వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో 12 స్థానాలు మెరుగుపడిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్
2023నాటి 27వ స్థానం నుంచి 2024కల్లా 15వ స్థానం చేరిక;
అంతర్జాతీయ వాణిజ్యంపరంగా భవిష్యత్ అగ్రగాములను
తీర్చిదిద్దడంలో ఐఐఎఫ్‌టి పాత్ర కీలకం: శ్రీ పీయూష్ గోయల్
Posted On:
13 AUG 2024 5:09PM by PIB Hyderabad
కేంద్య విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్‌లో వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టి) ర్యాంకు గణనీయంగా మెరుగుపడింది. ఈ మేరకు 2023నాటి 27వ స్థానం నుంచి ఏడాది వ్యవధిలో (2024) ఏకంగా 12 స్థానాలు మెరుగుపడి 15వ స్థానానికి దూసుకెళ్లింది. ఈ విధంగా 2016లో ‘ఎన్‌ఐఆర్‌ఎఫ్’ ప్రారంభం నుంచి ర్యాంకు సాధన పరంగా ఈ సంస్థ రికార్డు స్థాయిలో మెరుగుదల నమోదు చేసింది.
కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ‘ఐఐఎఫ్‌టి’ అద్భుత పనితీరును అభినందించారు. ఏడాది వ్యవధిలో ఒక్కసారిగా 15వ ర్యాంకుకు చేరడం ద్వారా ఢిల్లీలోని ఈ సంస్థ అద్భుత ప్రగతి సాధించిందని ప్రశంసించారు. ఇదే జోరుతో త్వరలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగి వాణిజ్యం, పెట్టుబడుల రీత్యా భారత్ విశేష వృద్ధికి ఎంతగానో దోహదపడగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్ ప్రభావం ఇనుమడిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యంలో భవిష్యత్ అగ్రగాములను తీర్చిదిద్దడంలో ఐఐఎఫ్‌టి కీలక పాత్రను ఆ సంస్థ విజయం సూచిస్తున్నదని పేర్కొన్నారు.
వాణిజ్య శాఖ కార్యదర్శి, ‘ఐఐఎఫ్‌టి’ చాన్సలర్ శ్రీ సునీల్ బర్త్వాల్ ఈ అద్భుత విజయాన్ని అభినందించారు. ద్వైపాక్షిక, బహుపాక్షిక వాణిజ్య భాగస్వామ్యాలతోపాటు ఎగుమతులకు ప్రోత్సాహం, సంస్థాగత పురోగమనం సహా అంతర్జాతీయ వాణిజ్యంలో సమకాలీన సమస్యలపై అత్యాధునిక పరిశోధనల నిర్వహణలో ఈ సంస్థకు వాణిజ్యశాఖ పూర్తి మద్దతిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ సంస్థ ఇటీవల చేపట్టిన వివిధ చర్యలకు మంచి గుర్తింపు లభించింది. ఈ మేరకు బోధన-అభ్యసనం, వనరులు, పరిశోధన, వృత్తిపరమైన పద్ధతులు, గ్రాడ్యుయేషన్ ఫలితాలు, చేరువ, సార్వజనీనత, భావనలు వంటి ‘ఎన్ఐఆర్ఎఫ్’ నిర్దేశిత పారామితులకు అనుగుణంగా అనేక సమగ్ర కార్యక్రమాలను సంస్థ చేపట్టింది.
అంతర్జాతీయ వాణిజ్యం, వ్యాపారంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఐఐఎఫ్‌టి అంతర్జాతీయ స్థాయి బి-స్కూల్‌గా ప్రపంచ ఖ్యాతినార్జించే దిశగా శరవేగంతో పురోగమిస్తోంది. ఆ మేరకు ‘‘పిహెచ్.డి., ఎంబిఎ (ఇంటర్నేషనల్ బిజినెస్), ఎంబిఎ (బిజినెస్ అనలిటిక్స్), ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఫైనాన్స్, ఎంఎ ఎకనమిక్స్’’ వంటి అత్యున్నత విద్యా కార్యక్రమాలను నిర్వహించే విశిష్ట సంస్థగా ఎదిగింది.
కొత్త కార్యక్రమాల్లో భాగంగా అంతర్జాతీయ సంప్రదింపులలో కార్పొరేట్ సంస్థలకు, విధాన రూపకర్తలకు శిక్షణ కోసం ‘సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ నెగోషియేషన్స్’ (సిఐఎన్) పేరిట అత్యాధునిక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే హార్వర్డ్ తరహాలో ‘ఫారిన్ ట్రేడ్ కేస్ స్టడీ సెంటర్’ (ఎఫ్‌టిసిఎస్‌సి)ను కూడా ‘ఐఐఎఫ్‌టి’ ఏర్పాటు చేస్తోంది. ఎగుమతిదారులు, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలతో సంయుక్త కృషి, అంతర్జాతీయ నిదర్శనాధ్యయనాల రూపకల్పన, అంతర్జాతీయ వాణిజ్యంపై భారత్ అనుభవాలను ఇతర దేశాలతో పంచుకోవడం వంటి కార్యకలాపాలను ఈ కేంద్రం నిర్వహిస్తుంది.
కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహితంగా పనిచేయాలని ‘ఐఐఎఫ్‌టి’ భావిస్తోంది. ఉన్నత స్థాయి సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలతోపాటు సమకాలీన ప్రాముఖ్యంగల అంశాలపై నిశిత దృష్టితో కూడిన పరిశోధనల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో సమకాలీన పరిశోధన ప్రయోజనంగల అంశాలపై ‘పిహెచ్.డి’ విద్యార్థులకు చేయూతనివ్వడానికి ‘అపెడా’ (ఎపిఇడిఎ) వంటి వివిధ ఎగుమతి ప్రోత్సాహక సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మరోవైపు కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని వాణిజ్య విభాగం మద్దతుతో దుబాయ్‌లో విదేశీ ప్రాంగణం ప్రారంభించేందుకు ‘ఐఐఎఫ్‌టి’ యోచిస్తోంది.
****
(Release ID: 2045150)