జాతీయ మానవ హక్కుల కమిషన్
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలోని ఒక ప్రైవేట్ పారిశ్రామిక యూనిట్‌లో జరిగిన పేలుడు సంఘటనను సుమోటోగా విచారణ చేపట్టిన ఎన్‌హెచ్‌ఆర్‌సి
పేలుడు ఘటనలో పలువురు కార్మికుల మరణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ కీ నోటీసుల జారీ
భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం ఉంటే చెప్పాలని, రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఎఫ్ఐఆర్ స్థితిగతులను అడిగిన ఎన్‌హెచ్‌ఆర్‌సి; అలాగే గాయపడిన వారి ఆరోగ్యం, వైద్య చికిత్స అందిస్తున్న తీరు, మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రుల కుటుంబాలకు పరిహారం పంపిణీ వివరాల గురించి ఆరా
Posted On:
23 AUG 2024 1:52PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి వద్ద ఆగస్ట్ 21న ఒక ప్రైవేట్ పారిశ్రామిక యూనిట్‌లో జరిగిన రియాక్టర్ పేలుడులో కనీసం 17 మంది కార్మికులు మరణించారని, మరో 50 మంది గాయపడ్డారని మీడియాలో వచ్చిన వార్తలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) సుమోటోగా స్వీకరించింది. పేలుడు వెనుక కారణాలు ఇప్పటికీ స్పష్టంగా లేవు. పేలుడు తర్వాత ఎవరైనా ప్రాణాలతో శిథిలాల నుండి బయటపడ్డారా అని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన సంస్థ బృందాలు వెతుకుతున్నట్లు సమాచారం. అయితే మృతదేహాలు ఇంకా శిధిలాల మధ్య ఉండవచ్చనే ఆందోళన ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పేలుడు జరిగిన సమయంలో ఎంత మంది కార్మికులు విధుల్లో ఉన్నారనే దానిపై స్పష్టత లేదు.
సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా బాధితుల జీవించే హక్కు ఉల్లంఘన జరిగినట్టు మీడియా వార్తలు సూచిస్తున్నాయని కమిషన్ గమనించింది. దీని ప్రకారం, పారిశ్రామిక యూనిట్ యజమాని అన్ని భద్రతా నిబంధనలు, చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నారా అనేది తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. సంబంధిత అధికారులు తనిఖీలు చేస్తున్నదీ లేనిదీ చెప్పాలని, సమగ్ర దర్యాప్తును చేపట్టి, రెండు వారాల్లో పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆదేశించింది.
ఇందులో ఎఫ్‌ఐఆర్ పరిస్థితి, గాయపడిన వారి ఆరోగ్యం, అందుతున్న వైద్య చికిత్స, నష్టపరిహారం పంపిణీ, గాయపడిన వారితో పాటు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు అందించిన ఏదైనా ఇతర ఉపశమనం/పునరావాసంపై తాజా సమాచార నివేదికలో చేర్చాలని సూచించింది. దుర్ఘటనకు బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యల గురించి కూడా తెలియజేయాలని కమిషన్ ఆదేశించింది.
(Release ID: 2048324)
Visitor Counter : 80