ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

భార‌త‌దేశ ఎదుగుద‌ల‌ ప్ర‌పంచ స్థిరత్వానికీ, శాంతికీ ఉపయోగపడుతుందన్న ఉప రాష్ట్ర‌ప‌తి


దక్షిణాది ప్ర‌పంచ పురోగ‌తిని భార‌త స‌మ్మిళిత బ‌హుపాక్షిక‌త ముందుకు న‌డిపిస్తోంద‌ని పున‌రుద్ఘాట‌న‌

మాన‌వాళికి అతిపెద్ద ముప్పు అయిన వాతావ‌ర‌ణ మార్పుపై పోరాటంలో అన్ని దేశాలు స‌మ‌ష్టిగా దృష్టి సారించ‌డం ముఖ్యం: ఉప రాష్ట్ర‌ప‌తి

2023లో భార‌త్ అధ్య‌క్ష‌తన జీ20లో ఆఫ్రిక‌న్‌ యూనియ‌న్‌కు శాశ్వ‌త స‌భ్య‌త్వం క‌ల్పించడం కీల‌క‌ భౌగోళిక రాజ‌కీయ ప‌రిణామం

ద‌క్షిణాదిన ప‌ర‌స్ప‌ర‌ స‌హ‌కారానికి పున‌రుజ్జీవ ఆఫ్రికా, ఉద‌యిస్తున్న భార‌త్ బ‌ల‌మైన ప్రేర‌ణ‌ను ఇవ్వ‌గ‌ల‌వ‌న్న ఉప రాష్ట్ర‌ప‌తి ధ‌న్‌ఖడ్‌

విస్త‌ర‌ణ భార‌తీయ విలువ‌లకు విరుద్ధం - ధ‌న్‌క‌డ్‌

19వ సీఐఐ భార‌త్‌ - ఆఫ్రికా వ్యాపార స‌ద‌స్సులో ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ్‌దీప్ ధ‌న్‌క‌డ్ ప్రారంభోప‌న్యాసం

Posted On: 21 AUG 2024 2:10PM by PIB Hyderabad

ద‌క్షిణాది ప్ర‌పంచ పురోగ‌తిని ముందుకు తీసుకెళ్ల‌డంలో భార‌త‌దేశ స‌మ్మిళిత‌, బ‌హుపాక్షిక విధానం ఆవ‌శ్య‌క‌త‌ను ఉప రాష్ట్ర‌ప‌తి శ్రీ జ‌గ్‌దీప్ ధ‌న్‌క‌డ్ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. “శ‌క్తివంత‌మైన ప్ర‌జాస్వామ్యం, మాన‌వాళిలో ఆరో వంతుకు నివాస‌మైన భార‌త‌దేశ ఎదుగుద‌ల- ప్ర‌పంచ స్థిర‌త్వం, శాంతికి సూచికగా ఉంటుంది” అని ఆయ‌న చెప్పారు.

"ఒకే భవిష్యత్తు నిర్మాణం" అనే ఇతివృత్తంతో జ‌రుగుతున్న 19వ సీఐఐ భార‌త్‌-ఆఫ్రికా వ్యాపార స‌ద‌స్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ప్రసంగించారు. అంద‌రి సంక్షేమం కోసం ఉమ్మడి భవిష్యత్తును సృష్టించేందుకు క‌లిసిక‌ట్టుగా ప్రయత్నాలు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న  చెప్పారు. ఈ ప్రయత్నాల్లో ప్రజల భాగ‌స్వామ్యం కీల‌క‌మని అన్నారు. “ఒకే భవిష్యత్తును సృష్టించ‌డం మాన‌వాళి సుస్థిర‌త‌కు అత్యంత ముఖ్యమైంది. ఈ స‌వాల్‌ను ఇక ఆల‌స్యం చేయ‌డానికి వీలు లేదు” అని ఆయ‌న పేర్కొన్నారు.

 

వాతావ‌ర‌ణ మార్పును మాన‌వాళికి అతి పెద్ద ముప్పుగా ఉందని, దీనిని టికింగ్ బాంబ్‌గా పేర్కొంటూ, ఈ స‌వాల్‌పై పోరాటానికి అన్ని దేశాలు స‌మ‌ష్టిగా ప్రయత్నించాలని కోరారు. ఇందుకు గానూ ప్రజల భాగ‌స్వామ్యం, స‌హ‌జ వ‌న‌రుల వినియోగాన్ని త‌గ్గించుకోవాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న నొక్కి చెప్తూ, “మనం నివ‌సించేందుకు వేరే  గ్రహమేదీ లేదు” అని అప్రమత్తం చేశారు.

