కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
2024 ఇండియా మొబైల్ కాంగ్రెస్ కోసం ‘ది ఫ్యూచర్ ఈజ్ నవ్’ ఇతివృత్తాన్ని విడుదల చేసిన కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాధిత్య సింధియా
ప్రధానాంశాలు:
- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం 4జీలో ప్రపంచాన్ని అనుకరించింది, 5జీలో ప్రపంచంతో కలిసి నడిచింది, ఇప్పుడు 6జీలో ప్రపంచానికి మన భారత్ నేతృత్వం వహించబోతున్నది: కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా.
- సాంకేతిక వ్యవస్థలో సరికొత్త పరిష్కారాలు, సేవలు, అత్యాధునికత వినియోగాన్నిప్రదర్శించేందుకు సరైన వేదికగా ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2024.
- 1000 మందికిపైగా పెట్టుబడిదారులు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, ఇంక్యుబేటర్లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్ల ప్రతినిధులతో 500కు పైగా సమావేశాలు, సంప్రదింపులు జరపాలనేది ఈ కార్యక్రమ లక్ష్యం.
- స్టార్టప్‌లు, ఎంఎస్ఈల కోసం పరీక్ష పథకం ప్రారంభించడంతో పాటు సైబర్ సెక్యూరిటీలో సామర్థ్య నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకున్న టెలికమ్యూనికేషన్ల విభాగం.
- 2023కు గానూ పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ టెలికాం ఎక్సెలెన్స్ అవార్డులు ప్రకటించిన టెలికమ్యూనికేషన్ల విభాగం.
Posted On:
19 JUL 2024 9:44AM by PIB Hyderabad
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 కోసం ‘ది ఫ్యూచర్ ఈజ్ నవ్’ ఇతివృత్తాన్ని గురువారం(జూలై 18, 2024) కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఆవిష్కరించారు. సాంకేతిక పరిణామక్రమంలో భారత్ కీలకంగా నిలిచిన తీరును ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తోంది. భవిష్యత్తు అనేది కేవలం ఒక భావన కాదని, అది ప్రస్తుతం జరుగుతున్నది అని చాటేలా.. ప్రపంచాన్ని మార్చే సాంకేతికతలను చురుగ్గా రూపొందించడానికి గానూ సహకారం కోసం దూరదృష్టి గల వారు, మార్గదర్శకులు, ఆవిష్కర్తలను ఐఎంసీ 2024 ఒక్క చోటకు చేరుస్తోంది.
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 కోసం నమోదు చేసుకోవడానికి ప్రత్యేకమైన యాప్, వెబ్‌సైట్‌ను కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ప్రారంభించారు. తన పేరును మొదట నమోదు చేసుకోవడంతో పాటు ప్రతినిధులు, సందర్శకులు, కళాశాలలు, విద్యాసంస్థలు, ప్రభుత్వం, మీడియా నమోదు ప్రారంభమైనట్టు తన ప్రసంగంలో ప్రకటించారు.
తన ప్రసంగంలో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి మాట్లాడుతూ... “ప్రజలను ఏకం చేసినప్పుడే సాంకేతికత అనేది ఉత్తమం అవుతుంది. దీనికి సరైన ఉదాహరణ మన భారతదేశం” అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధతకు అనుగుణంగా దేశవ్యాప్తంగా విభజనలను పూడ్చడంలో సాంకేతికత పాత్ర గుర్తించి ఆయన ప్రస్తావించారు. “సాంకేతికత, కమ్యూనికేషన్లు అనేవి సరికొత్త అవకాశాలకు వేదికను కల్పిస్తాయి. కమ్యూనికేషన్లు, నెట్‌వర్క్‌లు దేశంలోని అన్ని గ్రామాల ప్రజలను ఒకచోటకు చేరుస్తాయి” అని పేర్కొన్నారు.
