నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఉపాధి అవకాశాలను పెంచేందుకు, 4.1 కోట్ల యువత నైపుణ్య శిక్షణకు రూ.2 లక్షల కోట్లతో ప్రధానమంత్రి ప్యాకేజీ
కార్మిక సంక్షేమం కోసం ఇ-శ్రామ్ పోర్టల్ అనుసంధానం, శ్రామ్ సువిధ, సమాధాన్ పోర్టళ్ల పునరుద్ధరణ
ఉపాధి, నైపుణ్యాల పెంపు: 2024-25 బడ్జెట్ కీలకాంశాలు
గౌరవ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన 2024-25 కేంద్ర బడ్జెట్‌లో దేశంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు కీలక ప్రయత్నాలు ఉన్నాయి. బడ్జెట్ ప్రాధాన్యతల్లో ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి ప్రధానంగా ఉన్నాయి.
Posted On:
25 JUL 2024 10:47AM by PIB Hyderabad
ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా దాదాపు రూ.2 లక్షల కోట్ల భారీ వ్యయంతో ఐదు పథకాలు, కార్యక్రమాలను ప్రకటించారు. ఐదేళ్ల పాటు 4.1 కోట్ల యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, ఇతర అవకాశాల కల్పనకు ఈ ప్యాకేజీ తోడ్పడనుంది. నైపుణ్యాభివృద్ధి, కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యం పెంచడం, ఎంఎస్ఎంఈలకు సహకారాన్ని అందించడం, మూలధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి కల్పనకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఈ పథకాల లక్ష్యం. ఇవన్నీ సమిష్టిగా దేశ ఉపాధి రంగంపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.
ఈ ఐదు పథకాల్లో మూడు పథకాలు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ద్వారా అమలవుతాయి. ఉద్యోగులతో పాటు యాజమానులకు సైతం ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఈ పథకాలు శ్రామికశక్తి క్రమబద్దీకరణను ప్రోత్సహిస్తాయి. మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారిని గుర్తించడంతో పాటు వారికి, యాజమానులకు సమగ్రమైన సహకారాన్ని అందించడం కోసం ఈ ఉద్యోగ కల్పన ప్రోత్సాహకాలను రూపొందించారు.
మొదటి పథకం: ఈపీఎఫ్ఓతో నమోదై ఉన్న సంఘటిత రంగంలోని మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఉద్దేశించినది. వీరికి ఒక నెల వేతనం(రూ.15,000 వరకు) మూడు వాయిదాల్లో ప్రభుత్వం చెల్లిస్తుంది.
రెండో పథకం: తయారీ రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి గానూ తొలిసారి ఉద్యోగంలో చేరిన వారు మొదటి నాలుగేళ్లలో చెల్లించిన ఈపీఎఫ్ఓ మొత్తం ఆధారంగా ఉద్యోగులకు, యాజమానులకు ప్రోత్సాహకం అందిస్తుంది. నెలకు రూ.1 లక్ష వరకు వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు.
మూడో పథకం: అదనంగా ఉద్యోగాలు కల్పించే యాజమానులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది. నెలకు రూ.1 లక్ష వరకు వేతనంతో పని చేసే ఒక్కో కొత్త ఉద్యోగిపై ఈపీఎఫ్ఓలో యాజమాని జమ చేసే మొత్తాన్ని నెలకు రూ.3,000 వరకు రెండేళ్ల పాటు ప్రభుత్వం తిరిగి యాజమానికి చెల్లిస్తుంది.
నైపుణ్య అవసరాలు, ఉద్యోగాలను ఒకే వేదికపై సులభంగా పొందేందుకు, యాజమానులు, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో ఉద్యోగార్ధులను అనుసంధానం చేయడం కోసం ఒకేచోట పరిష్కారంగా ఇ-శ్రామ్ పోర్టల్‌ను ఇతర వేదికలతో అనుసంధానించడం లాంటి కార్మిక సంక్షేమం కోసం ప్రధానమైన సంస్కరణలను బడ్జెట్ పరిచయం చేసింది. కార్మిక సంక్షేమం, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి వంటి వాటి కోసం ఇ-శ్రామ్ పోర్టల్ చూపేందుకు ఉపయోగపడుతుంది.
