సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
పీఎంఈజీపీ యూనిట్ల ధృవీకరణ కోసం కేవీఐసీ, తపాలా శాఖ మధ్య అవగాహన ఒప్పందం
దిల్లీ రాజ్ ఘాట్‌లోని కేవీఐసీ కార్యాలయంలో సంతకాలు చేసిన ఇరు శాఖల అధికారులు
ప్రధాన మంత్రి విజన్‌కు అనుగుణంగా కేవీఐసీ 'ప్రభుత్వం నుంచి ప్రభుత్వం' అనే పని సంస్కృతిని ప్రోత్సహిస్తోంది: మనోజ్ కుమార్, కేవీఐసీ ఛైర్మన్
Posted On:
21 AUG 2024 4:12PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెబుతున్నట్లు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాకారం చేయడానికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) మంగళవారం దిల్లీ రాజ్ ఘాట్ కార్యాలయంలో కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన తపాలా శాఖతో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న తపాలా శాఖ ఉద్యోగులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న కొత్త యూనిట్ల ధ్రువీకరణ (ఫిజికల్ వెరిఫికేషన్) చేయనున్నారు. దీనిపై తపాలా ఉద్యోగులకు కేవీఐసీ శిక్షణ ఇవ్వనుంది.
తపాలా శాఖ తరఫున డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ అమన్ ప్రీత్ సింగ్, కేవీఐసీ తరఫున పీఎంఈజీపీ డిప్యూటీ సీఈవో రాజన్ బాబు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి కేవీఐసీ చైర్మన్ మనోజ్ కుమార్, ఎంఎస్ఎంఈ సంయుక్త కార్యదర్శి విపుల్ గోయల్, కేవీఐసీ సీఈవో వాత్సల్య సక్సేనా, తపాలా విభాగం జనరల్ మేనేజర్ మనీషా బన్సాల్ బాదల్ హాజరయ్యారు. ఈ ఒప్పందం ద్వారా కేవీఐసీ దేశవ్యాప్తంగా ఉన్న 1,65,000 తపాలా కార్యాలయాల ఉద్యోగుల సేవలను పొందనుంది. వీరిలో 139,067 మంది గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేస్తున్నారు.
ఈ సందర్భంగా కేవీఐసీ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత ప్రకారం రెండు ప్రభుత్వ శాఖల మధ్య సహకార పని సంస్కృతిని పెంపొందించడానికి తపాలా శాఖతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఒప్పందం ద్వారా దేశవ్యాప్తంగా తపాలా శాఖకు 150 ఏళ్ల నుంచి ఉన్న సమాచార వ్యవస్థ ప్రయోజనాన్ని కేవీఐసీ పొందనుంది. దీని ద్వారా పీఎంఈజీపీ యూనిట్ల ధ్రువీకరణతో పాటు మార్జిన్ మనీ రాయితీని అందించటం కూడా వేగవంతం కానుంది. పీఎంఈజీపీ దేశవ్యాప్తంగా ఔత్సాహికులను ప్రోత్సహించిందని, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించిందని కేవీఐసీ చైర్మన్ తెలిపారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 9.69 లక్షలకు పైగా కొత్త ప్రాజెక్టులకు సహాయం అందించింది. తద్వారా 84.64 లక్షల మందికి పైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉపాధి కల్పించింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ. 69021.29 కోట్ల రుణానికి గాను రూ.25563.44 కోట్ల మార్జిన్ మనీ రాయితీని పంపిణీ చేశారు. గత ఆర్థిక సంవత్సరం 2023-24లోనే పీఎంఈజీపీ 9.80 లక్షల మందికి పైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉపాధి కల్పించి రూ. 3093 కోట్లకు పైగా మార్జిన్ మనీ రాయితీని అందించింది.
బాపుజీ వారసత్వమైన ఖాదీ.. గత పదేళ్లలో అభివృద్ధి చెందిన భారత్‌కు గ్యారంటీగా మారిందని కేవీఐసీ చైర్మన్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో, స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఆదాయం లక్షా 55 వేల కోట్లు దాటింది. ప్రధాన మంత్రి బ్రాండ్ సామర్థ్యం వల్ల గత పదేళ్లలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల అమ్మకాలు అయిదు రెట్లు, ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగాయి. ఈ రంగం తొలిసారిగా 10.17 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించింది. ఈ కార్యక్రమంలో తపాలా శాఖ, కేవీఐసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
***
(Release ID: 2047532)
Visitor Counter : 111