ఆయుష్
azadi ka amrit mahotsav

నిరంతర వైద్య విద్యా కార్యక్రమంతో యోగాలో విద్య, చికిత్సాపరమైన సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్న ఎమ్‌డిఎన్ఐవై

Posted On: 20 AUG 2024 2:12PM by PIB Hyderabad

మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎండిఎన్ఐవై) తన ప్రాంగణంలో 2024 ఆగస్టు 19 నుండి 24 వరకు ఆయుష్ ఉపాధ్యాయులు, వైద్యులు, శాస్త్రవేత్తల కోసం ఆరు రోజుల నిరంతర వైద్య విద్య కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. యోగాలోని తాత్విక, శాస్త్రీయ, ఆచరణాత్మక అంశాలలో విద్య, చికిత్సాపరమైన నైపుణ్యాలను మెరుగుపరచడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆరు రోజుల కార్యక్రమం ద్వారా కార్యక్రమంలో పాల్గొనే వారి- చికిత్సాపరమైన పరిజ్ఞానాన్ని తిరిగి పెంచుకోవడం, మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

ఈ సందర్భంగా ఎండిఎన్ఐవై డైరెక్టర్ డాక్టర్ కాశీనాథ్ సమగండి మాట్లాడుతూ, నిరంతర వైద్య విద్యా కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. "ఆయుష్ మంత్రిత్వ శాఖ సమర్పణలో, రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రామాణిక వైద్య విధానాలలో యోగాను చేర్చడానికి ఆయుష్ వైద్యుల సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం కృషి జరుగుతోందన్నారు. "ప్రత్యేకించి ఎవిడెన్స్ ఆధారిత జ్ఞానంతో ఆయుష్ వైద్యుల రోజువారీ సాధనలో యోగాను భాగం చేయడం కోసం నిరంతర వైద్య విద్య (సీఎంఈ) కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డాక్టర్ సమగండి తెలిపారు.

 

ప్రారంభ సమావేశంలో, సెంటర్ ఫర్ బయోమెడికల్ ఇంజినీరింగ్ (సీబీఎంఈ) విజిటింగ్ ప్రొఫెసర్ డాక్టర్ కె.కె. దీపక్ ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను వివరిస్తూ.. "యోగా, దాని అనుబంధ శాస్త్రాలలో నైపుణ్యాన్ని మెరుగుపరిచే" ఒక వేదికగా అభివర్ణించారు. "సరైన పరిశోధనా పద్ధతులు లేకుండా, మానవ జీవితంపై యోగ ప్రభావాన్ని రుజువు చేయలేం" అని ఆయన పేర్కొన్నారు. అల్లోపతి శాస్త్రాలలోని పరిశోధనా పద్ధతుల ప్రామాణీకరణను, ఆయుర్‌జ్ఞాన్ పథకం వంటి కార్యక్రమాల ద్వారా యోగ శాస్త్రాల పరిశోధన పద్ధతులను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న ఆయుష్ ప్రయత్నాలతో పోల్చారు. యోగా సాధన సమర్థమైనదనీ, సురక్షితమైనదనీ, శాస్త్రీయంగా ధ్రువీకరించే నిష్పాక్షికమైన సమాచార నిధిని అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశంగా ఉందని తెలిపారు.

 

ఈ కార్యక్రమం తాజా పరిశోధన పరిజ్ఞానంతో పాటు సంప్రదాయిక యోగ సూత్రాలను కలిపి అందిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న యోగ పరిశోధనా రంగ ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రాప్ యోగా, మాడ్యులేటెడ్ యోగా ఫామ్స్, ప్రాక్టికల్ డెమోన్‌స్ట్రేషన్‌లు, డైట్ అండ్ యోగా, అలాగే ఆయుర్వేదం, యోగా ఏకీకరణ సహా అనేక రకాల అంశాలను సీఎంఈ కార్యక్రమంలో పొందుపరిచారు. ఈ అవకాశం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 30 మందికి అందిస్తున్నారు"

యోగా గురించిన పుస్తక జ్ఞానం, ఆరోగ్యం కోసం యోగాభ్యాసాలు, చికిత్సలో యోగ అనువర్తనాలు, యోగాలో తాజా శాస్త్రీయ పరిశోధనల పోకడలు, ఆధునిక బోధనా పద్ధతులు సహా పలు కీలకమైన అంశాలపై వక్తలు తమ పరిజ్ఞానాన్ని పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి యోగాలోని కీలకమైన అంశాలను గురించి అవగాహనను పెంపొందించడం, సాంప్రదాయిక, సమకాలీన శాస్త్రీయ విధానాలలో వారి జ్ఞానాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

 

***



(Release ID: 2047110) Visitor Counter : 50