రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వాహనం ముందు అద్దానికి ఫాస్టాగ్(FAS Tag) అతికించని వాహనదారులనుంచి రెట్టింపు టోల్ చార్జీలు వసూలు చేయనున్న ఎన్.హెచ్.ఎ.ఐ.
Posted On:
18 JUL 2024 5:53PM by PIB Hyderabad
జాతీయ రహదారుల వినియోగదారులు, ఉద్దేశపూర్వకంగా వాహనం ముందు అద్దానికి ఫాస్టాగ్ అతికించకుండా ప్రయాణించడాన్ని నిరోధించేందుకు, ఎన్.హెచ్.ఎ.ఐ మార్గదర్శకాలను జారీచేసింది. వాహనం ముందు అద్దానికి , లోపలి నుంచి ఫాస్టాగ్ అతికించని వాహనాలు టోల్ లైనులో ప్రవేశించినట్టయితే, అలాంటి వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ చార్జీని వసూలు చేయాలని సూచించింది. ఉద్దేశ పూర్వకంగా వాహనం ముందు అద్దంపై ఫాస్టాగ్ అతికించని వాహనాల వల్ల టోల్ ప్లాజాలవద్ద అనవసర జాప్యం జరుగుతోంది. దీనివల్ల జాతీయ రహదారిని ఉపయోగించే ఇతరులకు అసౌకర్యం కలుగుతోంది.
వాహనం ముందు అద్దంపై ఫాస్టాగ్ను అతికించని వాహనాలకు రెట్టింపు యూజర్ చార్జీని వసూలు చేసేందుకు సవివరమైన ప్రామాణీకృత మార్గదర్శకాలను (ఎస్.ఒ.పి) ఫీజు వసూలుచేసే ఏజెన్సీలు, కన్సెషనీరలకు జారీచేశారు. జాతీయ రహదారులను ఉపయోగించే వాహనదారులు, వాహనం ముందు అద్దంపై ఫాస్టాగ్ లేకుండా టోల్ లైనులో ప్రవేశించినట్టయితే, అందుకు విధించే పెనాల్టీని , యూజర్ ఫీ ప్లాజాల వద్ద ప్రముఖంగా తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేస్తారు.
దీనితోపాటు, ఫాస్ ట్యాగ్ అతికించని వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ (విఆర్ఎన్) ను సిసిటివి ఫుటేజ్తో రికార్డు చేస్తారు. దీనివల్ల టోల్ లైనులో ఆయా వాహనాలకు వసూలు చేసిన ఫీజుకు సంబంధించిన రికార్డును నిర్వహించడానికి వీలు కలుగుతుంది.
ఇప్పటికే నిర్దేశించిన నిబంధనల ప్రకారం, వాహనం ముందు అద్దానికి లోపలివైపునుంచి ఫాస్ ట్యాగ్ను అతికించడానికి సంబంధించిన ప్రమాణీకృత మార్గదర్శకాలను అమలు చేసేందుకు ఎన్.హెచ్.ఎ.ఐ నిర్ణయించింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం వాహనం ముందు అద్దానికి ఫాస్ ట్యాగ్ను అతికించని వాహనం , టోల్ ప్లాజా వద్ద ఎలక్ట్రానిక్ చెల్లింపు లావాదేవీ (ఇ.టి.సి) జరపడానికి వీలు లేదు. ఇలాంటి వాహనాలు రెట్టింపు ఫీజు చెల్లించాల్సి ఉండడంతోపాటు వాటిని బ్లాక్లిస్టులో చేర్చే అవకాశం ఉంది. వాహనం ముందు అద్దంపై ఫాస్ ట్యాగ్ను అతికించాల్సిందిగా, వాహనదారులకు సూచించాలని వివిధ పాయింట్ ఆఫ్ సేల్ (పి.ఒ.ఎస్) లనుంచి వీటిని జారీచేసే బ్యాంకులను ఎన్.హెచ్.ఎ.ఐ ఆదేశించింది.
ఎన్.హెచ్.ఎ.ఐ సంస్థ , నేషనల్ హైవే ఫీ(రేట్ల నిర్ణయం, వసూలు) 2008 చట్టం ప్రకారం జాతీయ రహదారులపై యూజర్ చార్జీలను వసూలు చేస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45,000 కిలోమీటర్ల మేర గల జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ వే లపై 1000 టోల్ ప్లాజాల ద్వారా యూజర్ ఫీజును వసూలు చేస్తున్నారు.
8 కోట్లకు మందికి పైగా అనగా 98 శాతం వాడకం దారులతో ఫాస్టాగ్ దేశంలో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థను విప్లవాత్మకం చేసింది. ఫాస్టాగ్ను అతికించని వాహనదారుల నుంచి రెట్టింపు చార్జీ వసూలు చేసేందుకు తీసుకున్న నిర్ణయం, టోల్ కార్యకలాపాలను మరింత సమర్ధంగా నిర్వహించడానికి, జాతీయ రహదారులను ఉపయోగించే వారి సుఖవంతమైన, నిరంతరాయ ప్రయాణానికి సహాయపడనుంది.
***
(Release ID: 2034557)
Visitor Counter : 62