రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రోడ్డు ప్రమాదాలు - భద్రత చర్యలు

Posted On: 07 AUG 2024 1:08PM by PIB Hyderabad

దేశంలోని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు శాఖల నుంచి అందే సమాచారం ఆధారంగా కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ ఏటా ‘‘భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు’’ పేరిట ఒక నివేదికను ప్రచురిస్తూంటుంది. దీని ప్రకారం- 2018 నుంచి 2022 వరకు దేశవ్యాప్తంగా సంభవించిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు, క్షతగాత్రుల సంఖ్యను కిందివిధంగా పట్టిక రూపంలో పొందుపరచింది:-

సంవత్సరం

మొత్తం ప్రమాదాలు

మరణాలు

క్షతగాత్రులు

2018

4,70,403

1,57,593

4,64,715

2019

4,56,959

1,58,984

4,49,360

2020

3,72,181

1,38,383

3,46,747

2021

4,12,432

1,53,972

3,84,448

2022

4,61,312

1,68,491

4,43,366

అలాగే 2018 నుంచి 2022 వరకు రాష్ట్రాల వారీగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు, క్షతగాత్రుల సంఖ్యను వరుసగా అనుబంధం-1, 2, 3లలో పొందుపరచింది.

   దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణం-నిర్వహణ బాధ్యత కేంద్ర రోడ్డు రవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖదే. ఈ నేపథ్యంలో తమ పరిధిలోని ఈ రహదారులపై సంభవించిన ప్రమాదాలు, మరణాలు సంఖ్యను ఆయా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు శాఖల నుంచి అందిన సమాచారం మేరకు కిందివిధంగా పొందుపరచింది:-

కేటగిరీ

అన్ని రహదారులు

‘ఎక్స్ ప్రెస్ వే’లు సహా జాతీయ రహదారులు

జాతీయ రహదారుల  వాటా (శాతాల్లో)

రోడ్డు ప్రమాదాలు

4,61,312

1,51,997

32.94

మరణాలు

1,68,491

61,038

4,49,360

ఈ నేపథ్యంలో రహదారి భద్రతపై అవగాహన, ఇంజనీరింగ్ (రోడ్లు+వాహనాలు), అమలు, అత్యవసర సంరక్షణ అంశాల ప్రాతిపదికన మంత్రిత్వశాఖ బహుముఖ వ్యూహాన్ని రూపొందించింది. తదనుగుణంగా అనుబంధం-4లో వివరించిన మేరకు పలు చర్యలు చేపట్టింది.

అనుబంధం-4

రహదారి భద్రతపై మంత్రిత్వశాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాల వివరాలు:-

1. అవగాహన:

  1. రహదారి భద్రతపై అవగాహన కల్పన దిశగా రకరకాల కార్యక్రమాల నిర్వహణలో వివిధ సంస్థలకు ఆర్థిక సహాయం కోసం రహదారి భద్రత సూచనా పథకం నిర్వహిస్తోంది.
  2. రహదారి భద్రత బలోపేతం, అవగాహన పెంపు దిశగా ఏటా ‘జాతీయ రహదారి భద్రత మాసోత్సవం/వారోత్సవం కింద కార్యక్రమాల నిర్వహణ.
  3. దేశవ్యాప్తంగా రాష్ట్ర/జిల్లా స్థాయిలో డ్రైవింగ్ శిక్షణ-పరిశోధన సంస్థ (ఐడిటిఆర్), ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు (ఆర్‌డిటిసి), డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల (డిటిసి) ఏర్పాటుకు ఒక పథకం అమలు చేస్తోంది.

2. ఇంజనీరింగ్:

2.1 రోడ్ ఇంజనీరింగ్:

