సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘నషా ముక్త భారత్ అభియాన్’ కింద మ‌త్తు ప‌దార్థాల‌ దుర్వినియోగంపై న్యూఢిల్లీలో దేశ ప్రజలతో ‘‘సామూహిక ప్ర‌తిజ్ఞ’’ చేయించిన కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్


దేశవ్యాప్తంగా 10,000కుపైగా ప్రదేశాల్లో కోటి మందికిపైగా ప్రజల ప్ర‌తిజ్ఞ;

‘ఎన్ఎంబిఎ’ కింద మాదక ద్రవ్య వినియోగం దుష్ప్రభావాలపై 3.55 కోట్లమంది యువత.. 2.35 కోట్ల మంది మహిళలు సహా 11.26 కోట్ల మందికి అవగాహన కల్పించాం: మంత్రి

Posted On: 12 AUG 2024 5:12PM by PIB Hyderabad

   షా ముక్త భారత్ అభియాన్ (ఎన్ఎంబిఎ) కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీ బారాఖంబా రోడ్డులోని మోడర్న్  స్కూలులో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత శాఖ మంత్రి డాక్టర్  వీరేంద్ర కుమార్ దేశ ప్రజలతో ‘‘సామూహిక ప్ర‌తిజ్ఞ’’ చేయించారు. ఆ శాఖ సహాయమంత్రులు శ్రీ రామ్ దాస్ అఠావలే, శ్రీ బి.ఎల్.వర్మ కూడా (వీడియో కాన్ఫరెన్సింగ్  ద్వారా) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పాఠశాలలోని 2,700 మందిదాకా విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. దేశవ్యాప్తంగా 10,000పైగా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, రాష్ర్ట/జిల్లా యంత్రాంగాల ప్రతినిధులు కూడా ‘వర్చువల్’ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తంమీద దేశవ్యాప్తంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పలు ప్రాంతాల ప్రజలు కోటి మందికిపైగా ప్ర‌తిజ్ఞ చేశారు.

   పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతూ మాదక ద్రవ్య వినియోగ దుష్ర్పభావాలపై ప్రజల్లో చైతన్యం కలిగించడం ‘ఎన్ఎంబిఎ’ లక్ష్యం. మాద‌క ద్ర‌వ్యాల‌కు బానిస‌లైన జ‌నాభాను గుర్తించి వారికి చేరువ కావ‌డం, కౌన్సెలింగ్  నిర్వ‌హణ; ఆస్ప‌త్రులు, పున‌రావాస కేంద్రాల్లో  చికిత్స సౌక‌ర్యాల క‌ల్పన; ఈ విభాగంలో సేవ‌లందించే వారికి సామ‌ర్థ్య వికాసం వంటి కార్య‌క్ర‌మాలను ‘ఎన్ఎంబిఎ’ చేప‌డుతుంది. దేశం 78వ స్వాతంత్ర్య దిన వేడుక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో (2020లో ప్రారంభమైన) ‘ఎన్ఎంబిఎ’ ఐదో ఏట ప్ర‌వేశించింది. ఈ మైలురాయి నేపథ్యంలో సామాజిక న్యాయం-సాధికార‌త మంత్రిత్వ శాఖ (డిఒఎస్‌జెఇ) దేశ‌వ్యాప్తంగా ప్ర‌తిజ్ఞ స్వీకార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది.

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 ఆగ‌స్టు 15వ తేదీన ఎర్ర‌కోట బురుజుల నుంచి ప్రసంగిస్తూ-  మాద‌క ద్ర‌వ్య ర‌హిత భార‌త్‌ను నిర్మించాల‌ని పిలుపునివ్వడాన్ని కేంద్ర మంత్రి డాక్ట‌ర్ వీరేంద్ర కుమార్ తన ప్రసంగంలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తమ శాఖ మాద‌క ద్ర‌వ్య వినియోగం అధికంగాగల 272 జిల్లాల‌ను గుర్తించి ‘ఎన్ఎంబిఎ’ ప్ర‌చార కార్యక్రమం చేప‌ట్టింద‌ని చెప్పారు. అటుపైన 2023 ఆగ‌స్టు నుంచి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఉద్య‌మం ప్రారంభించిందని పేర్కొన్నారు.

