జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం, ముడిసరుకు సరఫరా పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ


చేనేత కార్మికుల ముద్ర రుణ పథకం, రాయితీ రుణ పథకం, మార్జిన్ మనీ ద్వారా చేనేతకారులకు, చేనేత సంస్థలకు సాయం



భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు చేనేత ఎగుమతుల ప్రోత్సాహక మండలి అంతర్జాతీయ ప్రదర్శనల ఏర్పాటు


పర్యావరణంపై ఎలాంటి వ్యతిరేక ప్రభావం చూపని కొత్త ‘ఇండియా చేనేత బ్రాండ్‌.’

Posted On: 20 AUG 2024 3:25PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం దేశంలోని చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టింది. చేనేత రంగానికి సంపూర్ణ మద్దతునిచ్చేందుకు, చేనేత కార్మికుల సంక్షేమానికి కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా, జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం, ముడిసరుకు సరఫరా పథకాన్ని అమలు చేస్తున్నది.
 

జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం కింద, అర్హులైన చేనేత సంస్థలు, చేనేత కార్మికులకు, చేనేత మగ్గాలు, ఇతర ఉపకరణాల స్థాయిపెంపు, సౌర విద్యుత్‌ యూనిట్ల ఏర్పాటు, వర్క్ షెడ్ల నిర్మాణం, చేనేత ఉత్పత్తుల డిజైన్‌, అభివృద్ధి, సాంకేతికత, సాధారణ మౌలిక సదుపాయాలు, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌ వంటి వాటికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది.
 

చేనేత కార్మికుల ముద్ర రుణ పథకం, రుణ సహాయ పథకం, వ్యక్తిగతంగా చేనేత కార్మికులకు, చేనేత సంస్థలకు మార్జిన్‌ మనీ రూపంలో సహాయం అందిస్తారు. అలాగే రుణాలపై మూడు సంవత్సరాల వరకు రుణ హామీ ఫీజును మినహాయిస్తారు.
జీవిత బీమా, ప్రమాద బీమా ద్వారా చేనేత కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టారు. చేనేత కార్మికుల పిల్లల ఉన్నత విద్యకు స్కాలర్‌షిప్‌లు ఏర్పాటు చేశారు. అవార్డు పొందిన, 60 సంవత్సరాలు పైబడి, ఏ రాబడి లేని  చేనేత కారులకు ఆర్ధిక సహాయాన్ని అందించేందుకు మార్గదర్శకాలు ఉన్నాయి.

ముడిసరుకు సరఫరా పథకం కింద, చేనేత మంత్రిత్వశాఖ, లబ్ధిదారుల ఇంటి వద్దకు నూలు రవాణా చేసేందుకు రవాణా సబ్సిడీని అందిస్తుంది. అలాగే  నూలు కండెలు, దేశీయ సిల్క్, ఉన్ని, నార కండెలు, మిశ్రమ నార, సహజ నారలకు సంబంధించి వాటి ధరపై 15 శాతం సబ్సిడీ ఇస్తారు. 

ఎగుమతి ప్రోత్సాహక చేనేత ఉత్పత్తుల విషయంలో, చేనేత ఎగుమతి ప్రోత్సాహక మండలి, భారతీయ చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత తెచ్చేందుకు అంతర్జాతీయ మార్కెటింగ్ ప్రదర్శనలు, ఈవెంట్లలో పాల్గొంటున్నది.

 

2015 ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, ఇండియా చేనేత బ్రాండ్ (ఇండియా హాండ్లూమ్ బ్రాండ్)ను ప్రారంభించారు. పర్యావరణంపై ఎలాంటి వ్యతిరేక ప్రభావం చూపని, ఎలాంటి లోపాలు లేని , అత్యంత నాణ్యత గల చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ ప్రతిష్ఠ కల్పించేందుకు దీనిని ప్రారంభించారు. ఇండియా హాండ్లూమ్ బ్రాండ్ ను ప్రారంభించినప్పటి నుంచి, 184 ఉత్పత్తి కేటగిరీలలో 1998 రిజిస్ట్రేషన్లు జారీ అయ్యాయి.

 కోవిడ్ ‌‌19 మహమ్మారి సమయంలో చేనేత కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించేందుకు , ప్రభుత్వం దేశవ్యాప్తంగా కింది చర్యలు చేపట్టింది.

భారత ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు, ఇండియాను స్వావలంబిత దేశంగా తీర్చిదిద్దేందుకు, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించింది. వివిధ రంగాల వ్యాపారాలను పునరుద్ధరించేందుకు సహాయం, రుణ సదుపాయానికి సంబంధించిన చర్యలను ప్రభుత్వం ప్రకటించింది. వీటిని అర్హులైన నేత పనివారికి,చేనేత సంస్థలకు అందేలా చర్యలు తీసుకుంది.

చేనేత పనివారివద్ద ఉన్న చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసేలా తమ తమ పరిధిలోని రాష్ట్ర చేనేత కార్పొరేషన్లు, సహకార సంఘాలు, ఏజెన్సీలను కోరాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రభుత్వం కోరింది.

ఉత్పాదకతను, మార్కెటింగ్ సామర్ధ్యాలను పెంచేందుకు, మెరుగైన రాబడి వచ్చేలా చేసేందుకు  దేశంలో 151 చేనేత ఉత్పాదక కంపెనీలను (పిసిలను) ఏర్పాటు చేయడం జరిగింది.

 

చేనేత రంగంలోని వారిని  ప్రభుత్వ ఈ మార్కెట్ తో అనుసంధానం చేశారు. దీనివల్ల వారు తమ ఉత్పత్తులను నేరుగా వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు విక్రయించడానికి వీలు కలుగుతుంది. ఇందుకు సంబంధించి జనరల్ ఫైనాన్షియల్ రూల్ (జి.ఎఫ్.ఆర్) 2017లోని రూల్ 153కు ఒక సవరణను ప్రతిపాదించారు. ఈ సవరణ ప్రకారం,  కేంద్ర ప్రభుత్వ విభాగాలకు అవసరమైన అన్ని టెక్స్ టైల్ ఉత్పత్తులలో 20 శాతం చేనేత కు చెందిన వాటిని కొనుగోలు చేయాలి. వీటిని కెవిఐసిలు, చేనేత క్లస్టర్లు, సహకార సంఘాలు, స్వయం సహాయక బృంద సమాఖ్యలు, సంయుక్త బాధ్యతా బృందాలు (జె.ఎల్.జి) , ప్రొడ్యూసర్ కంపెనీలు (పిసి), కార్పొరేషన్లు, పెహచాన్ కార్డులు గల నేతన్నలనుంచి కొనుగోలు చేయవలసి ఉంటుంది.

చేనేత ఉత్పత్తులను బి2బి కొనుగోలు దారుల కోసం, అలాగే, చేనేత కార్మికులు ఎగుమతులు చేసుకునేందుకు వీలుగా చేనేత ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి వర్చువల్ ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. 2020–21 వ సంవత్సరంలో ఇలాంటి 10 వర్చువల్ ప్రదర్శనలు జరిగాయి. అలాగే 211 దేశీయ మార్కెటింగ్ ఈవెంట్లు కూడా 2021–22లో దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగాయి. చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి వీలుగా వీటిని నిర్వహించారు.

 

***


(Release ID: 2048547) Visitor Counter : 42