సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024 జూలై 15 నుంచి 26 వరకు న్యూఢిల్లీలోని జాతీయ సుపరిపాలన కేంద్రం(ఎన్సీజీజీ)లో బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్లకు విజయవంతంగా 72వ సామర్థ్య నిర్మాణ కార్యక్రమం


ముస్సోరి, ఢిల్లీలో 2 వారాల కార్యక్రమంలో పాల్గొన్న వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 45 మంది బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ అధికారులు

2014-2024 మధ్య ఎన్సీజీజీలో సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు హాజరైన 2700 మంది సీనియర్ & మధ్యస్థాయి సివిల్ సర్వెంట్లు

Posted On: 28 JUL 2024 11:21AM by PIB Hyderabad

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్ల కోసం జాతీయ సుపరిపాలన కేంద్రం నిర్వహించిన రెండు వారాల 72వ సామర్థ్య నిర్మాణ కార్యక్రమం న్యూఢిల్లీలో ముగిసింది. అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు, సీనియర్ అసిస్టెంట్ కమిషనర్లు, రెవెన్యూ డిప్యూటీ కమిషనర్లు, ఉపాజిల్లా అధికారులుగా పనిచేస్తున్న 45 మంది అధికారులు హాజరైన ఈ కార్యక్రమం 2024 జూలై 15 నుంచి 26 వరకు ముస్సోరీ, న్యూఢిల్లీలో జరిగింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో బంగ్లాదేశ్, కెన్యా, టాంజానియా, ట్యునీషియా, సీషెల్స్, గాంబియా, మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, లావోస్, వియత్నాం, నేపాల్, భూటాన్, మయన్మార్, ఇథియోపియా, ఎరిత్రియా, కంబోడియా సహా 17 దేశాల సివిల్ సర్వెంట్లకు జాతీయ సుపరిపాలన కేంద్రం శిక్షణ ఇచ్చింది.

ముగింపు సమావేశంలో ఎన్సీజీజీ డైరెక్టర్ జనరల్, పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్పీజీ) కార్యదర్శి వి.శ్రీనివాస్ ప్రసంగించారు. శ్రీ వి.శ్రీనివాస్ తన ముగింపు ప్రసంగంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య అభివృద్ధి భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ అధికారులకు కొత్త పాలన నమూనాలు, కార్యక్రమాలపై ఈ సామర్థ్య నిర్మాణం సాధికారత కల్పించింది. 2014 నుంచి 2024 వరకు విదేశీ మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో, ఢాకాలోని భారత రాయబార కార్యాలయంతో సహకారంతో 2700 మంది బంగ్లాదేశీ సివిల్ సర్వెంట్లకు ఎన్సీజీజీ సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించింది.

ముగింపు సభ సందర్భంగా, కార్యక్రమంలో పాల్గొన్న నాలుగు బృందాలు నాలుగు కీలక అంశాలపై ప్రదర్శన ఇచ్చాయి. అవి: బంగ్లాదేశ్ లో సార్వత్రిక పింఛను పథకం, ప్రధాని పది ప్రత్యేక కార్యక్రమాలు, సుపరిపాలన కోసం ఐదు సాధనాలు, స్మార్ట్ బంగ్లాదేశ్: శ్రేయస్సుకు మార్గం. కోర్సు సమన్వయకర్త, అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఎ.పి. సింగ్ తన స్వాగతోపన్యాసంలో రెండు వారాల ఈ కార్యక్రమ అవలోకనాన్ని అందించారు. బంగ్లాదేశ్‌లోని మిడ్ కెరీర్ ఆఫీసర్‌ల కోసం రెండు దేశాల పాలన నమూనాలు, అనుభవాల వినిమయం కోసం ఈ కార్యక్రమం విలువైన వేదికను అందించిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్సీజీజీ సామర్థ్య నిర్మాణ బృందంతో కలిసి కోర్సు సమన్వయకర్త, అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఎ.పి. సింగ్; కోర్సు సహ సమన్వయకర్త డా. ముఖేశ్ భండారి; ప్రోగ్రామ్ అసిస్టెంట్ శ్రీ బ్రిజేశ్ గుప్త మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎన్సీజీజీ సీఈవో శ్రీమతి ప్రిస్కా పాలీ మాథ్యూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

***


(Release ID: 2038433) Visitor Counter : 54