నౌకారవాణా మంత్రిత్వ శాఖ
నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరానికి పోర్టు నగదీకరణ
Posted On:
06 AUG 2024 1:40PM by PIB Hyderabad
దేశంలోని ప్రధాన నౌకాశ్రయాల్లో నిర్దిష్ట కాలపరిమితికి రాయితీ ఒప్పందం ద్వారా నిర్దిష్ట ప్రాజెక్టులు/బెర్తులు/టెర్మినల్స్ నిర్మాణంలో ప్రైవేటు రంగం భాగస్వామ్యాన్ని అనుమతించారు. మేజర్ పోర్టుల సంస్థ, రాయితీ పొందిన సంస్థ మధ్య ఆదాయ భాగస్వామ్యం/రాయల్టీ ప్రాతిపదికన బహిరంగ పోటీ బిడ్డింగ్ విధానంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని అనుమతిస్తారు. రాయితీ కాలపరిమితి ముగిసిన అనంతరం సంబంధిత ఆస్తిని పోర్ట్ అధారిటీకి అప్పగిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) విధానంలో రూ.10,000 కోట్ల పెట్టుబడులకు అనుమతించారు. అందులో విఓ చిదంబరనార్ పోర్ట్ (రూ.7055 కోట్లు), దీన్ దయాళ్ పోర్ట్ (రూ.1880 కోట్లు), శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ (రూ.1065 కోట్లు) ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వీటిని అమలుపరచాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టులకు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. మరింత స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛ కల్పించడానికి, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి గతంలోని మేజర్ పోర్ట్ ట్రస్టుల చట్టం, 1963 స్థానంలో మేజర్ పోర్ట్ అధారిటీల చట్టం, 2021ని ఆమోదించారు. దీనికి తోడు నమూనా రాయితీ ఒప్పందం (ఎంసిఏ) సవరించడంతో పాటు పిపిపి ప్రాజెక్టులకు టారిఫ్ ల నిర్ణయానికి మార్గదర్శకాలు రూపొందించారు.
కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందచేశారు.
***
(Release ID: 2043407)
Visitor Counter : 47