బొగ్గు మంత్రిత్వ శాఖ
‘సిఐఎల్ ఆషిస్’ పథకం కింద 1645 మంది బాలలకు ఉపకార వేతనాలు విడుదల
కారుణ్య నియామకం కింద 424 మందికి సీఐఎల్ ద్వారా నియామక పత్రాల ప్రదానం
Posted On:
03 AUG 2024 4:53PM by PIB Hyderabad
సామాజిక సేవకు కట్టుబడిన కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చిన 1645 మంది బాలలకు ఉపకార వేతనాలు మంజూరు చేసి, వారిని మళ్లీ పాఠశాల బాట పట్టించింది. ఈ మేరకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) కింద ‘సిఐఎల్ ఆషిస్’ (ఆయుష్మాన్ శిక్షా సహాయత) పేరిట ఉదాత్త కార్యక్రమం చేపట్టింది. అంతేకాకుండా ‘సిఐఎల్’లో పనిచేస్తూండగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే దిశగా వారి వారసులు 424 మందికి కారుణ్య నియామకం కింద నియామక పత్రాలను ప్రదానం చేసింది.
దేశ రాజధానిలోని సర్వోన్నత న్యాయస్థానం ప్రాంగణంలో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఉపకార వేతనాలు, నియామక పత్రాలను లబ్ధిదారులకు అందజేసింది. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల (75 ఏళ్లు) నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి చొరవతో కేసుల పరిష్కారం దిశగా 2024 జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్ ముగింపు సందర్భంగా
ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉపకారవేతనాల సంబంధిత డమ్మీ చెక్కులను 25 మంది బాలలకు, కారుణ్య నియామక పత్రాలను కీర్తిశేషులైన ఉద్యోగుల కుటుంబాల్లోని 10 మంది మహిళలకు అందజేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డి.వై.చంద్రచూడ్, గౌరవ అతిథిగా పాల్గొన్న కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ అర్జున్ రామ్‌మేఘ్వాల్ చేతులమీదుగా వీటిని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, రిజిస్ట్రీ అధికారులు, సీనియర్ న్యాయవాదులు, కోర్టు అధికారులు, న్యాయవాదులు సహా బొగ్గు, న్యాయ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, సీఐఎల్/అనుబంధ సంస్థల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
‘సిఐఎల్-ఆషిస్’ పథకం కింద అర్హులైన బాలలు విద్యాభ్యాసం కొనసాగించేలా ఏటా రూ.45,000 వంతున నాలుగేళ్ల పాటు ఉపకారవేతనం అందిస్తారు. అందుబాటులోగల రికార్డుల ఆధారంగా వివిధ హైకోర్టులు ఈ బాలలను ఎంపికచేశాయి. సామాజిక సేవకు కట్టుబాటులో భాగంగా కోల్ ఇండియా లిమిటెడ్ కృషిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ప్రశంసించారు.
***
(Release ID: 2041362)
Visitor Counter : 90