  1. రహదారుల డిజైన్, నిర్మాణం, కార్యకలాపాలు, నిర్వహణ తదితర అన్ని దశల్లోనూ తృతీయ పక్ష (థర్డ్ పార్టీ) ఆడిటర్లు/నిపుణుల ద్వారా అన్ని జాతీయ రహదారుల (ఎన్‌హెచ్‌) రహదారి భద్రత తనిఖీ (ఆర్ఎస్ఎ) తప్పనిసరి చేసింది.
  2. జాతీయ రహదారులపై ముప్పు/ప్రమాదకర ప్రదేశాల గుర్తింపు, సరిదిద్దే చర్యలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
  3. మంత్రిత్వశాఖ పరిధిలో ‘ఆర్ఎస్ఎ’, ఇతర రోడ్డు భద్రత సంబంధిత పనుల పర్యవేక్షణకు రోడ్డు యాజమాన్య సంస్థల ప్రతి ప్రాంతీయ కార్యాలయంలో రహదారి భద్రత అధికారి (ఆర్ఎస్ఒ)  నియామకం. సదరు ‘ఆర్ఎస్ఒ’లు రెండేళ్లకొకసారి తమ పరిధిలోగల జాతీయ రహదారి సంబంధిత రహదారి వినియోగార్హత ధ్రువీకరణను సమర్పించడం తప్పనిసరి.
  4. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద సమాచార నివేదన (డేటా రిపోర్టింగ్), నిర్వహణ, విశ్లేషణ కోసం కేంద్రీయ భాండాగారం (సెంట్రల్ రిపాజిటరీ) ఏర్పాటు లక్ష్యంగా ‘ఎలక్ట్రానిక్ డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ (ఇ-డిఎఆర్) ప్రాజెక్టును మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
  5. ఎక్స్ ప్రెస్ మార్గాలు, జాతీయ రహదారులపై విస్పష్ట దృగ్గచరత, డ్రైవర్లకు స్ఫురణాత్మక మార్గదర్శనం దిశగా సంకేత బోర్డుల ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీచేసింది.
  6. రహదారుల డిజైన్, నిర్మాణం, నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీచేసే ప్రమాణాలను పాటించని పక్షంలో చర్యలు చేపట్టేందుకు వీలుగా మోటారు వాహనాల చట్టం-1988లో నిబంధనలను పొందుపరచింది.

2.1 వాహన ఇంజనీరింగ్:

వాహనాల పరంగా భద్రత దిశగా మంత్రిత్వశాఖ కిందివిధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టింది:-

  1. వాహనం ముందు సీట్లో.. డ్రైవర్ పక్కన కూర్చునే ప్రయాణికుల కోసం ఎయిర్ బ్యాగ్ ఏర్పాటు తప్పనిసరి.
  2. నాలుగేళ్ల లోపు పిల్లలతో మోటారు సైకిలుపై ప్రయాణించడం లేదా తీసుకెళ్లే విషయంలో భద్రతపై నిబంధనలు జారీచేశారు. ఇందులో భాగంగా పిల్లలకు క్రాష్ హెల్మెట్, సురక్షిత బంధనం (సేఫ్టీ హార్నెస్) వాడాలని, వాహన వేగం గంటకు 40 కిలోమీటర్లు మించరాదని ఈ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.
  3. అలాగే దిగువ పేర్కొన్న భద్రత సాంకేతిక పరికరాల అమరిక తప్పనిసరి:-

ఎం1 కేటగిరీ వాహనాలకు:

  • డ్రైవర్, కో-డ్రైవరుకు సీట్ బెల్ట్ హెచ్చరిక (ఎస్‌బిఆర్‌)
  • సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కోసం మాన్యువల్ ఓవర్ రైడ్
  • వేగం మితిమీరితే హెచ్చరించే వ్యవస్థ (ఓవర్ స్పీడ్ వార్నింగ్ సిస్టమ్)

అన్ని రకాల ‘ఎమ్, ఎన్’ కేటగిరీ వాహనాలకు:

