రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారతదేశ రక్షణ రంగం ‘ఆత్మనిర్భర్’గా మారుతోంది, ప్రపంచ తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది:


స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

“భారత్ ఇంతకుముందు ఉగ్ర దాడుల బాధిత దేశంగా ఉండేది, నేడు అది బలంగా, ధైర్యంగా నిలబడింది; మనకు హాని కలిగించడానికి ప్రయత్నించే వారికి సాయుధ బలగాలు తగిన సమాధానం ఇస్తాయి”

Posted On: 15 AUG 2024 11:53AM by PIB Hyderabad

గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా భారతదేశం రక్షణలో ‘ఆత్మనిర్భరత’ను సాధిస్తోందని,అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ఎదుగుతోందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగించారు.

ఒకప్పుడు రక్షణ బడ్జెట్‌లో ఎక్కువ భాగం ఆయుధాలు/పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు వినియోగించేవారని, అయితే తమ ప్రభుత్వం దేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు స్వదేశీ తయారీపై దృష్టి సారించిందని ప్రధాని చెప్పారు. అనేక సానుకూల స్వదేశీ జాబితాల నోటిఫికేషన్‌తో సహా పలు నిర్ణయాలను తీసుకున్నందుకు రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాలను ఆయన ప్రశంసించారు, ఇందులో 5,600 కంటే ఎక్కువ వస్తువులు భారతీయ పరిశ్రమల నుంచి మాత్రమే నిర్ణీత వ్యవధిలో ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు పూర్తిగా రక్షణ పరికరాల దిగుమతులపై ఆధారపడిన భారత్ నేడు అనేక దేశాలకు ఎగుమతి చేస్తోందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల కారణంగా, వార్షిక రక్షణ ఉత్పత్తి 2023-24లో రికార్డు స్థాయిలో రూ.1.27 లక్షల కోట్లకు చేరుకుంది. అదే ఆర్థిక సంవత్సరంలో, రక్షణ ఎగుమతులు 2022-23 కంటే 32.5 శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో రూ.21,083 కోట్లకు చేరుకున్నాయి. అదనంగా, 2024-25 మొదటి త్రైమాసికంలో రక్షణ ఎగుమతుల్లో భారీ పెరుగుదల కనిపించింది. మొదటి త్రైమాసికంలో రూ. 6,915 కోట్ల విలువైన రక్షణ పరికరాలు ఎగుమతి అయ్యాయి. ఇది 2023-24 మొదటి త్రైమాసికంలో రూ. 3,885 కోట్లతో పోలిస్తే 78 శాతం పెరిగింది.

2016 సర్జికల్ స్ట్రైక్, 2019 వైమానిక దాడులను ప్రస్తావిస్తూ, దేశం తీవ్రవాద దాడులకు గురైన పరిస్థితి కూడా ఉండేదని గుర్తు చేశారు. కానీ నేడు ధైర్యంగా, బలంగా నిలవగలిగామని, దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించడానికి ప్రయత్నించే ఎవరికైనా సాయుధ దళాలు తగిన సమాధానం ఇస్తున్నాయని శ్రీ మోడీ చెప్పారు. మాతృభూమికి నిస్వార్థంగా సేవలందిస్తున్న వీర సైనికులను చూసి దేశం గర్విస్తోందని ఆయన అన్నారు.

అన్ని రంగాలలో పెరుగుతున్న మహిళల పాత్రపై ప్రధాన మంత్రి మాట్లాడుతూ మహిళలు కేవలం దేశ పురోభివృద్ధిలో పాల్గొనడమే కాకుండా నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని ఉద్ఘాటించారు. "అది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లేదా అంతరిక్ష రంగం ఏదైనా కావచ్చు, మన దేశంలో నారీ శక్తి నిరంతరం అభివృద్ధి చెందుతున్న పరిణామాన్ని మనం చూస్తున్నాము" అని ప్రధానమంత్రి శ్రీ మోదీ అన్నారు.


 

***



(Release ID: 2045626) Visitor Counter : 7