నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

భార‌త‌దేశంలో నైపుణ్యాభివృద్ధి, విద్య‌, ఉద్యోగ‌, వ్య‌వ‌స్థాప‌క‌త రంగాల‌ను స‌మీకృతం చేసే డిజిట‌ల్ వేదిక స్కిల్ ఇండియా డిజిట‌ల్ హ‌బ్‌


ఏకీకృత స్కిల్ ఇండియా డిజిట‌ల్ వేదిక‌

Posted On: 31 JUL 2024 1:47PM by PIB Hyderabad

 

నైపుణ్యాభివృద్ధిలో డిజిట‌ల్ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చే దిశ‌గా 2023 సెప్టెంబ‌రులో ప్ర‌భుత్వం స్కిల్ ఇండియా డిజిట‌ల్ హ‌బ్‌ను ప్రారంభించ‌డం ద్వారా కీల‌క‌మైన అడుగు వేసింది. స్కిల్ ఇండియా డిజిట‌ల్ హ‌బ్‌(ఎస్ఐడీహెచ్‌) అనేది భార‌త‌దేశంలో నైపుణ్యాభివృద్ధి, విద్య‌, ఉద్యోగ‌, వ్య‌వ‌స్థాప‌క‌త రంగాల‌ను స‌మీకృతం చేసే డిజిట‌ల్ వేదిక‌. నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు, ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన నైపుణ్య శిక్ష‌ణ‌, ఉద్యోగ అవ‌కాశాలు, వ్య‌వ‌స్థాప‌కత స‌హ‌కారం పొందేందుకు స‌మ‌గ్ర‌మైన‌, సులువైన వేదిక‌గా ఉండాల‌నేది దీని ప్రాథ‌మిక ఉద్దేశం. నైపుణ్య అవ‌కాశాలకు ఎస్ఐడీహెచ్ ఒక డిజిట‌ల్ రూపం. భాగ‌స్వామ్య‌ప‌క్షాలకు ఇది డిజిట‌ల్ జాబ్ ఎక్స్‌చేంజ్ క‌లిగిన‌ స‌మీకృత వేదిక‌. స్కిల్ ఇండియా, డిజిట‌ల్ ఇండియా అనే రెండు ప్ర‌భుత్వ అతి ముఖ్య‌మైన‌ కార్య‌క్ర‌మాల కూడ‌లి ఎస్ఐడీహెచ్‌. మొబైల్‌లో వినియోగానికి అనుకూలంగా అభివృద్ధి చేసిన ఎస్ఐడీహెచ్ నైపుణ్యాభివృద్ధికి సంబంధించి వారి ప్రాధాన్య‌త‌లు, ల‌క్ష్యాలకు త‌గిన‌ కోర్సులు, ప‌థ‌కాలు, అప్రెంటీస్‌షిప్‌లు, ఉద్యోగ అవ‌కాశాల అన్వేష‌ణ వంటి ప్ర‌జ‌ల‌ విభిన్న అవ‌స‌రాల‌ను తీరుస్తుంది. డిజిట‌ల్ నైపుణ్యాభివృద్ధి కోసం ఇందులో ప్ర‌త్యేక శిక్ష‌ణ నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌తో పాటు ధ్రువప‌త్రాలు పొందే వెసులుబాటు, వంటివి కూడా ఉన్నాయి. నైపుణ్యాభివృద్ధి, విద్య‌, ఉద్యోగ‌, వ్య‌వ‌స్థాప‌క‌త రంగాల్లో భార‌త‌దేశానికి డిజిట‌ల్ ప్ర‌జా మౌలిక స‌దుపాయం(డీపీఐ)గా సేవ‌లందించాల‌నేది దీని ల‌క్ష్యం.

జూన్, 2024 నాటికి దాదాపు 88 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఎస్ఐడీహెచ్‌లో న‌మోదు చేసుకున్నారు. 9.59 ల‌క్ష‌ల మొబైల్ యాప్ డౌన్‌లోడ్‌లు అయ్యాయి. 7.63 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు వివిధ ఆన్‌లైన్ కోర్సుల్లో చేరారు. ఎస్ఐడీహెచ్‌లో 752 ఆన్‌లైన్ కోర్సులు, 7.37 ల‌క్ష‌ల నిమిషాల డిజిట‌ల్ కంటెంట్ అభ్యాస‌కుల‌కు అందుబాటులో ఉంది. కోర్సుల‌తో పాటు అప్రెంటీస్‌షిప్ అవ‌కాశాల‌ను సైతం ఎస్ఐడీహెచ్ క‌ల్పిస్తుంది. ఎంఎస్ఎంఈతో ఈ వేదిక‌ను అనుసంధానం చేసి, అభ్యాస‌కులు, ఉద్యోగార్థుల‌కు వ్య‌వ‌స్థాప‌క‌త‌కు సంబంధించిన ప‌థ‌కాలను కూడా అందుబాటులోకి తీసుకురావాల‌నేది దీని ఉద్దేశ్యం.

