ఉప రాష్ట్రపతి సచివాలయం
దేశ ఆర్థిక వృద్ధికి ఆర్థిక జాతీయతే మూలం
‘‘ప్రధానమంత్రి ‘వోకల్ ఫర్ లోకల్’ సూత్రానికి ప్రాతిపదిక మన చేనేత ఉత్పత్తులే’’;
చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని భారత కార్పొరేట్ సంస్థలకు పిలుపు;
‘‘భారత సంస్కృతికి చిహ్నం చేనేత... ఫ్యాషన్ డిజైనింగ్‌తో చేనేతను సంధానించాలి’’;
10వ జాతీయ చేనేత దినోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగం
Posted On:
07 AUG 2024 3:10PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నిర్దేశిత ‘‘వోకల్ ఫర్ లోకల్’’ నినాదానికి ప్రధాన ప్రాతిపదిక చేనేత ఉత్పత్తులేనని ఉపరాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్ థన్‌ఖడ్ నొక్కిచెప్పారు. ‘‘స్వదేశీ ఉద్యమం’’ స్ఫూర్తితో చేనేతను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను అందరూ గుర్తించాలని ఆయన పిలుపు ఇచ్చారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 10వ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆర్థిక వృద్ధికి, స్వాతంత్ర్యానికి ఆర్థిక జాతీయతే కీలకమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. చేనేతకుగల పర్యావరణ, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ ‘‘చేనేతను ప్రోత్సహించడం నేటి కర్తవ్యం.. దేశానికి అవసరం మాత్రమేగాక వాతావరణ మార్పులపరంగా ఈ భూగోళానికే అత్యంత కీలకం’’ అన్నారు.
ఉపాధి కల్పనలో... ప్రత్యేకించి గ్రామీణ మహిళల ఉపాధిలో చేనేతకు ఎంతో ప్రాధాన్య ఉందంటూ- ఆ ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ సదుపాయం కల్పించడం అవసరమని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. భారత కార్పొరేట్ రంగం.. ముఖ్యంగా హోటల్ పరిశ్రమ చేనేత ఉత్పత్తులను విస్తృతంగా వినియోగించాలని పిలుపు ఇచ్చారు. తద్వారా భారత సంస్కృతికి ప్రోత్సాహంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం, ఉపాధి అవకాశాల సృష్టి సాధ్యమని పేర్కొన్నారు.
ఆర్థిక జాతీయతను మౌలికంగా భారత ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా పేర్కొంటూ దాని కీలక ప్రయోజనాలను శ్రీ థన్‌ఖడ్ వివరించారు. ఈ ఉత్పత్తులతో ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని, దిగుమతులు తగ్గుతాయని, తద్వారా ఉద్యోగావకాశాల కల్పనతో స్థానికుల జీవనోపాధికి భరోసా ఇవ్వవచ్చునని చెప్పారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా వ్యవస్థాపనను కూడా బలోపేతం చేయవచ్చునన్నారు.
కొందరు వ్యక్తులు జాతీయ ప్రయోజనాలకు బదులు పరిమిత ఆర్థిక ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆందోళన వెలిబుచ్చారు. ఇటువంటి ప్రాధాన్యాలతో దిగుమతులు సమర్థనీయమేనా? అని ప్రశ్నించారు. దేశీయ పరిశ్రమలను, స్థానిక ఉపాధిని ప్రోత్సహించడాన్ని మించిన ఆర్థిక లాభం ఏదీ ఉండబోదని ఆయన తేల్చి చెప్పారు.
దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు 1905 ఆగస్టు 7వ తేదీన ప్రారంభమైన స్వదేశీ ఉద్యమ చారిత్రక ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆనాటి ఉద్యమం 110 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించిన ప్రధానమంత్రి శ్రీ మోదీ దార్శనికతను ప్రశంసించారు.
కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, సహాయమంత్రి శ్రీ పవిత్ర మార్గెరిటా, కార్యదర్శి శ్రీమతి రచనా షా తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
****
(Release ID: 2044710)
Visitor Counter : 49