హోం మంత్రిత్వ శాఖ
కొత్త నేర విచారణ చట్టాల్లో సంక్లిష్టత
Posted On:
24 JUL 2024 5:15PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా మూడు కొత్త నేర విచారణ చట్టాలు- ‘‘భారతీయ న్యాయ సంహిత-2023 (బిఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023 (బిఎన్ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియం-2023 (బిఎస్‌ఎ) 2024 జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయి. అయితే, ‘బిఎన్ఎస్’ లోని సెక్షన్ 160 కింద సబ్ సెక్షన్ (2) అమలును మాత్రం మినహాయించారు. అదేవిధంగా ‘బిఎన్ఎస్ఎస్’లోనూ ‘బిఎన్ఎస్’ 106(2) వర్తింపును మినహాయించారు. మొత్తం మీద దేశంలో ఈ మూడు చట్టాల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 25న అధికార ప్రకటన జారీ చేసింది. ఆ వెంటనే వీటి సమర్థ అమలు లక్ష్యంగా పోలీసు, జైళ్లు, ప్రాసిక్యూటర్లు, న్యాయ, ఫోరెన్సిక్ నిపుణులు, ప్రజలు సహా భాగస్వామ్య వ్యవస్థల సిబ్బందికి అవగాహన కల్పన కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించింది.
ఇందులో భాగంగా ‘‘బిఎన్ఎస్, బిఎన్ఎస్‌ఎస్, బిఎస్ఎ’’ అమలుపై భాగస్వామ్య వ్యవస్థల సిబ్బందికి శిక్షణ కోసం కింది చర్యలు చేపట్టింది:
- కొత్త చట్టాల అమలులో వివిధ భాగస్వామ్య వ్యవస్థల సిబ్బంది సామర్థ్యం పెంపు లక్ష్యంగా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బిపిఆర్ & డి) 13 శిక్షణ మాడ్యూళ్లను రూపొందించింది. వీటిని- పోలీసు, జైళ్లు,, ప్రాసిక్యూటర్లు, న్యాయాధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, కేంద్ర పోలీస్ సంస్థలు తదితరాలకు అందజేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ‘బోధక శిక్షకుల’ (మాస్టర్ ట్రెయినర్స్)కు శిక్షణ ఇవ్వడం కోసం ‘ట్రెయినింగ్ ఆఫ్ ట్రెయినర్స్’ నమూనాను బ్యూరో అనుసరించింది. దీనికి అనుగుణంగా భోపాల్‌లోని సెంట్రల్ అకాడమీ ఫర్ పోలీస్ ట్రైనింగ్ (సిఎపిటి)సహా హైదరాబాద్, కోల్‌కతా, చండీగఢ్, జైపూర్, ఘజియాబాద్, బెంగళూరు నగరాల్లోని ‘సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్’ (సిడిఐటి)ల ద్వారా ‘బోధక శిక్షకులకు’ శిక్షణ ఇస్తారు. మరోవైపు ‘బిపిఆర్&డి’ మొత్తం 274 శిక్షణ కోర్సులు/వెబినార్లు/సెమినార్లను కూడా నిర్వహించింది. ఈ మేరకు బోధక శిక్షకులు సహా ఇప్పటిదాకా 43,150 మంది అధికారులు/సిబ్బంది శిక్షణ పొందారు. అలాగే కొత్త నేర విచారణ చట్టాల అమలులో క్షేత్రస్థాయి కార్యనిర్వాహక సిబ్బంది సందేహాలు తీర్చడంతోపాటు సమస్యల పరిష్కారానికి న్యాయ-పోలీసు శాఖల అధికారుల బృందంతో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. ఇక రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ‘బిపిఆర్&డి’ సమన్వయంతో తమ పరిధిలో 8,40,465 మంది అధికారులకు శిక్షణనిచ్చాయి. వీరిలో 8,16,146 మంది పోలీసు, జైళ్లు, ఫోరెన్సిక్స్, జుడిషియల్, ప్రాసిక్యూషన్ విభాగాల అధికారులు, సిబ్బంది కూడా ఉన్నారు.
- మూడు కొత్త చట్టాలపై అధికారులకు శిక్షణ కోసం ఐగాట్ (iGOT)-కర్మయోగి భారత్ పోర్టల్ కూడా 2024 ఫిబ్రవరి 21 నుంచి మూడు కోర్సులు [‘బిఎన్ఎస్, బిఎన్ఎస్‌ఎస్, బిఎస్‌ఎ’ల పరిచయం] నిర్వహిస్తోంది. అమలు చేస్తోంది. ఈ కోర్సుల పురోగతి కిందివిధంగా ఉంది:
- కనీసం ఒక కోర్సు పూర్తిచేసిన అధికారుల సంఖ్య: 2,19,829.