ఐఎంసీ అంతర్జాతీయంగా కీలక కార్యక్రమమని, భవిష్యత్తులో ఇలాంటి వేడుకలకు భారత్ కేంద్రంగా ఉంటుందని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఫ్యూచర్ ఈజ్ నవ్’ ఇతివృత్తం.. మన సామర్థ్యాలు, మన విజయాలు, భవిష్యత్తు అవకాశాలను సూచిస్తోందని అన్నారు. గత పదేళ్లుగా భారతదేశంలో టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. గతంలో సాంకేతికతకు వినియోగదారుగా ఉన్న భారత్ ఇప్పుడు సాంకేతికతకు సరఫరాదారుగా మారిందని పేర్కొన్నారు. దేశంలో వచ్చిన టెలికాం చట్టం 2023, పీఎల్ఐ పథకం, వేగంగా 5జీని అందుబాటులోకి తేవడం వంటి టెలికాం సంస్కరణలను ఆయన ప్రశంసించారు. రానున్న 180 రోజుల్లో టెలికాం చట్టం 2023 నిబంధనలను నోటిఫై చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా 2023కు గానూ పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ టెలికాం ఎక్సెలెన్స్ అవార్డులను టెలికమ్యూనికేషన్ల విభాగం ప్రకటించింది. టెలికాం ఆవిష్కరణలు, నైపుణ్యాలు, సేవలు, తయారీ, అప్లికేషన్‌లలో ఆదర్శవంతమైన, అత్యుత్తమ సేవలకు గానూ వీరికి అవార్డులు దక్కాయి.
S. No.
|
అవార్డు గ్రహీత పేరు
|
Awardee Selected for their contribution in
|
1
|
డా. కిరణ్ కుమార్ కుచి, ప్రొఫెసర్, ఐఐటీ హైదరాబాద్
|
టెలికాం సాంకేతికత పురోగతి, మార్గదర్శకత్వంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు
|
2
|
ఎలెనా జియో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
నావ్ఐసీ-ఆధారిత పరికరాలు, అప్లికేషన్ల పురోగతికి అత్యుత్తమ సేవలు అందించినందుకు
|
3
|
ఆస్ట్రోమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
|
మిల్లీమీటర్-వేవ్ మల్టీ-బీమ్ సాంకేతికతను మొదటిసారిగా తీసుకొచ్చినందుకు
|
4
|
టెజాస్ నెట్‌వర్క్స్ లిమిటెడ్
|
టెలికాం ఆవిష్కరణలు, పరికరాల తయారీలో పురగోతి సాధించినందుకు
|
5
|
నివెట్టి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
సురక్షితమైన నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల కోసం అందించిన అత్యుత్తమ సేవలకు
|
పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ టెలికాం ఎక్సెలెన్స్ అవార్డులు-2023 అందిస్తున్న కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా
సైబర్ సెక్యూరిటీలో నిపుణుల స్థాయి శిక్షణ కోసం ఐఐటీ జమ్ముతో ఒప్పందం
వేదికపై ప్రముఖులతో కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా
స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈల కోసం పరీక్ష పథకాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు. సైబర్ సెక్యూరిటీలో సామర్థ్య నిర్మాణానికి ఎన్‌టీఐపీఆర్ఐటీ, ఐఐటీ జమ్ము మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆయన పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కమ్యూనికేషన్ల శాఖలోని టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) కార్యదర్శి, డీసీసీ చైర్మన్ డాక్టర్ నీరజ్ మిట్టల్ మాట్లాడుతూ.. భారతదేశ టెలికాం సామర్థ్యాలు, 5జీ విప్లవంలో సాధించిన విజయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కార్యక్రమానికి హాజరైన వారిని సీఓఏఐ చైర్మన్ శ్రీ అభిజిత్ కిశోర్ తన ప్రసంగం ద్వారా స్వాగతం పలికారు.
ఐఎంసీ-2024, డబ్ల్యూటీఎస్ఏ-2024, జీఎస్ఎస్-2024
ఆసియాలో ప్రధాన డిజిటల్ టెక్నాలజీ ప్రదర్శన అయిన 8వ ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ)ను టెలికమ్యూనికేషన్ల విభాగం(డీఓటీ), సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అక్టోబరు15 నుంచి ఈ కార్యక్రమం జరగనుంది.
