రాష్ట్రపతి సచివాలయం
‘దర్బార్ హాల్’ కు ‘గణతంత్ర మండపం’ అని, ‘అశోక్ హాల్’ కు ‘అశోక్ మండపం’ అని కొత్త పేరులను పెట్టడమైంది
प्रविष्टि तिथि:
25 JUL 2024 2:05PM by PIB Hyderabad
భారతదేశ రాష్ట్రపతి కార్యాలయంగాను, నివాసం గాను ఉన్న రాష్ట్రపతి భవన్ దేశానికి ఒక ప్రముఖ ప్రతీక కావడంతో పాటు దేశ ప్రజల అమూల్య వారసత్వంగా కూడా ఉంది. ఈ భవనాన్ని ప్రజలకు మరింత ఎక్కువగా అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు నిరంతరంగా జరుగుతూ వస్తున్నాయి. భారతీయ సాంస్కృతిక విలువలకు, నాగరికతకు అద్దం పట్టేవిగా రాష్ట్రపతి భవన్ లోని పరిసరాలను తీర్చిదిద్దే కృషి అదే పనిగా సాగుతోంది.
దీనికి అనుగుణంగా రాష్ట్రపతి భవన్ లో ‘దర్బార్ హాల్’ , ‘అశోక్ హాల్’ అనే పేరులతో ఉన్న రెండు ప్రముఖ పెద్ద గదులకు ఆ యా పేరులను మార్చివేసి వాటికి వరుసగా ‘గణతంత్ర మండపం’, ‘అశోక్ మండపం’ అని కొత్త పేరులను పెట్టినట్లు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సహర్షంగా తెలియజేశారు.
‘దర్బార్ హాల్’ ముఖ్యమైన కార్యక్రమాల కు నెలవు. ఇక్కడ జాతీయ పురస్కారాల ప్రదానం వంటి వేడుకలు ఈ హాల్ లో జరుగుతాయి. ‘దర్బార్’ అనే మాట భారతీయ పాలకులతో పాటు బ్రిటిషు వారి న్యాయస్థానాలు, సభలకు సూచికగా ఉన్నది. భారతదేశం గణతంత్రంగా మారిన తరువాత ఈ మాట కు పొంతన లేకుండా పోయింది. ‘గణతంత్రం’ అనే భావన ప్రాచీన కాలం నుంచి భారతీయ సమాజంలో వేళ్లూనుకొంది. దీనితో ఈ హాల్ కు ‘గణతంత్ర మండపం’ అనే పదం చక్కగా సరిపోయింది.
‘అశోక్ హాల్’ మౌలికంగా చాలా మంది నృత్యం చేయడానికి తగినంత చోటు ఉన్న పెద్ద గది (బాల్ రూమ్). ‘అశోక్’ అనే మాట ‘‘అన్ని రకాల బాధల నుంచి విముక్తిని పొందిన’’ వ్యక్తి , లేదా ‘‘ఎలాంటి శోకానికి లోను కాని’’ వ్యక్తి అనే అర్థాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా, ‘అశోక’ అనే పదం ఏకతకు, శాంతియుత సహజీవనానికి ప్రతీకగా నిలచిన అశోక చక్రవర్తి ని కూడా స్ఫురణకు తీసుకు వస్తుంది. అశోకుడు సారనాథ్ లో స్థాపించిన నాలుగు సింహాల తో కూడిన స్తంభం భారతదేశ గణతంత్రానికి జాతీయ చిహ్నం. అశోక అనే మాట భారతీయ మత సంబంధ సంప్రదాయాల తో పాటు కళల్లోనూ, సంస్కృతిలోనూ ప్రగాఢ ప్రాముఖ్యం కలిగిన అశోక వృక్షానికి కూడా సంకేతంగా ఉంది. ‘అశోక్ హాల్’ పేరును మార్చివేసి ‘అశోక్ మండపం’ గా వ్యవహరించడం భాషలో ఏకరూపత ను తీసుకు రావడంతో పాటుగా ఆంగ్లీకరణ గుర్తులను రూపుమాపి, అదే కోవలో ‘అశోక్’ అనే పదంతో ముడిపడ్డ మౌలిక విలువలను స్థిరపరచడమే అవుతుంది.
***
(रिलीज़ आईडी: 2037384)
आगंतुक पटल : 136