ప్రధాన మంత్రి కార్యాలయం
78వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భారత భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మక స్వప్నాన్ని నిర్దేశించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
15 AUG 2024 10:16AM by PIB Hyderabad
భారతదేశ వృద్ధికి రూపం ఇవ్వడం, ఆవిష్కరణలకు దారి చూపడం, వివిధ రంగాల్లో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలనే భవిష్యత్తు లక్ష్యాలను 78వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.
ప్రధానమంత్రి ప్రసంగంలోని కీలకాంశాల్లో కొన్ని:
1. జీవన సౌలభ్యం: అధిక ప్రాధాన్యతతో జీవన సౌలభ్యాన్ని నెరవేర్చాలనే తన స్వప్నాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. క్రమబద్ధమైన మదింపులు, మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపర్చడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను పెంపొందించడంపై ఆయన మాట్లాడారు.
2. నలంద స్ఫూర్తి పునరుద్ధరణ: ప్రాచీన నలంద విశ్వవిద్యాలయ స్ఫూర్తిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యకర అభ్యాసం, పరిశోధనలను ప్రోత్సహించి భారత్‌ను ప్రపంచ విద్యా కేంద్రంగా నిలపాలని అన్నారు. 2024లో నలంద విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవంతో ఈ స్వప్నాన్ని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
3. భారత్‌లో చిప్-సెమీకండక్టర్ ఉత్పత్తి: సెమీకండక్టర్ ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలనే భారతదేశ నిబద్ధతను ప్రధాని మోదీ ప్రకటించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, సాంకేతికంగా స్వయం సమృద్ధిని పెంపొందించాలనేది దీని లక్ష్యం.
4. నైపుణ్య భారత్: భారతీయ యువతకు శిక్షణ ఇచ్చి, దేశాన్ని ప్రపంచంలో నైపుణ్య రాజధానిగా మార్చేందుకు గానూ 2024 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన విప్లవాత్మక కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.
5. పారిశ్రామిక తయారీ కేంద్రం: అపారమైన వనరులు, నైపుణ్యాలు కలిగిన కార్మికశక్తిని సద్వినియోగం చేసుకొని భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలని ప్రధాని మోదీ సంకల్పించారు.
6. "భారత్‌లో డిజైన్, ప్రపంచం కోసం డిజైన్": స్వదేశీ డిజైన్ సామర్థ్యాలను ప్రశంసించిన ప్రధానమంత్రి, దేశీయ, అంతర్జాతీయ విపణులకు అనుగుణంగా వస్తువులను రూపొందించాలని కోరారు. ఈ మేరకు "భారత్‌లో డిజైన్, ప్రపంచం కోసం డిజైన్"అనే వాక్యాన్ని పేర్కొన్నారు.
7. అంతర్జాతీయ గేమింగ్ మార్కెట్‌లో అగ్రగామి: గొప్ప ప్రాచీణ వారసత్వాన్ని, సాహిత్యాన్ని సద్వినియోగం చేసుకొని భారత్‌లో గేమింగ్ ఉత్పత్తులను తయారుచేయాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆడటంలోనే కాకుండా ఆటలను తయారు చేయడంలోనూ భారతీయ నిపుణులు అంతర్జాతీయ గేమింగ్ మార్కెట్‌కు నేతృత్వం వహించాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆటలు ప్రత్యేక ముద్ర వేసుకోవాలని పేర్కొన్నారు.
8. హరిత ఉద్యోగాలు, హరిత ఉదజని కార్యక్రమం: వాతావరణ మార్పుపై పోరాడటంలో భారత్ ప్రయత్నాల కోసం హరిత ఉద్యోగాల ప్రాముఖ్యాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ఇప్పుడు హరిత వృద్ధి, హరిత ఉద్యోగాలపై దేశం దృష్టి సారించిందని చెప్పారు. ఇది ఉద్యోగ అవకాశాలను సృష్టించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. హరిత ఉదజని ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేందుకు, పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సుస్థిరమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
9. స్వస్థ్ భారత్ మిషన్: వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని అందుకునేందుకు భారత్ ‘స్వస్థ్ భారత్’ దిశగా నడవాలని, ఇది రాష్ట్రీయ పోషన్ అభియాన్ ఆవిష్కరణతో ప్రారంభమైందని ప్రధాని పేర్కొన్నారు.
10. రాష్ట్రస్థాయి పెట్టుబడి పోటీ: రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పష్టమైన విధానాలను రూపొందించాలని, సుపరిపాలనకు హామీ ఇవ్వాలని, శాంతిభద్రతల పరిస్థితిపై విశ్వాసాన్ని కల్పించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
11. అంతర్జాతీయ ప్రమాణాలుగా భారతీయ ప్రమాణాలు: నాణ్యత విషయంలో దేశ నిబద్ధతకు గుర్తింపురావాలనే భారత ఆకాంక్షపై ప్రధాని మోదీ మాట్లాడారు. భారతీయ ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలుగా మారాలని ఆకాంక్షించారు.
12. వాతావరణ మార్పు లక్ష్యాలు : 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యాన్ని అందుకోవాలనే భారతదేశ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. జీ20 దేశాల్లో పారిస్ ఒప్పంద లక్ష్యాలను అందుకున్నది కేవలం భారత్ మాత్రమే అనే విషయాన్ని ఆయన పేర్కొన్నారు.
13. వైద్య విద్య విస్తరణ: దేశ వైద్య విద్య సామర్థ్యాన్ని పెంపొందించి, వైద్యసంరక్షణ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు గానూ వచ్చే ఐదేళ్లలో 75,000 కొత్త వైద్య విద్య సీట్లు జత చేయాలనే ప్రణాళికలను ప్రధాని మోదీ ప్రకటించారు.
14. రాజకీయాల్లోకి యువరక్తాన్ని ఎక్కించడం: రాజకీయ వ్యవస్థలోకి లక్ష మంది యువతను తీసుకురావాలని, ప్రత్యేకించి వారి కుటుంబంలో రాజకీయ చరిత్ర లేని వారిని తీసుకురావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బంధుప్రీతి, కులతత్వం వంటి చెడులపై పోరాడటంతో పాటు దేశ రాజకీయాల్లోకి కొత్త రక్తాన్ని ఎక్కించడమే ఈ చొరవ లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 2045633)
Visitor Counter : 141
Read this release in:
Odia
,
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada