వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ధరల పర్యవేక్షణ వ్యవస్థ (పి.ఎమ్.ఎస్) మొబైల్ యాప్ 4.0 వర్షన్ ప్రారంభించిన ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి
ఆగస్ట్ 1 నుండి ధరల పర్యవేక్షణ పరిధిలోకి రానున్న 16 అదనపు సరుకులు: శ్రీ జోషి
प्रविष्टि तिथि:
01 AUG 2024 3:06PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ 2024, ఆగస్ట్ 1వ తేదీ నుండి అదనంగా 16 సరుకులను ధరల పర్యవేక్షణకు జోడించినట్లు, ఈరోజు ధరల పర్యవేక్షణ వ్యవస్థ (పి.ఎమ్.ఎస్.) మొబైల్ యాప్ యొక్క వర్షన్ 4.0 విడుదల సందర్భంగా వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ, కొత్త మరియు పునరుత్పాదక శక్తి శాఖామంత్రి శ్రీ ప్రహ్లాద్ వెంకటేష్ జోషి తెలిపారు. ఇప్పటికే 22 సరుకులు రోజువారీ ధరల పర్యవేక్షణ పరిధిలో ఉండగా, ఇప్పుడు మొత్తం 38 సరకుకుల ధరలు పర్యవేక్షించబడతాయి.
34 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 550 కేంద్రాల్లో గల ధరలను ఈ విభాగం పర్యవేక్షిస్తున్నది. విభాగం పర్యవేక్షించే ధరల డేటా ప్రభుత్వం, ఆర్.బి.ఐ., సి.పి.ఐ. ద్రవ్యోల్బణానికి సంబంధించిన విశ్లేషకులకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం ముందస్తు సూచనలను అందిస్తుంది. మొత్తం సి.పి.ఐ. బరువులలో, 22 రకాల సరుకుల ద్వారా సంగ్రహించబడిన సి.పి.ఐ. బరువుల శాతం 26.5% తో పోల్చినప్పుడు 38 సరుకుల కోసం అది సుమారుగా 31% ఉంది. కొత్తగా చేర్చిన సరుకులలో సజ్జలు, జొన్నలు, రాగులు, రవ్వ (గోధుమ), మైదా (గోధుమ), శనగపిండి, నెయ్యి, వెన్న, వంకాయ, గ్రుడ్లు, నల్ల మిరియాలు, కొత్తిమీర, జీలకర్ర, ఎర్ర మిరప, పసుపు పొడి మరియు అరటిపండ్లు ఉన్నాయి.
రోజువారీ ధరల పర్యవేక్షణ పరిధిలోకి వచ్చే ఆహార పదార్థాల సంఖ్యలో పెరుగుదల ఆహార పదార్థాల ధరల అస్థిరతను స్థిరీకరించే, మొత్తం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే విధానపరమైన ప్రక్రియలలో కీలక పాత్ర పోషిస్తుంది. వినియోగదారులకు అవసరమైన వస్తువుల లభ్యత, స్థోమత సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం మరింత ప్రతిబింబిస్తుంది.
ఆహార ధరల ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో వరుస చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రూ.60లకే కిలోగ్రామ్ భారత్ శనగలు; రూ. 27.50లకే కిలోగ్రామ్ భారత్ గోధుమపిండి; రూ.29లకే కిలోగ్రామ్ భారత్ బియ్యం రిటైల్ వినియోగదారులకు అందించబడుతున్నవి. 2024, జూలై 29వ తేదీ నుండి రిటైల్ వినియోగదారుల కోసం రూ.60లకే కిలో టమాటల రిటైల్ విక్రయాన్ని ఎన్.సి.సి.ఎఫ్. ప్రారంభించినది. అధిక మొత్తంలో నిల్వచేయుటను నివారించడానికి కంది, దేశీ శనగల నిల్వలపై 2024, జూన్ 21వ తేదీ నుండి 2024, సెప్టెంబర్ 30వ తేదీ వరకు పరిమితులు విధించబడినవి. దేశీయ సరఫరాను మెరుగుపరిచేందుకు కందులు, మినుములు, మసూర్, పసుపురంగు బఠానీ, దేశీయ శనగల దిగుమతిపై సుంకం రద్దు చేయబడినది. లభ్యత, స్థోమతను నిర్ధారించడానికి కొరత ఉండే నెలల్లో విడుదల చేయడం కోసం 5 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సేకరించబడుతున్నది.
ఈ సంవత్సరం (2024-25) ఖరీఫ్ సీజన్‌లో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ధరల నియంత్రణ చర్యలు మార్కెట్‌ను స్థిరీకరించాయి అలాగే గత నెలతో పోల్చితే ప్రధాన మండీలలో శనగ, కంది, మినప పప్పుల ధరలు 4% వరకు తగ్గాయి. వారం వారీగా పప్పుదినుసుల కోసం అఖిల భారత సగటు రిటైల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇటీవలి వారాల్లో మండీ ధరలలో నెలకొన్న తగ్గుదల ధోరణి ప్రస్తుత రిటైల్ ధరల్లో కనిపిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2040520)
आगंतुक पटल : 180