- మూడు కోర్సులూ పూర్తిచేసిన అధికారుల సంఖ్య: 1,72,970.
- అంతేకాకుండా క్షేత్రస్థాయి ప్రాక్టీషనర్ల కోసం [‘బిఎన్ఎస్, బిఎన్ఎస్‌ఎస్, బిఎస్‌ఎ’లపై స్థూల అవగాహన] ఐగాట్ (iGOT)-కర్మయోగి భారత్ పోర్టల్ వేదికలో ‘బిపిఆర్&డి’ కూడా 3 కొత్త కోర్సులను అప్‌లోడ్ చేసింది.
కొత్త చట్టాలు ‘బిఎన్ఎస్, బిఎన్ఎస్‌ఎస్, బిఎస్‌ఎ’లలోని నిబంధనలతోపాటు మునుపటి సమాంతర ‘ఐపిసి, సిఆర్‌పిసి, ఐఇఎ’ (భారత సాక్ష్య చట్టం) చట్టాల నిబంధనలను కూడా ‘ఎన్‌సిఆర్‌బి’ వెబ్ అనువర్తనం ‘సంకలన్’ (https://ncrb.gov.in/uploads/SankalanPortal/Index.html)లో పొందుపరిచారు. కాగా, కొత నేర విచారణ చట్టాల్లోని కొన్ని కీలక ముఖ్యాంశాలు కింది అనుబంధంలో ఉన్నాయి.
అలాగే కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి:
- పత్రికా సమాచార సంస్థ (పిఐబి) విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఈ మేరకు కొత్త నేర విచారణ చట్టాలపై సూచన పత్రాలు, పత్రికా ప్రకటనలు, సమాచార చిత్రాలు (ఇన్ఫోగ్రాఫిక్స్) వగైరాల ద్వారా సామాజిక మాధ్యమ వేదికలలో ప్రాచుర్యం కల్పించింది. అలాగే కొత్త చట్టాల్లోని ప్రధానాంశాలపై చర్చకు వీలుగా దేశంలోని 27 రాష్ట్రాల రాజధాని నగరాల్లో... ముఖ్యంగా ప్రాంతీయ మాధ్యమాల కోసం చర్చాగోష్ఠులు (వార్తాలాప్) కూడా నిర్వహించింది.
- ఆకాశవాణి (ఆలిండియా రేడియో), దూరదర్శన్ కూడా వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాలు నిర్వహించాయి. ఈ మేరకు కొత్త నేర విచారణ చట్టాల సంబంధిత వార్తా కథనాలు, కార్యక్రమాలు సహా న్యాయశాస్త్ర నిపుణులతో చర్చాగోష్ఠులతోపాటు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా కూడా ప్రచారం కల్పించాయి. ఇవేకాకుండా సమగ్ర వివరణాత్మక వీడియోల ద్వారా కూడా ప్రజలకు అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాయి.
- పరివర్తనాత్మక భారతం (ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా) వెబ్‌సైట్ సహా తన సామాజిక మాధ్యమ విభాగాల్లో సచిత్ర సమాచార ప్రకటనల అప్‌లోడ్ ద్వారా ‘మైగవ్’ (MyGov) కూడా తనవంతు కృషి చేసింది. అంతేగాక పౌర అవగాహన లక్ష్యంగా 2024 ఫిబ్రవరి 19న దాదాపు 7 కోట్ల మందికిపైగా ప్రజలకు ఇ-మెయిల్ పంపింది. మరోవైపు తన వేదిక ద్వారా అవగాహన కల్పన, పౌర భాగస్వామ్యం నిమిత్తం 2024 మార్చి 14, జూన్ 12 తేదీల్లో ఒక ప్రశ్న-జవాబుల కార్యక్రమం కూడా నిర్వహించింది.
- పరివర్తనాత్మక సంస్కరణలు: ప్రజలపై... ముఖ్యంగా మహిళలు/పిల్లలపై వాటి సానుకూల ప్రభావం గురించి పౌరులకు వివరించేందుకు కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖలు హిందీ భాషలో సంయుక్త వెబినార్ నిర్వహించాయి. ఈ మేరకు 2024 జూన్ 21న ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు 40 లక్షల మంది క్షేత్రస్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. అటుపైన 2024 జూన్ 25న ఆంగ్ల భాషలో నిర్వహించిన మరో వెబినార్‌లో దాదాపు 50 లక్షల మంది పాలుపంచుకున్నారు.