“ఒకే త‌ర‌హా చరిత్రలు, ఉమ్మడి పోరాటాలు, న్యాయ‌మైన‌, ప్రగతిశీల భవిష్యత్తు కోసం పరస్పర ఆకాంక్షలతో భార‌త, ఆఫ్రికాల మ‌ధ్య లోతైన సంబంధాలు ఏర్పడ్డాయని ఆయ‌న అన్నారు. ఆర్థిక‌, సామాజిక‌, ప‌ర్యావ‌ర‌ణ‌, భద్రత, దౌత్య‌, త‌దిత‌ర అంశాల్లో భాగ‌స్వామ్యంలోని వివిధ కోణాల‌ను శ్రీ ధ‌న్‌క‌డ్ వివ‌రించారు. “ద‌క్షిణాదిన పరస్పర స‌హ‌కారానికి, ముఖ్యంగా స్వేచ్ఛ, సాంకేతిక‌త‌, వాతావ‌ర‌ణ ఆటుపోట్లను త‌ట్టుకునే వ్యవసాయం, స‌ముద్ర భద్రత, ర‌వాణ‌, బ్లూ ఎకాన‌మీ వంటి అంశాల‌కు పున‌రుజ్జీవ ఆఫ్రికా, ఉద‌యిస్తున్న భార‌త్ బ‌ల‌మైన ప్రేర‌ణ ఇవ్వగలవని అని” ఆయ‌న పేర్కొన్నారు.

భార‌త‌దేశం అధ్యక్షతన 2023లో జీ20లో ఆఫ్రికన్ యూనియ‌న్‌కు శాశ్వత సభ్యత్వం క‌ల్పించ‌డం గురించి ఆయ‌న వివరిస్తూ, “ఇది గర్వపడాల్సిన అంశ‌మ‌ని, కీల‌క‌మైన భౌగోళిక రాజ‌కీయ పరిణామం” అని పేర్కొన్నారు. అంత‌ర్జాతీయ సౌర కూట‌మి, ప్రపంచ జీవఇంధ‌న కూట‌మి, విప‌త్తుల‌ను ఎదుర్కొనే దృఢ‌మైన మౌలిక స‌దుపాయాల కోసం ఏర్పడిన సంకీర్ణంలో ఆఫ్రికా దేశాల భాగ‌స్వామ్యాన్ని ఉప రాష్ట్రపతి అభినందించారు. “ఐక్యరాజ్య సమితిలో ఆఫ్రికా వాణినిని అందించేందుకు ఆఫ్రిక‌న్ యూనియ‌న్ చేసుకున్న ‘ఎజుల్‌విని ఏకాభిప్రాయం’, ‘సిర్టె ప్రకటన’లకు పూర్తిగా మద్దతు ఇస్తాం” అని ఆయ‌న పేర్కొన్నారు.

దేశంలో జీవ‌ వైవిద్యాన్ని పునఃసృష్టించ‌డానికి చిరుతల‌ను అందించి సాయ‌ప‌డిన ఆఫ్రికాకు భార‌త్ త‌ర‌పున కృతజ్ఞతలు తెలియ‌జేస్తూ, “ఈ ప‌రిణామం దేశంలో ఉత్సాహం నింపింది. భార‌త్‌, ఆఫ్రికా మ‌ధ్య భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరిచింది” అని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ బిగ్ క్యాట్ అలయెన్స్ లో చేరాల‌ని ఆయ‌న ఆఫ్రికా దేశాల‌ను ఆహ్వానించారు.

భార‌త‌దేశం చరిత్రపరంగా విస్తరణను విశ్వసించలేదని ఉప రాష్ట్రప‌తి పేర్కొన్నారు. భాగ‌స్వామ్యాల‌ను నిర్మించ‌డంలో, బ‌లోపేతం చేయ‌డంలో భార‌త‌దేశ భాగ‌స్వామ్య విధానాన్ని ఆయ‌న ప్రధానంగా ప్రస్తావించారు. “పెద్ద ఎత్తున డిజిట‌లీక‌ర‌ణ‌, సాంకేతిక‌త పురోగ‌తితో పరస్పర స‌హ‌కారం కోసం భార‌త్ అనేక దారుల‌ను అందిస్తోంది. ఉమ్మడి ప్రయోజనాలు-  విజ‌యం కోసం అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంది” అని ఆయ‌న అన్నారు.

 

బురుండి ఉపాధ్యక్షుడు శ్రీ ప్రాస్ప‌ ర్ బ‌జోంబ‌న్జ‌, గాంబియా ఉపాధ్య‌క్షుడు శ్రీ మ‌హ‌మ్మద్ బి.ఎస్‌. జ‌ల్లో, లైబీరియా ఉపాధ్యక్షుడు శ్రీ జెరెమ‌య‌హ్ క్పాన్ కౌంగ్‌, మారిష‌స్ ఉపాధ్యక్షుడు శ్రీ మారీ సిరిల్ ఎడ్డి బ‌యిస్సెజ‌న్‌, జింబాబ్వే ఉపాధ్యక్షుడు డాక్టర్ సి.జి.డి.ఎన్‌. చివెంగ‌, సీఐఐ అధ్యక్షుడు, ఐటీసీ లిమిటెడ్  చైర్మన్మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజీవ్ పురి, సీఐఐ ఆఫ్రికా క‌మిటీ, టాటా ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్‌ ఛైర్మన్ శ్రీ నోయెల్ టాటా, సీఐఐ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ శ్రీ చంద్రజిత్ బెన‌ర్జీ, త‌దిత‌ర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***



(Release ID: 2047877) Visitor Counter : 16