   ఈ నేపథ్యంలో నేడు ‘ఎన్ఎంబిఎ’ కింద క్షేత్ర‌స్థాయిలో చేప‌ట్టిన వివిధ కార్య‌క‌లాపాల్లో 3.55 కోట్ల మందికిపైగా యువ‌త‌, 2.35 కోట్లమంది మ‌హిళ‌లు స‌హా మొత్తం 11.26 కోట్ల మందికిపైగా ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేసిన‌ట్టు మంత్రి వెల్ల‌డించారు. అంతేగాక 3.40 ల‌క్ష‌ల విద్యా సంస్థ‌లు కూడా ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు కావ‌డంతో ఈ కార్యక్రమ సందేశం బాల‌లతోపాటు యువ‌త‌కు చేరువైందన్నారు.

   మాద‌క ద్ర‌వ్య వ్యసనంపై పోరాటంలో యావత్ స‌మాజం ఏకం కావ‌ల్సిన అవసరాన్ని ఆయ‌న నొక్కిచెప్పారు. ఈ సామాజిక స‌మ‌స్య‌పై యుద్ధంలో స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రు చేయికలపాలని పిలుపునిచ్చారు. ప్ర‌ధానంగా యువ‌త‌ను చైత‌న్య‌పరచాల్సిన అవ‌స‌రం ఉందని, వారిలో ఈ వ్యసనం బారినపడిన వారిని స‌త్వ‌రం గుర్తించి మాద‌క ద్ర‌వ్య వినియోగాన్ని అరిక‌ట్ట‌డం అత్యంత ప్ర‌ధాన‌మ‌ని చెప్పారు. దేశ భ‌విష్య‌త్ నిర్మాత‌లైన విద్యార్థులే మాద‌క ద్ర‌వ్య వ్య‌తిరేక ప్ర‌చారానికి నాయ‌క‌త్వం వ‌హించాల‌ని పిలుపునిచ్చారు. విద్యార్థులు మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఈ ప్ర‌చారాన్ని దేశవ్యాప్తం చేయాల‌ని సూచించారు.

   మాద‌క ద్ర‌వ్య వినియోగాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వం ఉద్య‌మ స్ఫూర్తితో ప‌ని చేస్తున్న‌ద‌ని ‘డిఒఎస్‌జెఇ’ స‌హాయ‌మంత్రి శ్రీ అఠావలే చెప్పారు. ‘ఎన్ఎంబిఎ’ విజ‌యాల‌ను, ఆ ప్ర‌చారోద్య‌మంతో మాదక ద్రవ్యాల కోసం డిమాండ్ అదుపులోకి రావడాన్ని ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్య‌క్ర‌మంలో చురుగ్గా పాల్గొంటున్న విద్యార్థుల‌ను అభినందించారు.

   అనంతరం ‘డిఒఎస్‌జెఇ’ కార్యదర్శి శ్రీ అమిత్ యాద‌వ్ కీల‌కోప‌న్యాసం చేస్తూ- దేశాన్ని మాద‌కద్రవ్య ర‌హితం చేయడంలో ఈ కార్య‌క్ర‌మం ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పారు. మాద‌క ద్ర‌వ్య వినియోగం జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో వ‌న‌రులు త‌ర‌లిపోయేందుకు వాహిక‌లా మారుతుందని స్సష్టం చేశారు. ఈ వ్యసనానికి బానిస‌లైతే ఆ దుష్ప్రభావం సామాజిక‌, ఆర్థిక రంగాలు రెండింటిపైనా ప‌డుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కాబట్టి, ఉమ్మ‌డి కృషితోనే ఆ దుర‌ల‌వాటును నిర్మూలించ‌వ‌చ్చున‌ని సూచించారు.

  చివరగా, ‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ కార్య‌క్ర‌మం కింద కేంద్ర మంత్రి, స‌హాయ మంత్రులు పాఠ‌శాల ప్రాంగ‌ణంలో మొక్క‌లు నాటారు. ‘డిఒఎస్‌జెఇ’ కార్య‌ద‌ర్శి, మోడ‌ర్న్ స్కూల్  ప్రిన్సిపాల్‌, విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకూ మొక్కలు పంపిణీ చేసి, ఇళ్లవ‌ద్ద నాటాల్సిందిగా సూచించారు.

 

ఈ కార్యక్రమం వీడియో లింక్: https://www.youtube.com/live/JMfhB85xAbE

***


(Release ID: 2045044) Visitor Counter : 61