పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
78వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక అతిథులైన పంచాయతీ ప్రతినిధులను సత్కరించిన కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్
భారత ప్రగతి ప్రస్థానంలో పంచాయతీ ప్రతినిధుల పాత్రను కొనియాడిన మంత్రి;
మీ పనితీరు ప్రాతిపదికగా మీకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోండి: శ్రీ రాజీవ్ రంజన్
Posted On:
15 AUG 2024 1:19PM by PIB Hyderabad
దేశంలోని గ్రామీణ ప్రాంతాల ముందంజతోపాటు సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్‌డిజి) సాధనలో పంచాయతి రాజ్/స్థానిక సంస్థల, మహిళా ప్రతినిధులు నేతృత్వం వహించాలని కేంద్ర పంచాయతిరాజ్, మత్స్య-పశుసంవర్థక-పాడి పరిశ్రమ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ పిలుపునిచ్చారు. భారత 78వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో న్యూఢిల్లీలోని జన్‌పథ్‌లో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి ఈ పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికైన మహిళా ప్రతినిధులు (ఇడబ్ల్యుఆర్ఎస్)లు, ఎన్నికైన ప్రతినిధులను (ఇఆర్) గౌరవించడం కోసం వారిని ప్రత్యేక ప్రతినిధులుగా ఆహ్వానించి 2024 ఆగస్టు 14న వారిని సత్కరించారు. కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ సహా కేంద్ర పంచాయతిరాజ్, మత్స్య-పశుసంవర్థక-పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి,సింగ్ బాఘెల్, పంచాయతి రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్ కూడా ఇందులో పాల్గొన్నారు.
సాధికారత స్ఫూర్తి, సముచిత గుర్తింపునకు నిదర్శనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా తమతమ పంచాయతీల పరిధిలో ప్రజల అభ్యున్నతికి, శ్రేయస్సుకు పాటుపడుతూ విశేష కృషి చేసిన పంచాయతి రాజ్ సంస్థల మహిళా ప్రతినిధులను కూడా సత్కరించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా సుమారు 400 మంది ఎన్నికైన ప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై సత్కారం అందుకున్నారు. భారత ప్రగతి ప్రస్థానంలో వీరంతా కీలక సేవలు అందిస్తున్నారంటూ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఈ మేరకు ప్రధానోపన్యాసం చేస్తూ- మహిళలు తమ అంతర్గత శక్తి సామర్ధ్యాలను గుర్తించడంలోగల ప్రత్యేకతను శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ నొక్కిచెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసేవలను, పాలనను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడంలో సాంకేతిక పురోగమనాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా గ్రామ్ స్వరాజ్-భాషిణిల సమ్మేళనాన్ని అందిపుచ్చుకోవాలని మహిళా నేతలకు పిలుపునిచ్చారు.
‘‘మీ పనితీరు ప్రాతిపదికగా మీదంటూ ఒక గుర్తింపు తెచ్చుకోండి’’ అని మంత్రి వారికి సూచించారు. కార్యాచరణ, ప్రభావశీలతే నిజమైన నాయకత్వానికి నిదర్శనాలని పేర్కొన్నారు. ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలకు పంచాయతీ రాజ్ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకున్న దార్శనిక నిర్ణయాన్ని శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ కొనియాడారు. ‘వికసిత భారత్’ లక్ష్య సాధనలో పంచాయతీల కీలక పాత్రను మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. పంచాయతి రాజ్ సంస్థల నాయకులకు సాధికారత లక్ష్యంగా పాలన-సాంకేతిక పరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నారు. అందుకే కేంద్ర పంచాయతిరాజ్ మంత్రిత్వశాఖ విశిష్ట శిక్షణ, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిందని ప్రశంసించారు. ‘‘పంచాయతిరాజ్ మంత్రిత్వశాఖ నిబద్ధత వల్ల పంచాయతి రాజ్ సంస్థల ప్రతినిధులు ‘ఐఐఎం’ల వంటి ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలలో శిక్షణ పొందే అవకాశం లభించింది’’ అని ఆయన అన్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాభిమానాన్ని మరింతగా చూరగొనడం, విశ్వాసం పొందడంలో భాగంగా నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచుకోవాలని సూచించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ- ప్రజాస్వామ్యానికి బలమైన మూలస్తంభాలుగా పంచాయతీ రాజ్ సంస్థలు తమనుతాము నిరూపించుకోవాలని శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ పిలుపునిచ్చారు. ‘‘పంచాయతీ సంస్థల ఉనికిని రాజ్యాంగం గుర్తించింది... అవి రాజ్యాంగ విభాగాలు. వాటికి గుర్తింపు రావడమన్నది వాటి పనితీరుపై ఆధారపడి ఉంటుంది’’ అన్నారు. దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించిన వారి అసాధారణ కృషికి గుర్తింపుగానే ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్టు గుర్తుచేశారు.
