలో చిలీ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్తేవాన్ వలెంజులాతోను, ఆయన ప్రతినిధివర్గంతోను సమావేశమయ్యారు.
పరస్పర ఆసక్తి గల అంశాలతో పాటు వ్యవసాయ సహకారంపై ప్రస్తుతం అమలులో ఉన్న ఎంఓయూలు, ఉద్యానవన కార్యాచరణ ప్రణాళిక, ఫైటో శానిటరీ సర్టిఫికెట్ల ఇ-సర్టిఫికేషన్ వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వ్యవసాయ రంగంలో భారత, చిలీ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఉభయ దేశాల మధ్య వ్యవసాయ వాణిజ్యంలో అవకాశాల అన్వేషణపై కూడా చర్చలు జరిగాయి. వ్యవసాయంలో సుస్థిర విధానాల ప్రాధాన్యత ఎంతైనా ఉందని మంత్రులిద్దరూ నొక్కి చెప్పారు. అలాగే ఉభయ దేశాలు వ్యవసాయ రంగంలో సహకార భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేసుకోవాలన్న కట్టుబాటును కూడా వారు ప్రకటించారు.
ఉభయ దేశాల మధ్య వ్యవసాయ వాణిజ్య పరిమాణం పెంచుకునేందుకు దృష్టి సారించాల్సిన పలు అంశాలను కూడా వారు గుర్తించారు. రెండు దేశాల మధ్య ఉమ్మడి వైఖరితో కూడిన అంశాలను మంత్రి శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్ వివరిస్తూ... అత్యున్నత స్థాయి సందర్శనలు, సంప్రదింపులతో ద్వైపాక్షిక సహకారం విశేషంగా బలోపేతం అయిందన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎంఓయుల పరిధిలోనే శానిటరీ, ఫైటో శానిటరీ సమస్యలు పరిష్కరించుకునేందుకు భారత కట్టుబాటును ఆయన పునరుద్ఘాటించారు.
తమకు అద్భుత ఆతిథ్యం ఇచ్చినందుకు శ్రీ ఠాకూర్‌కు చిలీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తమ ఉత్పత్తులకు మార్కెట్ విస్తరణ కల్పించాలన్న భారత ప్రభుత్వ అభ్యర్థనతో పాటు శానిటరీ, ఫైటో శానిటరీ సమస్యల (ఎస్‌పిఎస్) పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను పరిశీలించడానికి అంగీకరించారు. భారత్ కు చెందిన మామిడి, దానిమ్మలకు మార్కెట్ ప్రవేశం కల్పించే అంశం సత్వరం పరిష్కరించనున్నట్టు చిలీ మంత్రి హామీ ఇచ్చారు. అలాగే భారత్ నుంచి అరటి, బాస్మతి బియ్యం దిగుమతి చేసుకునేందుకు చిలీ ఆసక్తిగా ఉందని తెలిపారు. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా గులాబీ, వెల్లుల్లి, చిక్కుడు గింజలు సహా ఇతర ఉత్పత్తుల వాణిజ్య విస్తరణకు గల అవకాశాలు పరిశీలించాలన్న ఠాకూర్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు. ఆక్రోట్లు, పళ్లు, కూరగాయలు సహా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా ప్రస్తుత జాబితాలో చేర్చేందుకు ఉత్సుకత ప్రదర్శించారు.
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు చిలీతో కలిసి కృషి చేసేందుకు ఠాకూర్ అంగీకరించారు. చిలీ మంత్రి, ఆయన ప్రతినిధివర్గం భారత పర్యటన విజయవంతం కావాలని, వారు సంతోషంగా గడపాలంటూ శుభాకాంక్షలు తెలియచేశారు.
చిలీ రాయబారి జాన్ అంగులో, ఒడీఈపీఏ అంతర్జాతీయ వ్యవహారాల శాఖ అధిపతి గాబ్రియెల్ లీసెకా, చిలీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్ విభాగం వృత్తి నిపుణుడు మార్సెలో అల్వారెజ్ చిలీ బృందం తరఫున చర్చల్లో పాల్గొన్నారు.
భారతదేశం వైపు నుంచి వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ (ఇన్‌చార్జి) శ్రీ అజిత్ కుమార్ సాహు, జాయింట్ సెక్రటరీ (పిపి) శ్రీ ముక్తానంద్ అగర్వాల్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
****
(Release ID: 2049274)
Visitor Counter : 61