- విశ్వవిద్యాలయ నిధి వితరణ సంస్థ (యుజిసి) దేశంలోని 1,200 విశ్వవిద్యాలయాలు, 40వేల కళాశాలలకు సచిత్ర సమాచార ప్రకటనలను జారీచేసింది. కొత్త నేర చట్టాలపై అధ్యాపకులు, విద్యార్థులకు అవగాహన కోసం అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఎఐసిటిఇ) దాదాపు 9,000 సంస్థలకు సూచన పత్రాలు పంపింది. తదనుగుణంగా ఉన్నత విద్యా సంస్థలు 2024 జూలై 1న నిర్దిష్ట బృందాలతో చర్చాగోష్ఠులు, కార్యశాలలు, సదస్సులు, క్విజ్‌ల వంటి కార్యక్రమాలను రోజు పొడవునా నిర్వహించాయి. విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది విస్తృత భాగస్వామ్యంతో కొత్త నేర విచారణ చట్టాల్లోని వివిధ నిబంధనలు, వాటితో వచ్చిన కీలక పరివర్తన గురించి ఈ సందర్భంగా విశదీకరించారు.
- కేంద్ర న్యాయ వ్యవహారాల విభాగం దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు గువహటి, కోల్‌కతా, చెన్నై, ముంబై నగరాల్లో పోలీసు, న్యాయవ్యవస్థ, ప్రాసిక్యూషన్, జైళ్ల ప్రతినిధులతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నిపుణులతో ఐదు సమావేశాలు నిర్వహించింది.
- దేశవ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలోనూ 2024 జూలై 1న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగస్వామ్య సంస్థలకు, ప్రజలకు కొత్త నేర విచారణ చట్టాల్లోని ముఖ్యాంశాలను వివరించే ద్విభాషా కరదీపికను ప్రదర్శించారు.
అనుబంధం
కొత్త నేర విచారణ చట్టాల్లోని ముఖ్యాంశాలు
కొత్త నేర విచారణ చట్టాలను భారత పౌరులకు సాధికారత కల్పనకు ఉద్దేశించిన కీలక ముందడుగుగా పరిగణించవచ్చు. ప్రతిఒక్కరికీ మరింత సౌలభ్యం, సహాయంతోపాటు సమర్థ న్యాయ వ్యవస్థను అందుబాటులో ఉంచడం ఈ కొత్త చట్టాల లక్ష్యం. వ్యక్తిగత హక్కులు-రక్షణలపై కొత్త చట్టాల్లోని నిబంధనల ప్రభావాన్ని ప్రముఖంగా వివరించే కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:
- సంఘటనల ఆన్‌లైన్ నివేదన: పౌరులు ఇకపై నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ సమాచార (ఆన్‌లైన్) మార్గంలో సంఘటనలను నివేదించవచ్చు. ఇది సులభ, తక్షణ నివేదన మార్గం కావడం వల్ల పోలీసుల సత్వర చర్యకూ సౌలభ్యం ఉంటుంది.
- ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ఎఫ్‌ఐఆర్ దాఖలు: ‘జీరో ఎఫ్‌ఐఆర్’ విధానంతో అధికార పరిధితో సంబంధం లేకుండా పౌరులు ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేయవచ్చు. తద్వారా నేర సంఘటనపై సత్వర నివేదనతోపాటు చట్టపరమైన చర్యలు చేపట్టడంలో ఇకపై జాప్యం ఉండదు.
- ఎఫ్ఐఆర్ నకలు ఉచితం: చట్టపరమైన ప్రక్రియలో బాధితుల భాగస్వామ్యానికి భరోసాగా ఎఫ్ఐఆర్ నకలు ఉచితంగా పొందే వెసులుబాటు.
- అరెస్టు సమాచారం ఇచ్చే హక్కు: అరెస్టయిన వ్యక్తి సదరు సమాచారాన్ని, తన పరిస్థితిని తనకు నచ్చిన వ్యక్తికి తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా అరెస్టయ్యే వ్యక్తులకు తక్షణ మద్దతు, సహాయానికి భరోసా లభిస్తుంది.
