వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సింగపూర్ లో రెండో ఇండియా-సింగపూర్ మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచే వ్యూహాలను అన్వేషించనున్న వాణిజ్య మంత్రి
Posted On:
25 AUG 2024 9:28AM by PIB Hyderabad
రెండో ఇండియా- సింగపూర్ మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం (ఐఎస్ఎంఆర్) ఆగస్టు 26న సింగపూర్ లో జరగనుంది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్; విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రమణియన్ జైశంకర్; రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ తో కలిసి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రెండో ఐఎస్ఎంఆర్ లో పాల్గొంటారు. ఈ పర్యటనలో మంత్రులు తమ సింగపూర్ సహచరులు, నేతలతో సంభాషించనున్నారు.
ఆగష్టు 25న, డీబీఎస్ బ్యాంక్, టెమాసెక్ హోల్డింగ్స్, ఒమెర్స్, కెప్పెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓనర్స్ ఫోరం సహా సింగపూర్ లోని అంతర్జాతీయ వాణిజ్య ప్రముఖులతో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సమావేశమవుతారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు ఊతమివ్వడం, భారత్ లో పెరుగుతున్న మార్కెట్ అవకాశాలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి దృష్టిపెట్టనున్నారు.
భారత్-సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త ఎజెండా నిర్దేశించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రాంగం ఐఎస్ఎంఆర్. దీని ప్రారంభ సమావేశం 2022 సెప్టెంబరులో న్యూఢిల్లీలో జరిగింది. తమ వ్యూహాత్మక భాగస్వామ్య వివిధ అంశాలపై సమీక్షించడానికి, దానిని మరింత విస్తరించేలా కొత్త మార్గాలను గుర్తించడానికి ఇరు పక్షాలకు ఈ రెండో సమావేశం వీలు కల్పిస్తుంది.
భారత దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సింగపూర్ ప్రధాన వనరు. 2023-24 సంవత్సరంలో 11.77 బిలియన్ డాలర్ల పెట్టుబడి అంచనాతో సింగపూర్ భారతదేశానికి అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా ఆధారంగా నిలిచింది. 2000 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు సింగపూర్ నుంచి వచ్చిన సంచిత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 159.94 బిలియన్ డాలర్లు. ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో 2023-24లో మొత్తం 35.61 బిలియన్ డాలర్ల వాణిజ్యంతో సింగపూర్ భారతదేశానికి ఆరో అతిపెద్ద అంతర్జాతీయ వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇది ఆసియాన్ తో భారత మొత్తం వాణిజ్యంలో దాదాపు 29%.
***
(Release ID: 2048975)
Visitor Counter : 47