పంచాయతిరాజ్ ప్రతినిధులకు ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బాఘెల్ స్వాగతం పలికి, అభినందనలు తెలిపారు. ఎన్నికైన పదవి ద్వారా వ్యక్తులకు దేశసేవ చేసే అద్భుత అవకాశం కల్పనలో ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రాచీన ప్రజాస్వామ్యమైన భారత్ గొప్పదనాన్ని ఆయన ఉటంకించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య వేడుకలు తిలకించే వారు అవకాశం పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులుగా తమ పాత్ర ప్రాధాన్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని అంకితభావంతో బాధ్యతలు నిర్వర్తించాలని ఆయన హితవు పలికారు. ‘‘వ్యక్తిగతం, సామాజికంగా, వృత్తిపరంగా జీవితంలో గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోండి’’ అన్నారు. సమష్టితత్వం, సహకారంతో కూడిన ప్రగతి మంత్రాన్ని సూచిస్తూ ప్రొఫెసర్ బాఘెల్ పంచాయతీల ప్రతినిధులను ప్రోత్సహించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి జీవితం, ఆయన నాయకత్వస్ఫూర్తితో దేశ సమగ్రాభివృద్ధికి తమవంతు కృషి చేయాలని ప్రేరణాత్మక సందేశమిచ్చారు.
శ్రీ వివేక్ భరద్వాజ్ కూడా ప్రత్యేక అతిథులకు హృదయపూర్వక స్వాగతం పలికారు. సన్మాన కార్యక్రమ లక్ష్యాలు, స్ఫూర్తికి అనుగుణంగా ప్రారంభోపన్యాసం చేశారు. సమాజంలో సమానత్వం, ప్రగతికి పంచాయత్ సంస్థలలో ఉత్ప్రేరకంగా మహిళ నాయకత్వం కీలక భూమిక పోషిస్తుందని ఆయన అన్నారు. గ్రామీణ భారతంలో మహిళల సారథ్యాన చేపట్టిన పరివర్తనాత్మక కార్యక్రమాలను ఉటంకించారు. ప్రతి ప్రతినిధి సమర్థ నాయకత్వం వహించేలా సామర్థ్య నిర్మాణంపై నిరంతరం దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
డాక్టర్ చంద్రశేఖర్ కుమార్ ప్రసంగిస్తూ- ‘వికసిత భారత్’ సంకల్ప సాకారంలో మహిళా నాయకత్వ పాత్రను నొక్కిచెప్పారు. అందుకు అనుగుణంగా వారికి సాధికారత కల్పించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. తద్వారా పంచాయతీ రాజ్ సంస్థలు బలోపేతమై వాటి పనితీరు మరింత మెరుగుపడగలదని అన్నారు. ‘‘మహిళా నాయకులకు సాధికారత సహా పంచాయతీలలో వారి ప్రభావాన్ని మరింత పెంచే దిశగా ఈ కార్యక్రమం కీలక ముందడుగు’’ అని తెలిపారు. దేశవ్యాప్తంగా పంచాయతీలు అనుసరిస్తున్న మంచి కార్యక్రమాలు, విధానాలకు తగిన మద్దతు, ప్రోత్సాహం ఇస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
కేంద్ర మంత్రులు శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బాఘెల్ చేతుల మీదుగా సత్కారం పొందిన మహిళా నాయకులలో జమ్ముకశ్మీర్‌లోని కత్రా జిల్లా అభివృద్ధి కౌన్సిలర్ శ్రీమతి నిర్మలాదేవి, శ్రీమతి నీరూ యాదవ్, మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కంబల్వాడీ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి అనితా సురేష్ కుశాలే తదితరులున్నారు. కాగా, సురేష్ కుశాలే పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత భారత షూటర్ స్వప్నిల్ కుశాలే తల్లి కావడం గమనార్హం. తమ పంచాయతీలో క్రీడానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో ఆమె కృషి, అంకితభావం అందరికీ స్ఫూర్తి దాయకం.
