ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతీయ ఆహారంలో మైక్రోప్లాస్టిక్ కాలుష్య పరిష్కారానికి ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు విధానాల రూపకల్పన, భారతీయ ఆహారంలో మైక్రోప్లాస్టిక్ ప్రాబల్యాన్ని అంచనా వేయడం ఎఫ్ఎస్ఎస్ఏఐ లక్ష్యం
Posted On:
18 AUG 2024 1:51PM by PIB Hyderabad
ఆహారంలో పెరుగుతున్న మైక్రోప్లాస్టిక్ కాలుష్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆగస్టు 18న న్యూఢిల్లీలో ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మైక్రోప్లాస్టిక్ కాలుష్యం ముంచుకొస్తున్న ముప్పుగా పరిణమిస్తోందని, దీనిపై తక్షణం దృష్టిసారించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. “సూక్ష్మ, నానో-ప్లాస్టిక్ పదార్థాలు కొత్త ఆహార కలుషితాలు: ధృవీకరించే పద్ధతులను రూపొందించడం, వివిధ ఆహార మిశ్రమాల్లో ప్రాబల్యాన్ని అర్థం చేసుకోవడం” – ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇది ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైంది. వివిధ ఆహార ఉత్పత్తులలో సూక్ష్మ, నానో-ప్లాస్టిక్‌లను గుర్తించడానికి తగు విశ్లేషణాత్మక పద్ధతులు ప్రామాణీకరించడానికీ, అభివృద్ధి చేయడానికీ ఉద్దేశించినది.
సూక్ష/నానో-ప్లాస్టిక్ కాలుష్య విశ్లేషణ కోసం ప్రామాణిక పద్ధతులను అభివృద్ధి చేయడం ప్రాజెక్ట్ ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటి. ఇంట్రా, ఇంటర్-లాబొరేటరీ తారతమ్యాలను గుర్తించడం, మైక్రోప్లాస్టిక్ కాలుష్య ప్రభావం వినియోగదారులపై ఏ మేరకు ఉందన్న కీలక సమాచారాన్ని సేకరిస్తారు. సిఎస్ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ (లక్నో), ఐసిఏఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (కొచ్చి), బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (పిలానీ) సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పరిశోధనా సంస్థల సహకారంతో ఈ అధ్యయనం జరుగుతోంది.
ఇటీవల ఓ నివేదికలో చక్కెర, ఉప్పు వంటి సాధారణ ఆహార పదార్థాలలో మైక్రోప్లాస్టిక్‌ల ఉనికిని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రముఖంగా ప్రస్తావించింది. మైక్రోప్లాస్టిక్‌ల ప్రపంచవ్యాప్త ప్రాబల్యాన్ని నివేదిక నొక్కిచెప్పినప్పటికీ, ముఖ్యంగా భారతీయ సందర్భంలో మానవ ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన చిక్కులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత సమాచారం అవసరమని స్పష్టం చేసింది.
ఆహార భద్రత నియంత్రిత సంస్థగా, ఎఫ్ఎస్ఎస్ఏఐ భారతీయ వినియోగదారులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందుబాటులో ఉండేలా చూసేందుకు కట్టుబడి ఉంది. ప్రపంచ అధ్యయనాలు వివిధ ఆహారాలలో మైక్రోప్లాస్టిక్‌ల ఉనికిని ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ, భారతదేశానికి సంబంధించిన విశ్వసనీయ, విస్తృత సమాచారాన్ని రూపొందించడం అత్యవసరం. ఈ ప్రాజెక్ట్ భారతీయ ఆహారంలో మైక్రోప్లాస్టిక్ కాలుష్య పరిధిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి సమర్థవంతమైన నిబంధనలు, భద్రతా ప్రమాణాలను రూపొందించడానికి మార్గనిర్దేశం చేస్తుంది.
ఈ ప్రాజెక్ట్ ఫలితాల ఆధారంగా నియంత్రణ చర్యలను తీసుకోవడమే కాకుండా, మైక్రోప్లాస్టిక్ కాలుష్యంపై ప్రపంచ అవగాహనకు అవకాశం లభిస్తుంది. ఈ పర్యావరణ సవాలును ఎదుర్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా జరిగే ప్రయత్నంలో భారతీయ పరిశోధన ఒక అంతర్భాగం.
***
(Release ID: 2046548)
Visitor Counter : 95