- అరెస్టు సమాచార ప్రదర్శన: అరెస్టు వివరాలను ఇకపై పోలీసు స్టేషన్లు, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాల్లో ప్రాధాన్యంతో ప్రదర్శించాల్సి ఉంటుంది. దీనివల్ల అరెస్టయిన వ్యక్తి కుటుంబం, బంధుమిత్రులకు కీలక సమాచారం సులువుగా లభ్యమవుతుంది.
- ఫోరెన్సిక్ సాక్ష్యాల సేకరణ-వీడియోగ్రఫీ: తీవ్ర నేరాల కేసులు సహా దర్యాప్తు బలోపేతం దిశగా ఫోరెన్సిక్ నిపుణులు నేర ప్రదేశాలకు సత్వరం చేరుకుని, సాక్ష్యాలు సేకరించడం తప్పనిసరి. దీంతోపాటు సాక్ష్యాల తారుమారుకు వీల్లేకుండా నేర ప్రదేశంలో సాక్ష్యాధారాల సేకరణ ప్రక్రియ మొత్తం వీడియో తీయడం కూడా తప్పనిసరి. ఈ ద్వంద్వ విధానం వల్ల నేర పరిశోధన నాణ్యత, విశ్వసనీయత గణనీయంగా పెరుగుతాయి. తద్వారా నిష్పాక్షిక న్యాయ ప్రదానానికి వీలుంటుంది.
- సత్వర విచారణ ప్రక్రియ: మహిళలు-బాలలపై నేరాల సంబంధిత కేసుల విచారణకు కొత్త చట్టాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ మేరకు సమాచారం నమోదు చేసిన రెండు నెలల్లోగా దర్యాప్తు పూర్తికావాల్సి ఉంటుంది.
- బాధితులకు కేసు ప్రగతి సమాచారం: బాధితులకు 90 రోజుల్లోగా తమ కేసు విచారణ పురోగమన సమాచారం తెలుసుకునే హక్కు ఉంటుంది. ఈ నిబంధన వల్ల బాధితులకు సకాలంలో సమాచారం అందుతుంది. తద్వారా చట్టపరమైన ప్రక్రియలో వారి భాగస్వామ్యంతోపాటు పారదర్శకత, నమ్మకం ఇనుమడిస్తాయి.
- బాధితులకు ఉచిత చికిత్స: మహిళలు-బాలలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రులలో ఉచిత ప్రథమ చికిత్స లేదా ఉన్నత వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి. ఈ నిబంధన వల్ల బాధితులకు తక్షణ వైద్య సంరక్షణ సౌలభ్యం ఉంటుంది. తద్వారా సంక్లిష్ట సమయంలో బాధితుల శ్రేయస్సుకు, వారు త్వరగా కోలుకోవడానికి వీలుంటుంది.
- ఎలక్ట్రానిక్ సమన్లు: ఇకపై సమన్లన్నీ ఎలక్ట్రానిక్ మార్గంలో జారీ అవుతాయి. తద్వారా చట్టపరమైన ప్రక్రియల్లో వేగం పెరుగుతుంది. దీంతోపాటు రాతపని తగ్గి, కేసుతో ప్రమేయంగల కక్షిదారులందరి మధ్య సమగ్ర సమాచార ప్రదానం సాధ్యమవుతుంది.
- మహిళా మేజిస్ట్రేట్ ద్వారా వాంగ్మూలం నమోదు: మహిళలపై నిర్దిష్ట నేరాల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని వీలైనంత వరకూ మహిళా మేజిస్ట్రేట్ నమోదు చేసేలా చూడాలి. వీలుకాని పక్షంలో ఒక మహిళ సమక్షాన పురుష మేజిస్ట్రేట్ నమోదు చేయవచ్చు. తద్వారా బాధితులకు మనోనిబ్బరం కల్పించే వాతావరణంతోపాటు నిష్పాక్షికత, సత్వర న్యాయ ప్రదానానికి భరోసా ఉంటుంది.
- పోలీసు నివేదిక-ఇతర పత్రాల ప్రదానం: నిందిత-బాధిత పక్షాలు రెండింటికీ 14 రోజుల్లోగా ఎఫ్ఐఆర్, పోలీసు నివేదిక/అభియోగపత్రం, వాంగ్మూలాలు, అంగీకార ప్రకటనలు, ఇతరత్రా పత్రాల నకళ్లు పొందే హక్కు ఉంటుంది.
- పరిమిత వాయిదాలు: కేసుల విచారణలో అనవసర జాప్యం నివారణ, సకాలంలో న్యాయ ప్రదానం దిశగా కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే ఇవ్వవచ్చు.
