భారత ఎన్నికల సంఘం
జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీల సాధారణ ఎన్నికలు: జనరల్, పోలీస్, వ్యయ పరిశీలకులతో ఎలక్షన్ కమిషన్ భేటీ
సకాలంలో చర్యలు తీసుకునేందుకు తప్పుడు కథనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పరిశీలకులకు సూచించిన కమిషన్
సత్వర ఫిర్యాదుల పరిష్కారానికి పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లకు పరిశీలకులు అందుబాటులో ఉండాలి
జమ్మూకాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు 400 మంది పరిశీలకులను నియమించనున్న ఈసీఐ
Posted On:
22 AUG 2024 4:10PM by PIB Hyderabad
జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీలకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఆయా రాష్ట్రాల్లో నియమితులవుతున్న పరిశీలకులతో సమావేశం(బ్రీఫింగ్ మీటింగ్) నిర్వహించింది. సీఈసీ రాజీవ్ కుమార్, ఈసీలు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్ సంధు ఆయా నియోజకవర్గాల్లో సంబంధిత పరిశీలకులు పోషించాల్సిన ముఖ్యమైన పాత్రను వివరించారు.
ఢిల్లీలోని రంగ్ భవన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇతర కేంద్ర సర్వీసులకు చెందిన 400 మందికి పైగా సీనియర్ అధికారులు హాజరయ్యారు. జమ్మూకాశ్మీర్, హర్యానాలో 200 మంది సాధారణ పరిశీలకులు, 100 మంది పోలీస్ పరిశీలకులు, 100 మంది వ్యయ పరిశీలకులను నియమించనున్నారు.
ఎన్నికల సంఘం ప్రతినిధులుగా- పరిశీలకులు వృత్తిపరంగా వ్యవహరించాలని.. అభ్యర్థులు, ప్రజలతో సహా భాగస్వాములందరికీ అందుబాటులో ఉండాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. భాషాపరమైన అడ్డంకులను అధిగమించాలని, సమాచార వినిమయంలో అంతరాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లతోపాటు, ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పరిశీలకులు కూడా ఉంటారని, ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటంలో వారి సూచనలు కీలకం అవుతాయని పేర్కొన్నారు. సకాలంలో చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎన్నికల ప్రక్రియను పక్కదారి పట్టించే తప్పుడు కథనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పరిశీలకులకు సూచించారు.
స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల కోసం పరిశీలకులు పూర్తి ఎన్నికల వాతావరణాన్ని పరిశీలించాలని ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ హోరాహోరీ అన్నట్లు జరుగుతున్నాయని, ఈ ఎన్నికల్లో పరిశీలకుల పాత్ర మరింత కీలకమని ఆయన అన్నారు.
కమిషన్ కు కళ్లు, చెవులు అన్న పాత్రను పరిశీలకుల పోషించనున్న దృష్ట్యా మూడు అంశాలను ఈసీ డాక్టర్ సంధు నొక్కి చెప్పారు. ఎన్నికల నిర్వహణను మెరుగుపరిచేందుకు అందుబాటులో ఉండటం (యాక్సెసెబిలిటీ), అందరికీ తెలియటం(విజిబిలిటీ), స్పందించటం (రెస్పాన్సివ్ నెస్) చాలా అవసరమని పేర్కొన్నారు. ఎన్నికలు పకడ్బందీగా జరగడానికి ఈ ప్రక్రియ అవసరమని చెప్పారు.
కమిషన్ తీసుకొచ్చిన వివిధ నూతన కార్యక్రమాలు, మార్గదర్శకాలను వివరించారు.
1. సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు అన్ని పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లకు అందుబాటులో ఉండాలి. ఈ విషయంలో ఏవైనా ఫిర్యాదులు వస్తే కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుంది.
2. మొబైల్, ల్యాండ్ లైన్ నంబర్లు, ఈ-మెయిల్స్, బస చేసే ప్రదేశాలు మొదలైన వివరాలను సీఈఓ లేదా జిల్లా వెబ్ సైట్లలో, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆయా నియోజకవర్గాలకు పరిశీలకులు వచ్చిన రోజున డీఈవోలు, ఆర్వోలు అభ్యర్థులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఈ విషయాలను అందించాలి.
3. డీఈవోలు, ఆర్వోలు నిర్వహించే రాజకీయ పార్టీల సమావేశాలను పరిశీలించి, వారి సమస్యలను సక్రమంగా విని చర్యలు తీసుకునేలా పరిశీలకులు చూడాలి.