ఐఎంసీ 2024తో పాటు ఏకకాలంలో భారత్ ఇదే వేదికపై ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సులైన.. వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ న్యూఢిల్లీ 2024(డబ్ల్యూటీఎస్ఏ), గ్లోబల్ స్టాండర్డ్స్ సింపోసియం(జీఎస్ఎస్ 2024)ను 2024 అక్టోబరు 14 నుంచి 24 వరకు నిర్వహించనుంది.
నేపథ్యాలు:
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024
ఒకప్పుడు మనం కలలు గన్న సాంకేతికతలు నేడు మన నిత్యజీవితంలో చురుగ్గా భాగమైన వాటిని గుర్తుచేసే అత్యవసరమైన, ఆసక్తికరమైన కార్యక్రమాలు ఐఎంసీ 2024లో ఉంటాయి. 6జీ, కృత్రిమ మేధ(ఏఐ), సెమికండక్టర్లు, ప్రసార, ఎలక్ట్రానిక్స్ తయారీ, సాట్‌కామ్, క్వాంటమ్, భద్రత వంటి అంశాల్లో తాజా పురోగతిని పరిశీలించడానికి ఆహుతులను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. సాంకేతిక వ్యవస్థలో సరికొత్త ఆవిష్కరణలు, సేవలతో పాటు పరిశ్రమ, ప్రభుత్వ, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, ఇతర భాగస్వాముల్లో అత్యాధునిక పద్ధతుల వినియోగాన్ని ప్రదర్శించేందుకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 సరైన వేదికగా నిలుస్తుంది .
ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ఐఎంసీ 2024లో 400 మంది ప్రదర్శకులు, 640 స్టార్టప్‌లతో పాటు అనేక సంస్థలు హాజరై తమ ఉత్పత్తులను, పరిష్కారాలను, వాటి వినియోగాలను ప్రదర్శిస్తారని అంచనా. 120కి పైగా దేశాలకు చెందిన 1,50,000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. 900కు పైగా సాంకేతికతల వినియోగ ప్రదర్శనలు, 100కు పైగా సెషన్లు, 600 మందికి పైగా ప్రసంగాలు నిర్వహించాలనేది ఈ కార్యక్రమ లక్ష్యం. మార్గదర్శకమైన స్టార్టప్ కార్యక్రమం ద్వారా 1000 మందికి పైగా పెట్టుబడిదారులు, ఏంజెల్ ఇన్వేస్టర్లు, ఇంక్యుబేటర్లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్ల ప్రతినిధులతో 500కు పైగా సమావేశాలు నిర్వహించడం ఐఎంసీ 2024 లక్ష్యం.
ఐఎంసీ 2024 యాప్
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో, యాపిల్ యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ సులువైన యాప్ ద్వారా కార్యక్రమానికి నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. కార్యక్రమంలో ఉన్న ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకునేలా అత్యాధునిక ఏఐ సాంకేతికతతో, వినియోగదారులకు ఉపయోగపడే ఫీచర్లతో ఈ యాప్‌ను రూపొందించారు. ఐఎంసీ వెబ్‌సైట్: https://registration.indiamobilecongress.com/ ద్వారా సులువైన పద్ధతిలో నమోదు చేసుకోవచ్చు.
పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ టెలికాం ఎక్సెలెన్స్ అవార్డు - 2023
టెలికాం ఆవిష్కరణలు, నైపుణ్యాలు, సేవలు, తయారీ, అప్లికేషన్ల రంగాల్లో ఆదర్శవంతమైన, అత్యుత్తమ సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు గత మూడేళ్లుగా ప్రతియేటా ఐదు పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ టెలికాం ఎక్సెలెన్స్ అవార్డులను అందిస్తున్నారు.
ఏడాదికోసారి ఇచ్చే అవార్డులో భాగంగా శాలువా, ప్రశంసాపత్రం లేదా ఫలకతో పాటు రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తారు.