  • రివర్స్ పార్కింగ్ హెచ్చరిక వ్యవస్థ
  1. ‘ఎల్’ (క్వాడ్రిసైకిల్ సహా 4 చక్రాల్లోపు), ‘ఎం’ [ప్రయాణిక రవాణాకు వాడే 4 చక్రాల వాహనాలు], ‘ఎన్’ [బిఐఎస్ ప్రమాణాల్లోని నిబంధనలకు లోబడి వస్తు-ప్రయాణిక రవాణా తరహా కనీసం 4 చక్రాల వాహనాలు] వంటి కొన్ని కేటగిరీ వాహనాలకు ‘యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్’ (ఎబిఎస్) తప్పనిసరి చేశారు.
  2. ద్విచక్ర, త్రిచక్ర, క్వాడ్రిసైకిల్, అగ్నిమాపక, అంబులెన్స్, పోలీసు వాహనాలు మినహా అన్ని రవాణా వాహనాల్లో వేగ పరిమితి వ్యవస్థ/పరికరం తప్పనిసరి.
  3. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (ఎటిఎస్)కు గుర్తింపు-నియంత్రణ-అదుపు సంబంధిత నిబంధనలను ప్రచురించింది. ఆటోమేటెడ్ పరికరాలతో వాహన సామర్థ్య పరీక్ష ప్రక్రియను, ‘ఎటిఎస్’ల ద్వారా వాహన సామర్థ్య ధ్రువీకరణ పత్రం మంజూరు విధానాన్ని నిర్వచిస్తుంది. ఈ నిబంధనలను 31.10.2022, 14.03.2024 తేదీల్లో సవరించారు.
  • VII. ప్రోత్సాహక/ నిరోధక విధానాలతో పాత-వినియోగార్హతలేని, కాలుష్యకారక వాహనాల దశలవారీ తొలగింపు పర్యావరణ సృష్టి లక్ష్యంగా వాహన తుక్కు విధానం రూపకల్పన.
  1. ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా వాహన సామర్థ్య పరీక్ష కోసం కేంద్ర సహాయంతో ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో ఒక ఆదర్శ తనిఖీ-ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటు పథకం.
  2. ప్రయాణిక కార్ల భద్రత రేటింగ్ పద్ధతి ప్రవేశపెట్టడంతోపాటు సమాచార ఆధారిత నిర్ణయానికి వీలుగా వాడకందారులకు సాధికారత దిశగా ‘భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్’ (బిఎన్‌సిఎపి) సంబంధిత నిబంధనల ప్రచురణ.
  3. బస్సుల తయారీకి సంబంధించి వాస్తవ తయారీదారులు (ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్-ఒఇఎం) బస్సు బాడీ బిల్డర్లకు నిర్దిష్ట సమానావకాశాల కల్పనపై నిబంధనల ప్రచురణ.
  4. దేశంలో 2025 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత తయారయ్యే ‘ఎన్2’ (స్థూల బరువు 3.5 టన్నులకు మించిన, 12.0 టన్నులకు లోపుగల వస్తు రవాణా), ‘ఎన్3’ (స్థూల బరువు 12.0 టన్నులకు మించిన) కేటగిరీల వాహనాల కేబిన్లకు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ అమర్చడం తప్పనిసరి.

3. అమలు:

  1. ట్రాఫిక్ నిబంధనల అనుసరణ-ఉల్లంఘనల విషయంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా కచ్చితంగా వ్యవహరిస్తూ జరిమానా విధించడానికి సంబంధించి మోటారు వాహన (సవరణ) చట్టం-2019 అమలులో ఉంది.
  2. రహదారి భద్రతపై ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ-అమలు దిశగా మంత్రిత్వ శాఖ నిబంధనలను జారీ చేసింది. వీటిని దేశంలో 10 లక్షలకు మించి జనాభాగల, ‘నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్’ (ఎన్‌సిఎపి) అమలు చేస్తున్న నగరాల్లోని అధిక ముప్పు/అధిక వాహన సాంద్రతగల జాతీయ/రాష్ట్ర రహదారులు, సంక్లిష్ట కూడళ్ల కారిడార్లలో ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చడంపై సమగ్ర నిబంధనలను నిర్దేశించింది.
  3. మోటారు వాహన చట్టం-1988 కచ్చితంగా అమలు చేసేలా తోడ్పడగల సాంకేతికపరమైన  చర్యలపై 2024 జూన్ 10న అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మంత్రిత్వశాఖ సూచనాపత్రం జారీ చేసింది.

4. అత్యవసర సంరక్షణ:

  1. ఎలాంటి ప్రతిఫలం లేదా పరిహారం ఆశించకుండా సదుద్దేశంతో ప్రమాద ప్రదేశాల్లో బాధితులకు  అత్యవసర చికిత్స లేదా వైద్యేతర సాయం లేదా సంరక్షణ లేదా ఆస్పత్రికి తరలించే మానవతా దృక్పథంగల వ్యక్తుల రక్షణకు మంత్రిత్వ శాఖ తగిన చర్యలు చేపట్టింది.
  2. ‘హిట్ అండ్ రన్’ (ఢీకొట్టి వెళ్లిపోయే వాహన) కేసులలో బాధితులకు చెల్లించే పరిహారం మొత్తాన్ని (మరణానికి రూ.25వేల నుంచి రూ.2,00,000కు, తీవ్ర గాయాలకు రూ.12,500 నుంచి రూ.50 వేలదాకా) మంత్రిత్వ శాఖ పెంచింది.
  3. నిర్మాణం పూర్తయిన జాతీయ రహదారి కారిడార్లలో టోల్ ప్లాజాల వద్ద పారామెడికల్ సిబ్బంది/ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్/నర్సుతో కూడిన అంబులెన్స్ వాహనాల అందుబాటుకు తగిన నిబంధనలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఎఐ) జారీ చేసింది.
  4. చండీగఢ్, అస్సాంలలో రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స సదుపాయంపై జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌హెచ్ఎ)తో సంయుక్తంగా మంత్రిత్వ శాఖ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని అమలు చేసింది.

   కేంద్ర ఉపరితల రవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

 

***


(Release ID: 2043079) Visitor Counter : 75