రాజస్థాన్లోని జున్జునులోని లంబి అహీర్గ్రామ పంచాయతీ సర్పంచ్, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి పైడిపాముల కృష్ణ కుమారి, బీహార్లోని కతిహార్ జిల్లా ఫల్కా బ్లాక్ హత్ వారా గ్రామ పంచాయతీ ముఖియా శ్రీమతి భారతి కుమారి, గుజరాత్లోని డాంగ్స్ జల్లా డాంగ్ జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా బెన్, మేఘాలయలోని తూర్పు ఖాసీ కొండ ప్రాంత జిల్లా ఖతర్ ష్నాంనగ్ లైట్క్రోచ్ సిఅండ్ ఆర్ డి బ్లాక్ లైట్ మాసియాంగ్ వి.ఇ.సి కార్యదర్శి శ్రీమతి ఇదబురోం ఫన్భుహ్, ఉత్తరప్రదేశ్లోని లక్నో జిల్లా మాల్ బ్లాక్ అటారి గ్రామ పంచాయత్ కు చెందిన గ్రామ్ ప్రధాన్ శ్రీమతి సంయోగితా సింగ్ చౌహాన్ తదితరులు కూడా సన్మానం పొందిన వారిలో ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం పొందిన పంచాయతీ నాయకులంతా తమ ప్రజల అభ్యున్నతితోపాటు విస్తృత అంకిత భావంతో దేశసేవలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆహ్వానం పొందినవారే.
ఈ కార్యక్రమం సందర్భంగా బహుళ భాషల ‘ఇ-గ్రామ్ స్వరాజ్’ వేదికను ఆవిష్కరించారు. భాషాపరమైన అడ్డంకులను అధిగమించడానికి దీన్ని భాషిణి సహకారంతో అభివృద్ధి చేశారు. దీంతో ప్రతి పౌరుడూ తమతమ భాషలలో డిజిటల్ సేవలను సులభంగా పొందగలుగుతాడు. ఈ వినూత్న ఆవిష్కరణ తో ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్ దేశంలోని 22 షెడ్యూల్డు భాషలలో అందుబాటులోకి వస్తుంది. తద్వారా వివిధ భాషల ప్రజలకు దీని సేవలు మరింతగా అందుబాటులోకి రావడంతోపాటు వాడకం కూడా పెరుగుతుంది.
ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా పంచాయతీల వివరాలను విడుదల చేశారు. ఇందులో పంచాయత్ రాజ్ సంస్థల సంబంధిత మౌలిక గణాంకాలు, దేశంలో స్థానిక పరిపాలనపై విలువైన సమాచారాన్ని పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖకు చెందిన స్వామిత్వ పథకంపై దృశ్య-శ్రవణ ప్రదర్శన, గ్రామీణ ప్రాంత సుంసంపన్న సాంస్కృతిక శోభపై ‘భారత ఘన వారసత్వం’ శీర్షికన ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, రాబడి పెంపు అంశాలపై అర్థవంతమైన చర్చ దిశగా వీటిని ఏర్పాటు చేశారు.
క్షేత్రస్థాయి పంచాయత్ రాజ్ నాయకుల దేశరాజధాని పర్యటనపై పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. వీరిని ప్రధానమంత్రి సంగ్రహాలయ (పిఎం మ్యూజియం)కు తీసుకువెళ్లి చూపించడం ద్వారా వారికి గొప్ప అనుభూతి కలిగేలా చేశారు. అలాగే ఢిల్లీలో ఎర్రకోటవద్ద స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించడంతోపాటు 2024 ఆగస్టు 15న మధ్యాహ్నం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ చేపట్టిన ఈ కార్యక్రమం పంచాయతీల నాయకులను గౌరవించడమేగాక గ్రామీణ భారతంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబాటును మరింత బలపరచింది. జాతీయ వేడుకలలో పంచాయతీరాజ్ సంస్థలకు భాగస్వామ్యం ద్వారా వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్థానిక సంస్థలలో ఒకరకమైన యాజమాన్య భావనను, బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ప్రోదిచేసింది. ఈ మేరకు 2024 ఆగస్టు 14నాటి ఈ కార్యక్రమం ఐక్యత, సంకల్పం, సార్వజనీనత, సుసంపన్న భారతావనికి ఉమ్మడి దార్శనికతను దృఢంగా ముందుకు తీసుకువెళ్లే సందేశంతో ముగిసింది. అలాగే మహిళా నాయకుల సాధికారత, పంచాయతీ రాజ్ సంస్థల బలోపేతం, భారత ప్రజాస్వామిక, అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చడంలో తమ కృషి కొనసాగుతుందన్న హామీనిస్తూ పంచాయతిరాజ్ మంత్రిత్వశాఖ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించింది.
****
(Release ID: 2045766)
Visitor Counter : 53