అవార్డుల కోసం అందిన 75 దరఖాస్తులను కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి గ్రహీతలను ఎంపిక చేసింది.
స్టార్టప్‌లు, ఎంఎస్ఈల కోసం పరీక్ష, రీయింబర్స్‌మెంట్ పథకం
టెలికాం రంగంలో స్టార్టప్‌లతో పాటు సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల(ఎంఎస్ఈ)కు ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో టెలికమ్యూనికేషన్ల విభాగం(డీఓటీ) రీయిబర్స్‌మెంట్ పథకాన్ని ప్రారంభించింది. దేశీయ తయారీని ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను పెంపొందించడం కోసం ఈ పథకాన్ని రూపొందించింది. ఉత్పత్తుల నాణ్యత, విపణిలోకి వెళ్లేందుకు తప్పనిసరి అయిన పరీక్ష, ధ్రువీకరణ కోసం అయ్యే ఖర్చులకు గానూ స్టార్టప్ లేదా ఎంఎస్ఈకి రూ.50 లక్షల వరకు ఈ పథకం ద్వారా చెల్లిస్తుంది. ఇందుకోసం మొత్తం రూ.25 కోట్ల నిధులను కేటాయించింది. పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతి ద్వారా దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం సులువుగా, దరఖాస్తులను సమర్థవంతంగా పరిశీలించేలా ఉంది. స్టార్టప్‌లు 75 శాతం, సూక్ష్మ వ్యాపార సంస్థలు 60 శాతం, చిన్న వ్యాపార సంస్థలు 50 శాతం నిధులను పొందుతాయి. ఇది టెలికాం పరిశ్రమలో సమానమైన ఎదుగుదలకు, ఆవిష్కరణలకు మద్దతు ఇస్తున్న డీఓటీ నిబద్ధతను ప్రతిబింబిస్తోంది.
అర్హతలకు సంబంధించిన మరింత సమాచారం, దరఖాస్తు నియమాల కోసం డీఓటీ అధికారిక వెబ్‌సైట్ - https://ttdf.usof.gov.in/reimbursement సందర్శించగలరు.
సైబర్ సెక్యూరిటీలో సామర్థ్య నిర్మాణం కోసం ఐఐటీ జమ్ము, ఎన్‌టీఐపీఆర్ఐటీ మధ్య ఒప్పందం
టెలికమ్యూనికేషన్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో వృద్ధి చెందుతున్న భారత్‌లో ప్రజలు ఎలక్ట్రానిక్ సేవల వినియోగం వైపు మళ్లుతున్నారు. దీంతో సైబర్ సెక్యూరిటీ సాధనాలు, సాంకేతికను సేకరించుకోవడంతో పాటు వీటిపై పని చేయగల మానవవనరుల అవసరం కూడా పెరుగుతోంది. ఇందుకోసం డీఓటీ, ఎన్‌టీఐపీఆర్ఐటీ కలిసి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమను భాగం చేస్తూ ఒక కార్యక్రమానికి రూపకల్పన చేశాయి. ఈ రంగంలో లోతైన అవగాహన కలిగేలా నిపుణులను సిద్ధం చేసేందుకు, భారత్‌లో అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ సాధనాలు, పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు, భవిష్యత్తు కోసం సైబర్ నిపుణులను సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ నిపుణులు ఇంకా అనేక మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా భారత్‌లో క్రమంగా సైబర్ నిపుణులు తయారవుతారు.
ఆరు నెలల పాటు హైబ్రిడ్ పద్ధతి(విద్యా ప్రాంగణం, ఆన్‌లైన్)లో శిక్షణ ఇచ్చేలా ఐఐటీ జమ్ముతో ఎన్‌టీఐపీఆర్ఐటీ ఒప్పందం చేసుకుంది. ఎంపిక చేసిన 30 మంది అధికారులతో పాటు ఈ రంగంలోని భాగస్వామ్య సంస్థల వారికి శిక్షణ ఉంటుంది.
****
(Release ID: 2034357)
Visitor Counter : 123