డిజిట‌ల్‌, ఆన్‌లైన్ నైపుణ్య శిక్ష‌ణ కోసం కేంద్ర‌ నైపుణ్యాభివృద్ధి, వ్య‌వ‌స్థాప‌క‌త మంత్రిత్వ శాఖ‌(ఎంఎస్‌డీఈ) ఈ కింది కార్య‌క్ర‌మాల‌ను సైతం చేప‌ట్టింది:
1. ఐటీఐలు, అప్రెంటీస్‌షిప్‌ల ద్వారా అందించే నైపుణ్య శిక్ష‌ణ మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా, అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా మెరుగుప‌ర్చాల‌నే ఉద్దేశ్యంతో ఎంఎస్‌డీఈ ఆధ్వ‌ర్యంలోని డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ట్రైనింగ్‌(డీజీటీ) స్కిల్స్ స్త్రెంథెనింగ్ ఫ‌ర్ ఇండ‌స్ట్రియ‌ల్ వాల్యూ ఎన్‌హాన్స్‌మెంట్‌(స్ట్రైవ్‌) అనే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఈ ప్రాజెక్టు కింద రెండు ద‌శల్లో 14 అంశాల‌కు సంబంధించిన డిజిట‌ల్ కంటెంట్‌ను త‌యారుచేసింది. ఐటీఐల్లో లీన‌మైపోయేలా శిక్ష‌ణ వాతావ‌ర‌ణం ఉండాల‌నే ఆలోచ‌న‌తో ఎల‌క్ట్రీషియ‌న్‌, ఫిట్ట‌ర్‌, మెకానిక్ మోటార్ వెహికిల్‌, వెల్డ‌ర్ అంశాల్లో 5 ఐటీఐల‌లో వ‌ర్చువ‌ల్ రియాలిటీ(వీఆర్‌) ప్రాజెక్టును పైల‌ట్ ప‌ద్ధ‌తిలో చేప‌ట్టింది. వీఆర్ ప‌ద్ధ‌తిలో శిక్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ను సైతం స‌మీక‌రించడం కూడా ఇందులో భాగం.

2. డిజిట‌ల్ నైపుణ్యాభివృద్ధికి సాయంగా ఉండేలా ఇ-బుక్స్‌, క్వ‌శ్చ‌న్ బ్యాంకులు, ఇ-లెర్నింగ్ వీడియోలు వంటి విద్యాసంబంధ‌మైన మెటీరియ‌ల్‌ను 12 ప్రాంతీయ‌ భాష‌ల్లో అందుబాటులోకి తీసుకువ‌స్తూ భార‌త్‌స్కిల్స్ పోర్ట‌ల్‌ను ప్రారంభించింది. ప్ర‌స్తుతం ఈ పోర్ట‌ల్‌లో దాదాపు 553 ఇ-బుక్స్‌, 337 క్వ‌శ్చ‌న్ బ్యాంకులు, 190 స్ట‌డీ మెటీరియ‌ల్ వీడియోలు, 6201 ఇ-లెర్నింగ్ వీడియోలు 12 ప్రాంతీయ భాష‌ల్లో అందుబాటులో ఉన్నాయి.

3. ఐబీఎం, సిస్కో, అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్‌(ఏడ‌బ్ల్యూఎస్‌), మైక్రోసాఫ్ట్ వంటి ప్ర‌ఖ్యాత ఐటీ కంపెనీల‌తోనూ డీజీటీ ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. కృత్రిమ మేధ‌(ఏఐ), బిగ్ డాటా అనాల‌సిస్‌(బీడీఏ), బ్లాక్‌చైన్‌, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అనేక అధునాత‌న సాంకేతిక‌త‌ల‌తో సాంకేతిక‌, వృత్తిప‌ర‌మైన‌ నైపుణ్య శిక్ష‌ణ అందించ‌డానికి గానూ ఈ భాగ‌స్వామ్యాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ శిక్ష‌ణ భార‌త్‌స్కిల్స్ పోర్ట‌ల్ (https://bharatskills.gov.in) ద్వారా అందుబాటులో ఉంది. 23.7 ల‌క్ష‌ల ట్రెయినీల కోసం, వారిని ప‌రిశ్ర‌మ‌కు సిద్దంగా చేసే కోర్సుల‌తో రూపొందించిన కేంద్ర వేదిక ఇది.

4. అద‌నంగా, ఐబీఎం భాగ‌స్వామ్యంతో కార్పొరేట్ సామాజిక బాధ్య‌త‌(సీఎస్ఆర్‌) కింద దేశ‌వ్యాప్తంగా 15 జాతీయ నైపుణ్య శిక్ష‌ణ సంస్థ‌ల(ఎన్ఎస్‌టీఐ)లో ఐటీ, నెట్‌వ‌ర్కింగ్‌, క్లౌడ్ కంప్యూటింగ్‌లో 2 ఏళ్ల వ్య‌వ‌ధి గ‌ల అడ్వాన్స్డ్ డిప్లొమా(వొకేష‌న‌ల్) కొర్సును కూడా అందిస్తోంది.

ఈ స‌మాచారాన్ని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్య‌వ‌స్థాప‌క‌త మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి(స్వ‌తంత్ర హోదా) శ్రీ జ‌యంత్ చౌద‌రి రాజ్య‌స‌భ‌లో బుధవారం(31.07.2024) రాత‌పూర్వ‌కంగా ఇచ్చారు.

***



(Release ID: 2039672) Visitor Counter : 86