బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీఎస్ఆర్ ద్వారా సామాజిక సాధికారత: ఆరోగ్య రక్షణలో గణనీయమైన విజయాలు

Posted On: 19 AUG 2024 4:06PM by PIB Hyderabad

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి క్రియాశీల నాయకత్వంలోని బొగ్గు మంత్రిత్వ శాఖ తన పరిధిలోని సీపీఎస్ఈల కార్యకలాపాల్లో సామాజిక బాధ్యతను ఒక ప్రధాన అంశంగా చేస్తోంది. ఈ సమష్టి కృషి... దేశ సామాజిక-ఆర్థికాభివృద్ధికి దోహదం చేయడమే కాకుండా, బాధ్యతాయుతమైన కార్పొరేట్ పౌరులుగా బొగ్గు సీపీఎస్ఈల నిబద్ధతను ప్రతిఫలిస్తోంది.

కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్), దాని అనుబంధ సంస్థలు, ఎన్ఎల్ సీఐఎల్ సామాజిక సంక్షేమానికి గణనీయంగా తోడ్పడుతున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల కింద ఏటా రూ.800 కోట్లను ఖర్చు చేస్తున్నాయి.  ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, సమగ్ర సామాజిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతూ, ప్రజా సంక్షేమం కేంద్రబిందువుగా బొగ్గు సీపీఎస్ఈలు ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. కేటాయించిన  నిధుల స్థాయి బొగ్గు సీపీఎస్ఈల అంకితభావాన్ని సూచిస్తోంది.

ఆరోగ్య రంగ విజయాలు:

1. సీఐఎల్ చేపట్టిన తలసేమియా బాల సేవా యోజన (టీబీఎస్ వై):

సీఐఎల్ ప్రతిష్ఠాత్మక ఆరోగ్య కార్యక్రమం తలసేమియా బాల సేవా యోజన. 500 ఎముక మజ్జ మార్పిడులను (బీఎంటీ) విజయవంతంగా పూర్తి చేసి కీలక మైలురాయిని చేరుకుంది. ఈ కార్యక్రమం కింద తలసేమియా మేజర్,  ఏప్లాస్టిక్ ఎనీమియా కోసం ఒక్కో రోగికి రూ .10 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.  దేశవ్యాప్తంగా 356 మంది నిరుపేద పిల్లలు ప్రయోజనం పొందారు. 2017లో ప్రారంభమైన ఈ పథకం వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది. రూ.70 కోట్ల పెట్టుబడితో టీబీఎస్ వై ‘ది గ్రీన్ ఎన్విరాన్ మెంట్ అవార్డు’తో గుర్తింపు పొందింది. ఆన్ లైన్ పోర్టల్ ద్వారానూ, వ్యక్తిగతంగా సంప్రదించడం ద్వారా ఆర్ధిక సాయాన్ని పొందవచ్చు.

 2. ఎన్ఎల్ సీఐఎల్ ఆధ్వర్యంలో కడలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలిసిస్ కేంద్రం:

కడలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు ద్వారా, ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తేవడంలో ఎన్ఎల్ సీఐఎల్ కీలకపాత్ర పోషించింది. ఈ కార్యక్రమం ద్వారా ఏటా 13,000 పర్యాయాలు డయాలసిస్ చికిత్సను అందిస్తారు. ఇది ఈ ప్రాంతంలోని రోగులకు విలువైన ఆరోగ్య సేవల్ని అందిస్తోంది.

3. మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు

కరోనా వ్యాప్తి చెందిన సమయంలో చికిత్స కోసం కీలకమైన ఆక్సిజన్ ఆవశ్యకతకు తగినట్టుగా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తంగా 2,500 పడకల సామర్థ్యంతో 28 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఎన్ఎల్ సీఐఎల్, దాని అనుబంధ సంస్థలు ఏర్పాటు చేశాయి. ఈ చర్య దేశ ఆరోగ్య రక్షణ మౌలిక సదుపాయాలను గణనీయంగా బలోపేతం చేసింది.

4. నన్హా సా దిల్ ప్రాజెక్టు:

పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల పరిష్కారం కోసం కోల్ ఇండియా లిమిటెడ్ ‘నాన్హా సా దిల్’ ప్రాజెక్టును ప్రారంభించింది. జార్ఖండ్ లో గ్రామ, జిల్లా శిబిరాల ద్వారా దాదాపు 18,000 మంది పిల్లల్లో ఈ తరహా సమస్య ఉన్నదీ లేనిదీ తెలుసుకునేందుకు వారికి పరీక్షా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. 500 మంది పిల్లలకు శస్త్రచికిత్స లేదా మూత్రనాళ ఆధారిత చికిత్సలను అందించడం, పిల్లల గుండె సంరక్షణ విషయమై.. 50 మందికి పైగా యువ నిపుణులకు శిక్షణ ఇవ్వడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. రూ.9.37 కోట్లతో ఈ ప్రాజెక్టును తొలుత నాలుగు జిల్లాల్లో ప్రారంభించనున్నారు. భవిష్యత్తులో విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

సీఎస్ఆర్ లో భాగంగా ఇతర వైద్య ఆరోగ్య కార్యక్రమాలు:

- ప్రేమాశ్రాలయ నిర్మాణం: కలకత్తాలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న ఔట్ పేషెంట్ల కోసం వసతి ఏర్పాటు.

- మొబైల్ ఆరోగ్య రక్షణ సేవలు: మొబైల్ యూనిట్ల ద్వారా నిరుపేదలకు ఆరోగ్య సేవలు అందించడం.

- కోవిడ్-19 సమయంలో చేయూత: సంరక్షణ కేంద్రాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, మరమ్మతులు, వైద్య పరికరాల కొనుగోలు కోసం నిధులు.

- క్యాన్సర్ చికిత్సకు చేయూత: రాంచీ క్యాన్సర్ హాస్పిటల్- పరిశోధన కేంద్రంలో సామాజిక-ఆర్థిక చేయూతను మెరుగుపరిచారు. క్యాన్సర్ గుర్తింపు, చికిత్సల కోసం టాటా క్యాన్సర్ కేర్ తో కలిసి పని చేస్తున్నారు.

ఈ ప్రభావవంతమైన సీఎస్ఆర్ కార్యక్రమాలు ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడంలో బొగ్గు సీపీఎస్ఈల నిబద్ధతను స్పష్టంచేస్తున్నాయి. ఆ చర్యలు దేశవ్యాప్తంగా జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయి.  

***


(Release ID: 2046846) Visitor Counter : 53