రక్షణ మంత్రిత్వ శాఖ
తొలి విమాన పరీక్ష లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ 'గౌరవ్'ను విజయవంతంగా పరీక్షించిన డిఆర్‌డివో
ఒడిశా తీరంలోని Su-30 MK-I ప్లాట్‌ఫామ్ నుంచి పరీక్ష
Posted On:
13 AUG 2024 8:20PM by PIB Hyderabad
సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాల్ని ఛేదించగలిగే లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ (ఎల్ఆర్‌జిబి) "గౌరవ్" తొలి విమాన పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డివో) విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని భారత వైమానిక దళానికి చెందిన Su-30 MK-I ప్లాట్‌ఫామ్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు.
గౌరవ్ అనేది గాలిలో ప్రయోగించే 1,000 కిలోల శ్రేణి గ్లైడ్ బాంబు, ఇది సుదూర లక్ష్యాలను ఛేదించగలదు. ప్రయోగించిన వెంటనే గ్లైడ్ బాంబ్ ఐఎన్ఎస్, జిపిఎస్ డేటా కలయికతో అత్యంత కచ్చితమైన హైబ్రిడ్ నావిగేషన్ స్కీమ్‌ను ఉపయోగించి లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది. గౌరవ్‌ను రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సిఐ, హైదరాబాద్) దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసింది.
విమాన పరీక్ష సమయంలో, గ్లైడ్ బాంబు లాంగ్ వీలర్స్ ద్వీపం వద్ద నిర్దేశించిన లక్ష్యాన్ని కచ్చితత్వంతో విజయవంతంగా చేధించింది. టెస్ట్ లాంచ్ సమయంలో పూర్తి విమాన డేటాను టెలిమెట్రీ ద్వారా, తీరప్రాంతం వెంబడి గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ల ద్వారా సేకరించారు. విమానాన్ని సీనియర్ డిఆర్‌డివో శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. అదానీ డిఫెన్స్, భారత్ ఫోర్జ్, అభివృద్ధి-ఉత్పత్తి భాగస్వాములు కూడా ఈ విమాన ట్రయల్‌లో పాలుపంచుకున్నారు.
విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో సఫలమైన డిఆర్‌డివో, ఐఎఎఫ్, సంబంధిత పరిశ్రమలను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. సాయుధ బలగాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు స్వదేశీ రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో దేశం చేస్తున్న కృషిలో ఇదొక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఎల్ఆర్‌జిబి విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డిఆర్‌డివో బృందాన్ని రక్షణ శాఖ ఆర్&డి కార్యదర్శి, డిఆర్‌డివో చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ అభినందించారు.
***
(Release ID: 2045164)
Visitor Counter : 143