జల శక్తి మంత్రిత్వ శాఖ

దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జల్ జీవన్ మిషన్ విజయాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 15 AUG 2024 2:55PM by PIB Hyderabad

   భారత 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీ లో చరిత్రాత్మక ఎర్ర కోట బురుజుల మీది నుంచి ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది లబ్ధిదారులకు సురక్షిత తాగునీరు అందించడంలో జల్ జీవన్ మిషన్ ప్రశంసనీయ విజయం సాధించిందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

   దేశంలోని గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీరందించే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జల్ జీవన్ మిషన్’తో వచ్చిన పరివర్తనాత్మక మార్పు గురించి ప్రధానమంత్రి  నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు పల్లె ప్రాంతాలలో 3 కోట్ల కుటుంబాలకు మాత్రమే కొళాయి నీటి సౌకర్యం అందుబాటులో ఉండేదని ఆయన గుర్తుచేశారు. అయితే, గడచిన ఐదేళ్లలో అదనంగా 12 కోట్ల కుటుంబాలకు ‘నల్ సే జల్’ (కొళాయి ద్వారా నీరు)ను విస్తరించడం ద్వారా గణనీయ పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద నేడు సుమారు 15 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనాన్ని పొందుతున్నారని తెలిపారు.

   స్వచ్ఛమైన తాగునీటిని వాడుకునే వారి సంఖ్యను పెంచడంలో ఈ మిషన్ సఫలమైందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో జీవన నాణ్యత ఎంతో మెరుగుపడి, దేశ సమగ్రాభివృద్ధికి తోడ్పాటు లభిస్తున్నదని పేర్కొన్నారు.

****



(Release ID: 2045767) Visitor Counter : 25