ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లో చాందీపుర వైరస్ విజృంభణ అప్‌డేట్స్


గుజరాత్‌కు చెందిన 140 కేసులతో సహా 148 ఏఈఎస్ కేసులు నమోదు కాగా, అందులో 59 మంది మరణం.. 51 మందిలో చాందీపుర‌ వైరస్ నిర్ధారణ


19 జూలై 2024 నుంచి రోజువారీగా నమోదవుతోన్న ఏఈఎస్ కొత్త కేసుల సంఖ్యలో స్పష్టంగా కనిపిస్తున్న తగ్గుదల


గుజరాత్‌లో ప్రజారోగ్య చర్యలు చేపట్టడంలో సహాయం అందించేందుకు, వివరణాత్మక ఎపిడెమియోలాజికల్ దర్యాప్తును నిర్వహించేందుకు నేషనల్ జాయింట్ అవుట్‌బ్రేక్‌ రెస్వాన్స్‌టీమ్ నియామకం


ఏఈఎస్ కేసులు నమోదవుతోన్న పొరుగు రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసేందుకు సంయుక్త సలాహాను జారీ చేసిన ఎస్‌సీడీసీ, ఎన్‌సీవీబీడీసీలు

Posted On: 01 AUG 2024 10:37AM by PIB Hyderabad

జూన్ 2024 ప్రారంభం నుంచి గుజరాత్‌లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలలో అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్(ఏఈఎస్) కేసులు నమోదవుతున్నాయి. జూలై 31 నాటికి, 148 ఏఈఎస్ కేసులు (గుజరాత్‌లోని 24 జిల్లాలలో 140, మధ్యప్రదేశ్‌లో 4, రాజస్థాన్‌లో 3, మహారాష్ట్రలో 1) నమోదయ్యాయి. ఇందులో 59 మంది మరణించారు. 51 మందిలో చాందీపుర వైరస్ (సీహెచ్‌పీవీ) నిర్ధారణ అయింది.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ) డైరెక్టర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డీజీ సంయుక్తంగా పరిస్థితిని సమీక్షించారు. మధ్యప్రదేశ్ ఎన్‌హెచ్‌ఎం ఎండీ, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్(ఐడీఎస్‌పీ) యూనిట్‌లు.. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రాంతీయ కార్యాలయాలు.. ఎన్ఐవీ, ఎన్సీడీసీకి చెందిన ఎన్‌జేఓఆర్‌టీ సభ్యులు.. ఎన్సీడీసీ, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్(ఎన్సీవీబీడీసీ) అధ్యాపకులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

2024 జూలై 19 నుంచి రోజువారీగా నమోదవుతోన్న కొత్త ఏఈఎస్ కేసుల సంఖ్యలో తగ్గుదల ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. వెక్టర్ కంట్రోల్(వైరస్ వ్యాప్తి చెందే కీటకాలు, ఇతర జీవజాల నియంత్రణ) కోసం క్రిమిసంహారకాల పిచికారీ, ఐఈసీ, వైద్య సిబ్బందికి అవగాహన కల్పించడం, నిర్దేశిత కేంద్రాలకు సకాలంలో వ్యాధిగ్రస్తులను పంపించటం(రిఫర్ చేయటం) వంటి పలు చర్యలను గుజరాత్ చేపట్టింది.
ప్రజారోగ్య చర్యలు చేపట్టడంలో గుజరాత్ ప్రభుత్వానికి సహాయపడేందుకు, వివరణాత్మక ఎపిడెమియోలాజికల్ దర్యాప్తును నిర్వహించేందుకు నేషనల్ జాయింట్ అవుట్‌బ్రేక్‌ రెస్వాన్స్ టీమ్(ఎన్‌జేఓఆర్‌టీ) గుజరాత్‌లో నియమించారు. ఏఈఎస్‌ కేసులు నమోదవుతోన్న పొరుగు రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసేందుకు ఎన్‌సీడీసీ, ఎన్‌సీవీబీడీసీ సంయుక్త సలహాను(జాయింట్ అడ్వైజరీ) జారీ చేశాయి.

నేపథ్యం:

 

‘రబ్డోవిరిడే’ కుటుంబానికి చెందినది ఈ సీహెచ్‌పీవీ. దేశంలోని పశ్చిమ, మధ్య, దక్షిణ ప్రాంతాలలో ముఖ్యంగా వర్షాకాలంలో అడపాదడపా నమోదవుతోంది. తద్వారా వ్యాప్తి చెందుతోంది. శాండ్ ఫ్లై, టిక్స్ వంటి వాహకాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. దోమల నియంత్రణ, పరిశుభ్రత, అవగాహన మాత్రమే ఈ వ్యాధి విషయంలో అందుబాటులో ఉన్న చర్యలు. ఈ వ్యాధి ఎక్కువగా 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు వస్తోంది. మూర్ఛ, కోమా, కొన్ని సందర్భాల్లో మరణానికి దారితీసే జ్వరసంబంధ అనారోగ్యాన్ని ఇది కలిగిస్తుంది. సీహెచ్‌పీవీకి నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు. రోగ లక్షణాలను బట్టి చికిత్స అందిస్తూ, అనుమానిత ఏఈఎస్ వ్యక్తులను నిర్దేశిత కేంద్రాలకు సకాలంలో పంపించటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.

***


(Release ID: 2040610) Visitor Counter : 100