ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూజీలాండ్ ప్రధాని లక్సన్ సంభాషణ


ప్రధానిగా తిరిగి ఎన్నికపై హృదయపూర్వక అభినందనలు తెలిపిన లక్సన్;

ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు.. ప్రజల మధ్య స్నేహబంధంతో పెనవేసుకున్న
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై నిబద్ధతను పునరుద్ఘాటించిన దేశాధినేతలు;

వాణిజ్యం.. పశుపోషణ.. ఔషధ.. అంతరిక్ష.. విద్య
వగైరా రంగాల్లో సహకార విస్తృతికి ప్రధానుల అంగీకారం;

ప్రవాస భారతీయుల ప్రయోజన పరిరక్షణపై ప్రధాని లక్సన్‌కు ప్రధాని
మోదీ ధన్యవాదాలు; వారి భద్రత.. శ్రేయస్సుకు లక్సన్ గట్టి భరోసా

Posted On: 20 JUL 2024 2:37PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూజీలాండ్ ప్రధాని గౌరవనీయ క్రిస్టఫర్ లక్సన్ ఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా భారత సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని  మోదీ మరోసారి ఎన్నిక కావడంపై ప్రధాని లక్సన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

   భారత్-న్యూజీలాండ్ సంబంధాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య స్నేహబంధంతో పెనవేసుకుపోయాయని వారు పేర్కొన్నారు. ద్వైపాక్షిక సహకారాన్ని భవిష్యత్తులో మరింత విస్తృతం చేసే దిశగా తమ దృఢ సంకల్పాన్ని దేశాధినేతలిద్దరూ పునరుద్ఘాటించారు.

   ఉభయ పక్షాల మధ్య ఇటీవలి అత్యున్నత స్థాయి సాన్నిహిత్యంతో బలం పుంజుకున్న సంబంధాలు మరింత పటిష్టం కావాల్సిన అవసరాన్ని వారిద్దరూ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు వాణిజ్యం, ఆర్థిక తోడ్పాటు, పశుపోషణ, ఔషధ, అంతరిక్ష, విద్య తదితర రంగాల్లో పరస్పర ప్రయోజనకర ద్వైపాక్షిక సహకార విస్తరణకు ప్రధానులిద్దరూ అంగీకరించారు.

   న్యూజీలాండ్‌లోని ప్రవాస భారతీయుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రధాని లక్సన్‌ శ్రద్ధ చూపడంపై ప్రధానమంత్రి మోదీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై ప్రధాని లక్సన్ స్పందిస్తూ- భారతీయుల భద్రత, శ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తామని గట్టి భరోసా ఇచ్చారు.

   చివరగా, తరచూ పరస్పర సంభాషణ కొనసాగించేందుకు అధినేతలిద్దరూ నిర్ణయించారు.

***


(Release ID: 2034821) Visitor Counter : 52