వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ విధానాలతో విదేశీ పెట్టుబడులలో మరింత ఉత్తేజం

Posted On: 06 AUG 2024 4:17PM by PIB Hyderabad

   దేశంలో పారిశ్రామిక కార్యకలాపాలకు ప్రోత్సాహంతోపాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ మేరకు పరిశ్రమల ప్రోత్సాహక-అంతర్గత వాణిజ్య విభాగం (డిపిఐఐటి), ఇతర మంత్రిత్వ శాఖలు/విభాగాల ద్వారా దేశ పారిశ్రామిక సర్వతోముఖాభివృద్ధికి తగిన విధానాలతో సానుకూల పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాల పరిధిలో అమలయ్యే పథకాలతోపాటు వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తూ సౌలభ్యం కల్పన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ‘‘మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, పిఎం గతిశక్తి, జాతీయ పారిశ్రామిక కారిడార్ కార్యక్రమం’’ వంటివి అమలు చేస్తోంది. అంతేకాకుండా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పిఎల్ఐ), వాణిజ్య సౌలభ్య (ఇఒడిబి)కల్పనకు ప్రోత్సాహం, నిబంధనల భారం తగ్గింపు, జాతీయ ఏకగవాక్ష వ్యవస్థ (ఎన్ఎస్‌డ‌బ్ల్యుఎస్‌) వంటి సంస్కరణలు ప్రవేశపెట్టింది. అలాగే భారత పారిశ్రామిక భూ నిధి, ప్రాజెక్టుల పర్యవేక్షణ బృందం (పిఎంజి) ఏర్పాటు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానం సరళీకరణ, భారతీయ పాదరక్ష-చర్మ పరిశ్రమాభివృద్ధి పథకం వంటివి తీసుకొచ్చింది. మరోవైపు పెట్టుబడులను వేగిరపరచడానికి వీలుగా ప్రభుత్వంలోని అన్ని సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలలో ప్రాజెక్టుల రూపకల్పన విభాగం (పిడిసి) పేరిట సంస్థాగత వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది.

   ముఖ్యంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) ప్రోత్సహిస్తూ ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. తదనుగుణంగా కొన్ని కీలక వ్యూహాత్మక రంగాలు మినహా అన్నిరంగాల్లోనూ స్వయంచలితంగా 100 శాతం ‘ఎఫ్‌డిఐ’ని అనుమతిస్తూ పెట్టుబడిదారు హిత విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ప్రస్తుతం దాదాపు 90 శాతం ‘ఎఫ్‌డిఐ’లు ఈ మార్గంలోనే వస్తున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరుస్తూ- ‘ఎఫ్‌డిఐ’ల పరిమితి పెంపు, నియంత్రణల సరళీకరణ, మౌలిక సదుపాయాల కల్పన వ్యాపార వాతావరణం మెరుగుదల వంటి చర్యలు తీసుకుంటోంది.

   దేశంలో వాణిజ్య-జీవన సౌలభ్య కల్పన లక్ష్యంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వం-వ్యాపారాల (జి2బి) మధ్య, పౌరులతోనూ సంబంధాలలో సరళీకరణ, హేతుబద్ధీకరణ, డిజిటలీకరణ, నేరపరిధి తగ్గింపు వంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలో ఇప్పటిదాకా  42,000కుపైగా నిబంధనానుసరణ భారం తగ్గించింది. అలాగే 3,800కుపైగా అంశాలను నేరపరిధి నుంచి తప్ప్పించింది. ప్రజా విశ్వాస ఆధారిత పాలనకు మరింత ప్రాధాన్యంతో ‘జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) చట్టం-2023ను రూపొందించింది. దీనికింద స్వల్ప నేరాలను, నిబంధనల పాటింపు సంబంధిత చట్టాలు-నిబంధనల ఉల్లంఘనను నేరరహితం చేసింది. మొత్తంమీద

19 మంత్రిత్వ శాఖలు/విభాగాల పరిధిలోని 42 చట్టాల కింద 183 నిబంధనల ఉల్లంఘనను నేర రహితంగా ప్రకటించింది. ఈ చర్యలన్నిటి ఫలితంగానే ప్రపంచ బ్యాంకు ప్రకటించిన ‘వ్యాపార నిర్వహణ నివేదిక-2020 (డిబిఆర్)లో భారత్ 63వ స్థానానికి దూసుకెళ్లింది. అంటే- 2014 నాటికి 142వ స్థానంలో ఉండగా, కేవలం ఐదేళ్లలో 79 స్థానాలు మెరుగుపడింది.

   దేశంలో అన్నిరకాల నియంత్రణ అనుమతులు, సేవల ప్రదానం కోసం జాతీయ ఏకగవాక్ష వ్యవస్థ (ఎన్ఎస్‌డ‌బ్ల్యుఎస్‌) రూపంలో ఒక పోర్టల్‌ను ‘డిపిఐఐటి’ ఏర్పాటు చేసింది. దేశంలో ‘జి2బి’ పర్యావరణ వ్యవస్థల క్రమబద్ధీకరణ, వాణిజ్య సౌలభ్యాన్ని మరింతగా ప్రోత్సహించడమే ఈ పోర్టల్ లక్ష్యం. అలాగే ‘జి2బి’ పర్యావరణ వ్యవస్థలో జవాబుదారీతనం, సమాచార సమరూపత, పారదర్శకతలను ప్రోదిచేస్తుంది. ఈ దిశగా ఒక జాతీయ పోర్టల్ సహా శాశ్వత ఖాతా సంఖ్య (పిఎఎన్-పాన్) ఆధారిత ధ్రువీకరణ-నమోదు, కేంద్ర స్థాయిలో 270కిపైగా ‘జి2బి’ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా వ్యాపార నిర్వహణ కోసం రకరకాల నమోదు, నిబంధనల అనుసరణ బెడద తొలగిపోవడమే కాకుండా ‘జి2బి’ సేవలు సులభంగా పొందే వీలుంటుంది. ఆ మేరకు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల నుంచి అనుమతి వ్యవస్థలను జాతీయ పోర్టల్ ఏకీకృతం చేస్తుంది. దీనికింద ప్రస్తుతం 32 కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలతోపాటు 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఏకగవాక్ష వ్యవస్థలు ‘ఎన్ఎస్‌డ‌బ్ల్యుఎస్‌’తో సంధానితమయ్యాయి. ఈ నేపథ్యంలో మొత్తం 277 కేంద్ర, 2,977 రాష్ట్ర అనుమతుల కోసం జాతీయ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులోని ‘నో యువర్ అప్రూవల్’ (కెవైఎ) మాడ్యూల్ ద్వారా 653 కేంద్ర అనుమతులు, 6,198 రాష్ట్ర అనుమతుల సంబంధిత సమాచారం వ్యాపార సంస్థలకు అందుబాటులో ఉంటుంది.

   కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

***


(Release ID: 2042501) Visitor Counter : 79