వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యుత్ వాహ‌న ప‌రీక్ష కేంద్రానికి శంకుస్థాప‌న చేయ‌నున్న కేంద్ర ఆహార, వినియోగ‌దారుల శాఖ మంత్రి


విద్యుత్ వాహ‌న ప‌రీక్ష కేంద్రానికి విద్యుత్ వాహ‌నాల త‌యారీ పరిశ్రమకు కీల‌క మద్దతు

Posted On: 21 AUG 2024 1:43PM by PIB Hyderabad

నేష‌న‌ల్ టెస్ట్ హౌస్ (ఎన్ టి హెచ్‌) ఆర్ ఆర్ ఎస్ ఎల్ క్యాంప్‌ లో- విద్యుత్ వాహ‌న ప‌రీక్ష కేంద్రానికి కేంద్ర వినియోగ‌దారుల‌శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ వెంక‌టేష్ జోషి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఆగ‌స్ట్ 22, 2024న బెంగ‌ళూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

 

ద‌క్షిణ భార‌త‌దేశంలో విస్తరించేందుకు, ఈవీ బ్యాట‌రీ, చార్జర్ ప‌రీక్ష మొద‌లైన అంశాల్లో ప‌రీక్ష స‌దుపాయాల‌ను ప్రారంభించ‌డానికి క‌ర్నాట‌క రాష్ట్రం బెంగ‌ళూరులోని  ఆర్ ఆర్ ఎస్ ఎల్ జక్కూరు క్యాంప‌స్ లో ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నూత‌న ఈవీ ప‌రీక్షా స‌దుపాయం విద్యుత్ వాహానాల వ్యవస్థను బ‌లోపేతం చేస్తుంది. ఈవీ పరిశ్రమకు కీల‌క మద్దతును ఇస్తుంది. ఆటోమోటివ్ సాంకేతిక‌త రంగంలో ప‌ర్యావ‌ర‌ణ సుస్థిర‌త‌ను, ఆవిష్కరణల్ని సాధించాల‌నే విస్తృత ల‌క్ష్యాల కోసం కృషి చేస్తుంది. 

 

ప‌లు ర‌కాల పరీక్షలను నిర్వహించే సామ‌ర్థ్యం గ‌ల అత్యాధునిక ఈవీ బ్యాట‌రీ పరీక్షా ప‌రిక‌రాల‌తో ప్రయోగశాలను తీర్చిదిద్దుతున్నారు. విద్యుత్ భద్రత, ఇఎంసీ /  ఇఎంఎఫ్, ఎఫ్ సిసి /  ఐఎస్ ఇ డి, నిర్వహణ భద్రత, మ‌న్నిక ( జీవిత చ‌క్రం), వాతావ‌ర‌ణం (ఐపీ ప‌రీక్ష‌, యూవీ, రేడియేష‌న్ కొరోజ‌న్‌), యంత్రపరమైన, వ‌స్తుప‌ర‌మైన పరీక్షలు ( ఫ్లేమ‌బిలిటీ, గ్లో వైర్‌) మొద‌లైనవి ఈ ప్రయోగాలు ఉంటాయి. ఇది ద‌క్షిణ భార‌త‌దేశ ఈవీ తయారీదారుల‌కు మంచి వ‌రంలాంటి స‌దుపాయం. ఇది విద్యుత్ వాహ‌నాల‌ పరిశ్రమ అభివృద్ధికి దోహ‌దం చేస్తుంది. అత్యాధునిక ఈవీ ప‌రీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డం- విద్యుత్ వాహ‌నాల కోసం భార‌త‌దేశంలో క‌ల్పిస్తున్న‌ మౌలిక స‌దుపాయాల ఏర్పాటులో కీలకమైన అడుగు. అంతే కాదు ఇది సుస్థిర‌మైన‌, హ‌రిత ఇంధ‌న ప‌రిష్కారాల‌ను సాధించాల‌నే దేశ నిబద్ధతకు అనుగుణంగా జ‌రుగుతున్న కృషిని తెలియ‌జేస్తోంది. విద్యుత్ వాహ‌నాల‌కు సంబంధించిన వివిధ ప‌రీక్షల కోసం సమగ్రమైన కేంద్రంగా ఈ స‌దుపాయం సేవ‌లందిస్తుంది. బ్యాట‌రీ సామ‌ర్థ్యం, భద్రతా ప్రమాణాలు, సామ‌ర్థ్య కొల‌మానాలతో స‌హా వివిధ పరీక్షలు ఇందులో ఉంటాయి. తద్వారా ఆయా విద్యుత్ వాహ‌నాల‌లు వాటి వినియోగ‌దారుల‌ను చేరుకోక‌ముందే క‌ఠిన‌మైన నాణ్యతా ప్రమాణాలను క‌లిగి ఉంటాయి.

 

నేష‌న‌ల్ టెస్ట్ హౌస్ అనేది కేంద్ర ప్రభుత్వ వినియోగ‌దారుల వ్యవహారాల శాఖ కింద ప‌ని చేస్తున్న ప్రధాన శాస్త్రీయ‌ సంస్థ‌. ఇది  వివిధ రంగాల్లో పరీక్షలను, నాణ్యత భ‌రోసా కోసం ప‌ని చేస్తూ ఈ రంగంలో ప్రసిద్ధి చెందిన‌ సంస్థ‌. జ‌ల‌జీవ‌న్ కార్యక్రమం, బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌, మెట్రో ప్రాజెక్టులు, ఎరువుల పరీక్షలు, విద్యుత్ ప్రాజెక్టులు మొద‌లైనటు వంటి వివిధ‌ ప్రతిష్ఠాత్మకమైన జాతీయ ప్రాజెక్టుల టెస్టింగ్ అండ్ క్యుఏ ఏజెన్సీగా ప‌ని చేస్తున్న సంస్థ‌. భార‌త‌దేశంలో డ్రోన్ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను అందిస్తున్న ఏకైక ప్రభుత్వ సంస్థ కూడా ఇదే. ఈ సంస్థ‌ దేశ‌వ్యాప్తంగా కోల్‌క‌తా, ముంబాయి, చెన్నై, ఘ‌జియాబాద్‌, గౌహ‌తి, జైపూర్, వార‌ణాసిల‌లో అత్యాధునిక ప‌రీక్ష ప్రయోగశాలల్ని క‌లిగి ఉంది.  

 

బెంగ‌ళూరులోని ఆర్ ఆర్ ఎస్ ఎల్ అనేది లీగ‌ల్ మెట్రాల‌జీ (బ‌ర‌వులు, కొల‌త‌లు) సంస్థకు చెందిన రీజ‌న‌ల్ రెఫ‌రెన్స్ స్టాండ‌ర్డ్స్ ల్యాబ‌రేట‌రీ. ఇది  బ‌రువులు కొల‌త‌ల ప‌రిక‌రాన్ని ప‌రీక్షించ‌డానికి, కాలిబ్రేష‌న్ చేయ‌డానికి ప‌ని చేస్తున్న సంస్థ‌. ఈ కార్యక్రమం సంద‌ర్భంగా  డిస్పెన్సింగ్ యూనిట్ ( పెట్రోల పంప్‌) త‌యారీదారుల్లో ఒక‌రైన మెస్సర్స్ త‌త్సునో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ముంబాయి వారికి ప్రపంచ‌వ్యాప్తంగా ఆమోదం పొందిన ఓఐఎంఎల్ ఆమోదిత ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని అందిస్తారు.

***


(Release ID: 2047531) Visitor Counter : 59