4. క్షేత్రస్థాయిలో కమిషన్ కళ్లు, చెవులుగా పరిశీలకులు అత్యంత చిత్తశుద్ధితో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఒక మార్గదర్శకత్వం వహించే వ్యక్తిగా, పరిశీలకులు ప్రతి సూచన, ప్రక్రియను స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
5. ఎన్నికల యంత్రాంగం, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఓటర్ల మధ్య పనిచేస్తున్నందున పరిశీలకులు క్షేత్రస్థాయి నుంచి కమిషన్‌కు నేరుగా సమాచారాన్ని అందిస్తారు.
6. ఎన్నికలకు సంబంధించిన చట్టాలు, నియమాలు, విధివిధానాలు, సూచనలు, మార్గదర్శకాలను సంబంధిత వారంతా కచ్చితంగా, నిష్పక్షపాతంగా పాటించేలా చూడాలని పరిశీలకులను ఆదేశించారు.
7. వికలాంగులు, వృద్ధ ఓటర్లకు ఎన్నికలను సౌకర్యవంతంగా ఉండేలా చూసుకునేందుకు పోలింగ్ కేంద్రాలను పరిశీలకులు సందర్శించి ఏఎంఎఫ్ స్పెషాలిటీ ర్యాంపులు, వీల్ చైర్ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.
రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై ఈసీఐ సీనియర్ డిప్యూటీ కమిషనర్, డీఈసీలు, డీజీలు అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రణాళిక.. పరిశీలకుల పాత్ర, బాధ్యతలు.. ఓటర్ల జాబితా సమస్యలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, చట్టపరమైన నిబంధనలు, ఈవీఎం/వీవీప్యాట్ నిర్వహణ, మీడియా నిర్వహణ, కమిషన్ ప్రతిష్ఠాత్మక స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం కింద ఓటరు సౌలభ్యం కోసం చేపట్టిన విస్తృత కార్యకలాపాలపై వివరణాత్మక ప్రజెంటేషన్లు ఇచ్చారు.
ఓటర్ల సౌకర్యార్థం కమిషన్ చేపట్టిన వివిధ ఐటీ కార్యక్రమాలు, మొబైల్ యాప్‌లతో పాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియలను సమర్థవంతంగా, ప్రభావవంతంగా నిర్వహించడంపై పరిశీలకులకు అవగాహన కల్పించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరును పరిశీలకులకు ప్రత్యక్షంగా వివరించారు. ఈవీఎంలను పూర్తిగా సురక్షితంగా, దృఢంగా, విశ్వసనీయంగా, ట్యాంపరింగ్ రహితంగా మార్చేందుకు వీలుగా ఈవీఎం వ్యవస్థలో ఉన్న బహుళ సాంకేతిక భద్రతా ఫీచర్లు, అధికారిక నిబంధనలు, విధానపరమైన రక్షణల గురించి వారికి తెలియజేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి, వాటికి సంబంధించిన ఆందోళనల విషయంలో అన్ని అంశాలపై నవీకరించిన, సమగ్రమైన మాన్యువల్స్, హ్యాండ్ బుక్‌లు, సూచనల సంకలనాలు..చేయవలసినవి, చేయకూడని పనులను పరిశీలించాలని తెలియజేశారు. ఏవైనా సూచనలు, మార్గదర్శకాలను సులభంగా తెలుసుకునేందుకు.. ఇవి ఈ-బుక్, శోధించదగిన (సెర్చేబుల్) ఫార్మాట్లో ఈసీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
నేపథ్యం
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 20బీ, రాజ్యాంగ సర్వసత్త అధికారాల కింద కమిషన్ పరిశీలకులను నియమిస్తుంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఎన్నికల ప్రక్రియను, పారదర్శక, నిష్పాక్షికంగా, విశ్వసనీయంగా జరిగేలా చూసే కీలక బాధ్యతను పరిశీలకులకు నెరవేర్చనున్నారు. కమిషన్ తన సాధారణ, పోలీస్, వ్యయ పరిశీలకులపై ఎంతో విశ్వాసం ఉంచుతుంది. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలు జరిగేలా కమిషన్ చూసుకోవటంలో పరిశీలకుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ కేంద్ర పరిశీలకులు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక, సమ్మిళిత ఎన్నికలను నిర్వహించాలనే రాజ్యాంగ బాధ్యతను కమిషన్ నెరవేర్చడంలో సహాయపడటమే కాకుండా.. ఓటరు అవగాహన, ఎన్నికల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి కూడా సహాయం అందిస్తారు. మెరుగుపరుచుకోవాల్సిన అంశాలను గుర్తించి..ఖచ్చితమైన, కార్యచరణకు సంబంధించిన సిఫార్సులను రూపొందించటం ఎన్నికల పరిశీలన ప్రధాన లక్ష్యం. ఈ పరిశీలకులు కమిషన్‌కు కళ్లు, చెవులుగా పేరు పొందారు.
****
(Release ID: 2047962)
Visitor Counter : 47