రక్షణ మంత్రిత్వ శాఖ
వయనాడ్‌లో భారత నావికాదళం రక్షణ-సహాయ చర్యల కొనసాగింపు
Posted On:
03 AUG 2024 1:47PM by PIB Hyderabad
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో భారత నావికాదళం రక్షణ-సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. తీవ్ర ప్రతికూల వాతావరణం, సంక్లిష్ట భౌగోళిక పరిస్థితుల నడుమ నావికాదళ సిబ్బంది అంకితభావంతో ఆపన్నులను ఆదుకునేందుకు శ్రమిస్తున్నారు. ఈ మేరకు సహాయక చర్యలతోపాటు విపత్తు ప్రభావిత ప్రాంతంలో స్థానికులకు సాయం కోసం అదనపు సిబ్బంది, వనరులు, నిత్యావసర సామగ్రిని ‘ఐఎన్ఎస్ జమూరిన్’ యుద్ధనౌక తీసుకొచ్చింది. ప్రస్తుతం 78 మంది నావికాదళ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటుండగా, ఈ బృందాలను చూరల్మల, ముండక్కై ప్రాంతాల్లో మోహరించారు. అక్కడి విపత్తు సహాయక దళాలు, స్థానిక యంత్రాంగంతో కలిసి వీరంత తమవంతు సేవలందిస్తున్నారు. బాధితులకు సామగ్రి, ఆహారం, నిత్యావసర సరుకుల సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా ఓక బృందాన్ని నదీతీరం వద్ద నియమించారు. మరో బృందం మట్టి, బురదకింద కొన ఊపిరితో ఉన్న అభాగ్యుల గాలింపు, శిథిలాల తొలగింపు, మృతదేహాల వెలికితీతలో నిమగ్నమై ఉంది. క్షతగాత్రులకు వైద్య సహాయం నిమిత్తం చూరల్మల వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ నెల 1న కొండచరియలు కూలడంతో చూరల్మల-ముండక్కై మధ్య సంబంధాలు తెగిపోయాయి. దీంతో భారత సైనిక బృందం నదిపై ‘బెయిలీ వంతెన’ ఏర్పాటు చేస్తున్నారు. వీరికి నావికాదళంలోని ముగ్గురు అధికారులు, 30 మంది నావికుల బృందం సహకరిస్తోంది. ఈ వంతెన పూర్తయితే దీనిమీదుగా భారీ యంత్రాలు, అంబులెన్సులు, ఇతర సహాయ సామగ్రి రవాణా సులభమవుతుంది.
బాధితుల అన్వేషణ, మృతదేహాల వెలికితీత కోసం కాలికట్ నుంచి వచ్చిన ‘ఐఎన్ఎస్ గరుడ’ నౌకలోని అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్) ప్రభావిత ప్రాంతాల్లో గగనం నుంచి అన్వేషణ చేపట్టింది. రోడ్డు మార్గం ద్వారా చేరుకోలేని విపత్తు ప్రభావిత ప్రాంతాలకు సహాయక పరికరాలు, 12 మంది రాష్ట్ర పోలీసు సిబ్బందిని ఇది తీసుకెళ్లింది. తక్కువ దృగ్గోచరత, సవాళ్లతో కూడిన వాతావరణ పరిస్థితుల నడుమ కొండ ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా సర్వే నిర్వహించారు.
విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారి సత్వర తరలింపు, కనీస సౌకర్యాల కల్పన, వైద్య సహాయం దిశగా స్థానిక యంత్రాంగంతో సమన్వయం ద్వారా నావికాదళం కృషి చేస్తోంది.
***
(Release ID: 2041364)
Visitor Counter : 57