- సాక్షుల రక్షణ ప్రణాళిక: కొత్త చట్టాల నిర్దేశం ప్రకారం- సాక్షుల భద్రత, సహకారానికి భరోసాతోపాటు చట్టపరమైన ప్రక్రియల విశ్వసనీయత, ప్రభావం పెంపు దిశగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సాక్షుల రక్షణ ప్రణాళికను అమలు చేయాలి.
- లింగ సార్వజనీనత: ‘‘లింగం’’ నిర్వచనం కింద కొత్త చట్టాల్లో సమానత్వం, సార్వజనీనతలకు ప్రాధాన్యమిస్తూ లింగమార్పిడి వ్యక్తులను కూడా చేర్చారు.
- అన్ని ప్రక్రియలలో ఎలక్ట్రానిక్ విధానం: చట్టపరమైన అన్ని ప్రక్రియలూ ఎలక్ట్రానిక్ విధానంలో నిర్వహించడం ద్వారా కేసుల విచారణలో బాధితులు, సాక్షులు, నిందితులకు కొత్త చట్టాలు సౌలభ్యం కల్పిస్తాయి. తద్వారా చట్టపరమైన ప్రక్రియలన్నీ క్రమబద్ధం కావడంతోపాటు వేగం పుంజుకుంటాయి.
- వాంగ్మూలాల ఆడియో-వీడియో రికార్డింగ్: అత్యాచార కేసుల దర్యాప్తులో బాధితులకు మరింత రక్షణ, పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు ఆడియో-వీడియో మాధ్యమాల ద్వారా రికార్డ్ చేయాలి.
- స్టేషన్ హాజరీ నుంచి మినహాయింపు: మహిళలతోపాటు 15 ఏళ్ల లోపు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, దివ్యాంగులు లేదా తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి పోలీస్ స్టేషన్ హాజరీ నుంచి మినహాయింపు ఉంటుంది.
- మహిళలు-బాలలపై నేరాలు: దేశవ్యాప్తంగా మహిళలు-బాలలపై నేరాల్లో బాధితులకు సంపూర్ణ రక్షణ, న్యాయ ప్రదానం లక్ష్యంగా ‘బిఎన్ఎస్’లో ప్రత్యేక అధ్యాయాన్ని జోడించారు.
- లింగ-తటస్థత: మహిళలు-బాలలపై వివిధ నేరాలను ‘బిఎన్ఎస్’లో లింగ-తటస్థ పద్ధతిలో నిర్వచించారు. కాబట్టి లింగంతో నిమిత్తం లేకుండా బాధితులు-నేరస్థులందరికీ ఇది వర్తిస్తుంది.
- సామాజిక సేవ: కొత్త చట్టాల్లో స్వల్ప నేరాలకు సామాజిక సేవను శిక్షగా విధించే నిబంధనను చేర్చారు. తద్వారా వ్యక్తిత్వ వికాసంతోపాటు సామాజిక బాధ్యతను ప్రోత్సహించే వీలుంటుంది. ఆ మేరకు నేరానికి పాల్పడిన వ్యక్తులు సమాజ శ్రేయస్సుకు సానుకూల రీతిలో తోడ్పడుతూ, తమ తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. ఈ క్రమంలో సమాజంతో వారి సంబంధాలు కూడా బలపడతాయి.
- నేరాలకు అనుగుణంగా జరిమానా: కొత్త చట్టాల్లో కొన్ని నేరాలపై జరిమానాను ఆయా నేర తీవ్రతతో సమాంతరం చేశారు. ఆ మేరకు నిష్పాక్షిక, దామాషా ప్రాతిపదిక శిక్ష విధిస్తారు. తద్వారా భవిష్యత్ నేర నిరోధంసహా న్యాయ వ్యవస్థపై ప్రజా విశ్వాసం కొనసాగే వీలుంటుంది.
- చట్టపరమైన ప్రక్రియలన్నీ సరళం: నిష్పాక్షిక, సులభ న్యాయ ప్రదానం కోసం సులువుగా అర్థం చేసుకుని, అనుసరించగలిగేలా చట్టపరమైన ప్రక్రియలన్నిటినీ సరళీకరించారు.
- సత్వర-సముచిత పరిష్కారం: కొత్త చట్టాలు- కేసుల సత్వర విచారణ, సముచిత న్యాయ ప్రదానానికి భరోసా ఇస్తూ, న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెంచుతాయి.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
****
(Release ID: 2036723)
|