పారిశ్రామిక ప్రమాణ ప్రక్రియలను క్రమబద్దీకరించడం, కార్మికుల కోసం ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయడానికి గానూ శ్రామ్ సువిధ, సమాధాన్ పోర్టళ్ల పునరుద్ధరణకు కీలకమైన ప్రకటన సైతం బడ్జెట్‌లో చేశారు.
ప్రధానమంత్రి ప్యాకేజీలోని మిగతా రెండో పథకాలు.. నైపుణ్యాలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలను పెంచి, తద్వారా ఉద్యోగ అవకాశాలను పెంపొందించేందుకు ఉద్దేశించినవి:
నాలుగో పథకం: రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ భాగస్వామ్యంతో ఐదేళ్ల పాటు దాదాపు 20 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేందుకు కొత్తగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. దీంతో పాటు పరిశ్రమ నైపుణ్య అవసరాలకు తగ్గట్టుగా 1,000 పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)ను ఆధునీకరిస్తారు.
ఐదో పథకం: రానున్న ఐదేళ్లలో 500 అత్యున్నత సంస్థల్లో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించడం. ఇందుకు గానూ ఇంటర్న్‌షిప్ భత్యంగా నెలకు రూ.5,000, ఒకసారి ప్రోత్సాహకంగా రూ.6,000 ప్రభుత్వం చెల్లిస్తుంది. పనిప్రదేశాల్లో పరిస్థితులను, వృత్తిపరమైన వాతావరణాన్ని తెలుసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.
కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకు గానూ పరిశ్రమ సహకారంతో ఉద్యోగం చేసే మహిళల కోసం వర్కింగ్ వుమెన్ హాస్టళ్లు, శిశుసంరక్షణ కేంద్రాల ఏర్పాటును బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీంతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, స్వయం సహాయ సంఘాల(ఎస్‌హెచ్‌జీ) వ్యాపారాలకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తారు.
వీటితో పాటు విభిన్న, పటిష్టమైన ఉద్యోగ మార్కెట్‌ను పెంచేందుకు గానూ బడ్జెట్‌లో పలు కార్యక్రమాలను ప్రకటించారు. వీటిలో:
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా ఉపాధి సృష్టించడం: మూలధన వ్యయం గణనీయంగా 11 శాతానికి పెంచి, రూ.11.11 లక్షల కోట్లను వెచ్చించాలనే నిర్ణయం వల్ల నిర్మాణ, రవాణా, లాజిస్టిక్స్ వంటి వేర్వేరు రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చని ఆశిస్తున్నారు. దీని ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం, తక్కువ ఉపాధి అవకాశాల సమస్యలను పరిష్కరించవచ్చని భావిస్తున్నారు.
వ్యాపారాలను ప్రోత్సహించడం: స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈకు ఆర్థిక సహకారాన్ని, పన్ను ప్రయోజనాలను అందించడం ద్వారా వ్యాపార దృక్పథాన్ని పెంచి విభిన్న ఉపాధి అవకాశాలను సృష్టించడం.
గ్రామీణ ఉద్యోగ, జీవనోపాధి: ఎంజీఎన్ఆర్ఈజీఏకు నిధులను పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు గ్రామీణ సమాజాలకు చేయూతను అందించడం, పట్టణ ప్రాంతాలకు వలసలను తగ్గించేలా చూడటం.
తయారీ, సేవా రంగాలను ప్రోత్సహించడం: 100 నగరాల్లో ఉత్పత్తికి సిద్ధంగా ఉండేలా “ప్లగ్ ఆండ్ ప్లే” పారిశ్రామిక పార్కులను ఏర్పాటుతో పాటు జాతీయ పారిశ్రామిక నడవా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 12 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం, తద్వారా లక్షల్లో ఉద్యోగాలు సృష్టించడం.
సుస్థిరాభివృద్ధి, అపారమైన ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం, నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వికసిత్ భారత్‌కు బలమైన సామాజిక సంక్షేమ పునాది వేయడం కోసం దృఢమైన నిబద్ధత 2024-25 బడ్జెట్లో ప్రతిబింబించింది.
***
(Release ID: 2036821)
Visitor Counter : 176